సీఎంకు ‘పనికి రాని’ ఫైళ్లు వెనక్కి!
పనికి వచ్చే ఫైళ్లపై మంగళవారం వరకు కిరణ్ సంతకాలు
సాక్షి, హైదరాబాద్: రాజీనామా చేయడానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు పనికి వచ్చే ఫైళ్లపై సంతకాలు కానిచ్చేశారు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఇదే పనిలో ఉన్నారు. తనకు పనికి రావనుకున్న వందలాది ఫైళ్లను మాత్రం ఆయన ముట్టుకోలేదు. సాధారణంగా ఆమోదం పొందాల్సిన ఫైళ్లపై కూడా సీఎం కరుణ పడలేదు. దీంతో మిగిలిపోయిన వందలాది ఫైళ్లను సీఎం కార్యాలయ అధికారులు ఆయా శాఖల కు బుధవారం మధ్యాహ్నం నుంచే పంపించేయడం ప్రారంభించారు.
సాధారణ పరిపాలన, పోలీసు, రెవెన్యూ, ఇంధన, ఆర్థిక శాఖకు చెందిన వందల సంఖ్యలో ఫైళ్లను అజయ్ కల్లం ఆయా శాఖలకు తిరిగి పంపిచేశారు. అలాగే జవహర్‌రెడ్డి కార్యాలయం నుంచి వివిధ శాఖలకు చెందిన 350 ఫైళ్లను ఆయా శాఖలకు తిరిగి పంపేశారు. రావత్, శ్రీధర్ కార్యాలయాల నుంచి కూడా మిగిలిన ఫైళ్లను ఆయా శాఖలకు పంపించేశారు. ఇదిలా ఉండగా సీఎం చేత ఆమోదింప చేసుకున్న ఫైళ్లకు సంబంధించి జీవోలు జారీ అవుతాయా లేదా అనే ఆందోళనతో పైరవీకారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ కేటాయింపులతో పాటు విజిలెన్స్, ఎసీబీ కేసులకు సంబంధించిన పలు ఫైళ్లపై ముఖ్యమంత్రి చివరి రోజుల్లో సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సీఎం రాజీనామాతో అధికారులు ఆ ఫైళ్లకు సంబంధించిన జీవోలను జారీ చేస్తారా లేదా అనే ఆందోళనలో పైరవీకారులున్నారు. మరోవైపు సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన అజయ్ కల్లం బుధవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. అలాగే సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన జవహర్‌రెడ్డి సాగునీటి శాఖ కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు.