co operative societys
-
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కొత్త సభ్యత్వాలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచిరేవులలోని జూబ్లీహిల్స్-4 ప్లాట్ల అమ్మకంపై కూడా ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.కాగా, కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారనే విమర్శలు ఉన్నాయి.సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.ఇదీ చదవండి: ‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్! -
‘సహకార’ వ్యూహం ఫలించేనా?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు, నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. భారత్‌లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక పాలనా, న్యాయశాసన, విధానపరమైన చట్రాన్ని ఈ కొత్త శాఖ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక రోజు తర్వాత ఈ నూతన మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. విడివిడిగానే అయినప్పటికీ కలిసే వచ్చిన ఈ రెండు ప్రకటనలపై పరిశీలకులు అంచనాలు మొదలెట్టేశారు. వాస్తవానికి కో-ఆపరేటివ్‌లు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దేశం లోని ప్రతి రాష్ట్రం కో-ఆపరేటివ్‌లకు రిజిస్ట్రార్‌ని నియమిస్తుంది. ఈ రంగాన్ని మొత్తంగా ఆ రిజిస్ట్రారే పర్యవేక్షిస్తుంటారు. పైగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇంత పటిష్ట నిర్మాణం ఉంటూండగా, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఎందుకు సృష్టించినట్లు? పైగా ఈ శాఖను అమిత్ షా చేతిలో పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర రంగాలకు మల్లే సహకార సంస్థలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. అవి సామాన్యంగా పతాక శీర్షికలకు ఎక్కవు. కానీ గ్రామీణ భారత్‌ని, క్రమబద్ధీకరణ లేని ఆర్థిక వ్యవస్థను బలపర్చే ఆర్థికపరమైన చట్రంలో ఇవి భాగం. ఉత్పత్తి (చక్కెర), పరపతి (పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్‌లు, సహకార బ్యాంకులు), మార్కెటింగ్ (పాల కో-ఆపరేటివ్‌లు) వంటి వాటిలో వీటి ఉనికిని మనం చూడవచ్చు. పాత వైపరీత్యం దిద్దుబాటే లక్ష్యమా? చాలాకాలంగా కొనసాగుతున్న ఒక నియమ విరుద్ధమైన వైపరీత్యాన్ని చక్కదిద్దడానికే కేంద్రం ఈ పనికి పూనుకుందని భావిస్తున్నారు. కో–ఆపరేటివ్‌లు నిజానికి రాష్ట్ర పరిధిలోనివే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై ఒక కన్నేసి ఉంచుతూ వస్తోంది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సహకార సంస్థల పర్యవేక్షణ విభాగం ఉంటోంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నప్పటికీ, కో–ఆపరేటివ్‌ల అవసరాల పట్ల ఈ శాఖ పెద్దగా స్పందించదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. కాలానుగుణంగా కోఆపరేటివ్లు మారుతూవచ్చాయి. కొత్తగా సహకార రంగంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉండటం లేదు. ఇప్పుడవి గృహనిర్మాణం, కార్మిక రంగాలలో ప్రవేశిస్తున్నాయి. ఈ కారణాలవల్ల సహకార సంస్థలను కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఏమంత అర్థవంతమైన చర్య కాదు అని ఆ అధికారి చెప్పారు. అయితే మోదీ నిర్ణయం ప్రకారం అమిత్ షా ఈ కొత్త శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. కో-ఆపరేటివ్‌లు అభివృద్ధికి ఉపకరణాలుగా ఉపయోగపడేవి కాబట్టి రాజకీయ లక్ష్యాలు తెరమీదికి వస్తుండేవి. సహకార సంస్థలు... రాజకీయాల ప్రాబల్యం నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకొచ్చిన గుజరాత్ నమూనాకు సంబంధించిన కీలకమైన అంశాల్లో కో-ఆపరేటివ్‌లపై బీజేపీ నియంత్రణ ఒకటనే విషయం ఎవరికీ పెద్దగా తెలీదు. 1990లలో బీజేపీ... గుజరాత్లో రుణపరపతి సహకార సంస్థలపై నియంత్రణను ఏర్పర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అమూల్ జిల్లా పాల యూనియన్లపై పట్టు సాధించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, స్థానిక అధికార వ్యవస్థలను బలహీనపర్చి వాటిని తొలగించడమే దీని ఉద్దేశం. దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే... ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్లో పాల సహకార వ్యవస్థ చాలా పెద్దది. గుజరాత్‌లోని 17 వేల గ్రామాల్లో 16,500 గ్రామాలు డెయిరీల పరిధిలో ఉంటున్నాయి. అందుకే 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాక సహకార సంస్థలను కైవసం చేసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. కో-ఆపరేటివ్‌ల యాజమాన్యాలపై కేసులు పెట్టి వారు బీజేపీలో చేరకతప్పని పరిస్థితి కల్పించారు. 2017 నాటికి కో-ఆపరేటివ్‌లను పూర్తిగా కైవసం చేసుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతుల్లో ఒక్క కోఆపరేటివ్ సంస్థ కూడా లేకుండా పోయింది. మొత్తం మీద చూస్తే రాజకీయ లాభం కోసం కో-ఆపరేటివ్‌లను ఉపయోగించుకోవడం గుజరాత్లో స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయనేతలు అతిగా ఖర్చుపెట్టడం, పలు కాంట్రాక్టుల ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుకావడంతో డెయిరీ ఆర్థికవ్యవస్థలు క్షీణించిపోయాయి. సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖపై మరో రెండు కొత్త ఊహలు కూడా చోటుచేసుకుంటున్నాయి. యూపీలో గ్రామీణ అసంతృప్తిని చల్లార్చడం ఎలా? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతులను శాంతపర్చడానికి కేంద్రం చేస్తున్న తీవ్రప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్దనోట్ల రద్దు వంటి భారీ పథకాన్ని ప్రకటించడానికి బీజేపీ ఏదోలా జోక్యం చేసుకోవడం తప్పేటట్టు లేదు. ప్రైవేట్ కంపెనీలే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనేస్తాయనే భయాందోళనలనుంచి రైతులను బయటపడేయడానికి పెద్ద ఎత్తున సహకార సంస్థలను రంగంలోకి దింపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికలకు ముందుగా భారీ పథకం ప్రకటించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుండా చేయవచ్చని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరొక ఊహాకల్పన ఏమిటంటే గుజరాత్లో మోదీ, షా ట్రాక్ రికార్డుపై ఎక్కువగా ఆధారపడుతూ దేశం మొత్తాన్ని గుజరాత్‌గా మలచాలని లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు భావిస్తున్నారు. మూడో ఊహ ఏమిటంటే, శరద్ పవార్ ఎన్సీపీ వంటి పార్టీలు మహారాష్ట్ర షుగర్ కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధించడం ద్వారానే రాష్ట్ర రాజ కీయాల్లో తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. ఈ కో-ఆపరేటివ్‌లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని మునుపటి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు. అయితే ఇది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాబోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్ సంస్థలు బలంగా ఉంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, గ్రామీణులపై బీజేపీ, ఎన్డీఏ పట్టు సడలిపోయిన సమయంలో కో-ఆపరేటివ్‌లు వారికి ఒక దారి చూపుతున్నట్లుంది. ఇప్పటికే రైతుల ఆందోళనలు వ్యవసాయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని బలహీనపర్చాయి. తిరిగి మండీల బాట పట్టడానికి బదులుగా కో-ఆపరేటివ్‌లపై పట్టు సాధిస్తే ఆ వ్యవస్థ మొత్తాన్నే కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు మాత్రమే కాకుండా ఇతర ఎన్నికలకు కూడా కో-ఆపరేటివ్‌లు ఎక్కువ నిధులను అందించే అవకాశం మెండుగా ఉంది అని గుజరాత్ పరిశీలకులు ఒకరు చెప్పారు. కో-ఆపరేటివ్ సొసైటీల కేంద్ర రిజిస్ట్రార్‌ను మంత్రిత్వ శాఖ గుప్పిట్లో పెట్టుకుంటే రాష్ట్రాల కో-ఆపరేటివ్ సొసైటీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. అయితే కేంద్రం కో-ఆపరేటివ్ సంస్థలను ఎలా అదుపుచేస్తుంది అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి. వచ్చే ఆరు నెలల్లోనే సహకార సంస్థలపై సంచలన చట్టం రూపకల్పనను మనం చూడవచ్చు. దేశం సాధించిన అద్భుత విజ యాల్లో సహకార సంస్థలు కూడా ఒకటి. కానీ రాజకీయ హైజాకింగ్ వల్ల ఇవికూడా స్వయంపాలనను కోల్పోయి తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో రాజకీయ నాయకులు మాత్రమే లాభపడి, దేశ ప్రజలు నష్టపోయే రోజులు రాబోతున్నాయన్నదే అందరి ఆందోళన. దీంతో కో-ఆపరేటివ్‌లను అంతర్జాతీయంగా పోటీపడేలా రూపుదిద్దడం అనే సవాలు కూడా ప్రశ్నార్థకం కానుంది. ఎమ్. రాజశేఖర్ వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు (‘ది వైర్’ సౌజన్యంతో..) -
మీ జీవితాల్లో వెలుగులు రావాలి: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట : ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు రావాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో జరిగిన కో-ఆపరేటివ్ సొసైటి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని, అందుకే వారి కోసం కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లకు సమాజంలో గౌరవాన్ని పెంచేలా తోడ్పాటును అందిస్తామన్నారు. సిద్ధిపేట అన్నింటిలోనూ ఆదర్శంగా నిలుస్తోందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని అన్నారు. సిద్ధిపేట కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆటో డ్రైవర్లకు రుణాలు మంజూరు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు అప్పుల ఉచ్చులో పడకుండా కో ఆపరేటివ్ సొసైటి ద్వారా స్వయం సమృద్దిని సాధించాలని ఆయన సూచించారు. వచ్చే నెల రోజుల్లో డ్రైవర్లకు అత్యంత పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ ఈ సొసైటిలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ వ్యక్తిగతంగా శుభ్రత, డ్రైస్ కోడ్ పాటించాలని.. వృత్తిని నమ్ముకుని జీవించే వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నారు. సిద్ధిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం 300 గజాల స్థలం ఇప్పిస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారి కోసం రూ. 5 లక్షల బీమా అందించేలా చూస్తామన్నారు. -
ఐడీసీఎంఎస్ డీలా
ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో కొనసాగిన ఐడీసీఎంఎస్ క్రమంగా డీలా పడుతోంది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. సంస్థలోని ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితిలో ఉంది. కీలక బాధ్యతల్లో కొందరు అక్రమార్కుల కారణంగానే ఈ స్థితికి చేరిందని సంస్థలోని ఉద్యోగుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైన ఐడీసీఎంఎస్, వీటి ద్వారా వచ్చే కమీషన్‌తోనే ఖర్చులు వెళ్లదీస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సహకార సంఘాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వరంగ సంస్థ ఐడీసీఎంఎస్ (ఇందూరు జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పలు వ్యాపార కార్యకలాపాలు.. రూ.కోట్లలో టర్నోవర్.. ఇలా ఒకప్పుడు ఆర్థిక పరిపుష్టితో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు కనీసం ఉద్యోగులకు ప్రతినెలా సక్రమంగా జీతభత్యాలు చెల్లించలేని స్థితికి దిగజారింది. పాలకవర్గం పట్టింపులేని ధోరణి ఒకవైపు.. సంస్థ అధికారుల అలసత్వం మరోవైపు.. సంస్థ ప్రతిష్ట మసకబారడానికి కారణమవుతున్నాయి. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులకు రెండునెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ దాదాపు ఏడాదిన్నర కాలంగా చెల్లించలేదు.. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఐడీసీఎంఎస్‌కు జిల్లాలో వివిధ చోట్ల రూ. కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో ప్రధాన వ్యాపార కూడళ్లలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, గోదాములు, స్థలాలున్నాయి. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్మూర్‌లో 18 షాపుల మడిగెలుండగా వీటి కిరాయి వసూళ్లు అస్తవ్యస్తంగా మారింది. వీటి అగ్రిమెంట్ పూర్తై ఏడాది గడుస్తున్నప్పటికీ కేటాయింపుల ప్రక్రియ చేపట్టలేదు. కొన్ని మడిగెలకైతే ఏడాది కాలంగా అద్దె వసూలు చేయకపోవడం గమనార్హం. కొందరు ‘గుడ్‌విల్’ పేరుతో పైపైన జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కీలక బాధ్యతల్లో అక్రమార్కులు.. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, సస్పెన్షన్ వేటు పడిన అధికారులు ఈ సంస్థలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కారణంగానే సంస్థ పరిస్థితి ఇలా మారిందని సంబంధిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో సూపర్‌మార్కెట్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారవడంతో ఇందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దానిని లీజుకు తీసుకుని నడిపారు. ఈ వ్యవహరంలో రూ.లక్షల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ విచారణలో తేలింది. దీంతో సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ఈ అధికారే ఈ సంస్థ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ‘కొనుగోలు కేంద్రాల’కే పరిమితం.. ప్రస్తుతం ఈ సంస్థ ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితమైంది. వీటి ద్వారా వచ్చే అరకొర కమీషన్ మొత్తంతో సంస్థ ఖర్చులు వెళ్లదీసుకునే స్థితిలో ఉంది. కొన్ని సీజన్లలో ఫర్టిలైజర్ సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ హాస్టళ్లకు నిత్యావసర సరుకుల కాంట్రాక్టు పొందిన ఈ సంస్థ వాటి సరఫరాను సక్రమంగా నిర్వహించకపోవడంతో సరుకులు పనికి రాకుండాపోయా యి. నెలలపాటు సరుకులు గోదాముల్లో నిల్వ ఉంచడంతో భారీ మొత్తంలో సంస్థకు నష్టం వాటిల్లింది. పలు అవకతవకలు.. ఐడీసీఎంఎస్ కార్యకలాపాల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల కిత్రం ఐడీసీఎంఎస్ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ చార్జీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని డ్రా చేసుకుని కొన్ని గ్రామాల్లోని రైతులకు మాత్రమే పంపిణీ చేశారనే విమర్శలున్నాయి. నిధులు రావాల్సి ఉంది.. నిధులు అందుబాటులో లేకపోవడంతో రెండునెలల జీతాలు చెల్లించలేకపోయాం. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన కమీషన్ రాగానే చెల్లిస్తాం. మడిగెల అద్దె వసూలుకు చర్యలు తీసుకుంటాం. వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై పాలకవర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మా బాధ్యత. – బి.రమేశ్, ఐడీసీఎంఎస్ మేనేజర్ -
ముగిసిన కాలపరిమితి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పర్సనల్ ఇన్చార్జిలను నియమించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ ఇన్చార్జిలను నియమించే అధికా రం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. ఉత్తర్వుల్లో ప్రస్తుత పాలకవర్గాలను ఆరునెలల పాటు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలని ఉన్నా.. తుది నిర్ణయాన్ని సహకార శాఖ రిజిస్ట్రార్‌కు వదిలేయ డంతో ప్రస్తుత పాలకవర్గాల్లో కొన్నింటిని తప్పించే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 91 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి కాలపరిమితి జనవరి 30తో ముగియగా, మరికొన్ని సంఘాల పాలకవర్గాల కాల పరిమితి శనివారానికి ముగియనున్నాయి. ప్రభుత్వం సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు. మరోవై పు సహకార ఎన్నికల నిర్వహణలో మార్పులు తీసు కురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పాలకవర్గాల కాల పరిమితి ముగిసిన సంఘాలకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లను పర్సనల్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తూ మరో ఆరు నెలలు పొడిగింపు ఇచ్చింది. అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలతోనే వీరి కాల పరిమితి ముగియనుంది. వీటితో పా టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, మార్కెటింగ్ సహకార సంఘాలకు ప్రస్తుత చైర్మన్లే పర్సనల్ ఇన్చార్జిలుగా కొనసాగే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలు జరిగా యని ప్రభుత్వం డీసీసీబీ పాలక వర్గాన్ని సస్పెండ్ చే సింది. అప్పటి నుంచి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ను ఆఫీసర్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో కలెక్టర్ పర్సన్ ఇన్చార్జిగా కొనసాగనున్నారు. ఓరుగల్లు సహకార మార్కెటింగ్ సంస్థ చైర్మన్‌గా ప్రస్తుతం నూకల వేణుగోపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. వివరాల సేకరణలో అధికారులు.. పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, సహకార మార్కెటింగ్ సంస్థల పాలక వర్గాలకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల వివరాలను జిల్లా సహకార అధికారులు సేకరిస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వీరిని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించిన క్రమంలో సహకార శాఖ వీరి వివరాలు సేకరిస్తుంది. సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు బకాయిలు ఉన్నారా? అక్రమాలకు పాల్పడ్డారా తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు రెండు రోజుల్లో రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపనున్నారు. బకాయిలు, అవకతవకలకు పాల్పడినవారిని పర్సన్ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించే అవకాశముంది. ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ పాలకవర్గం విషయంలోను ఇదే నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పర్సన్ ఇన్చార్జిల నియామకాల ముందు జిల్లా మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఎవరు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతారో.. ఎవరు తొలగించబడుతారోననే సందిగ్ధంలో పాలవర్గాలు ఉన్నాయి. -
సహకార పునర్విభజన ఎప్పుడో?
రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సేవలు విస్తృతం కావడంలేదు. ఆయా సంఘాల పరిధి ఎక్కువగా ఉండటం.. గ్రామాలకు దూరంగా సంఘాలు ఉండడంతో అన్నదాత ఇబ్బందులు పడాల్సివస్తోంది. జిల్లాలో 18 మండలాలుండగా.. 51 సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. కొన్ని మండలాల్లో రెండు, మూడు గ్రామాలకు ఒక సహకార సంఘం ఉండగా.. మరికొన్ని మండలాల్లో 8 నుంచి 10 గ్రామాలకు ఒకటి ఉండటంతో దూరం భారంగా మారింది. కథలాపూర్(వేములవాడ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పల్లెల్లోని రైతులకు పట్టుగొమ్మలాంటివి. పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. పంటలను కొనుగోలు చేస్తూ సేవలందిస్తున్నాయి. వీటి విస్తర్ణ గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయి సేవలందడంలేదని అపవాదు ఉంది. 51 సొసైటీలు.. 95 వేల మంది సభ్యులు జిల్లాలో 18 మండలాలకు ప్రస్తుతం 51 సొసైటీలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు ప్రతి పంట సీజన్లో రుణాలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కొత్తగా రుణాలు తీసుకుంటారు. వీటికోసం దూరంలో ఉన్న సొసైటీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. దీంతో ఆ మండల రైతులు ఇతర మండలంలోని సొసైటీకి వెళ్లాల్సిందే. జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో తక్కువ గ్రామాలుండగా.. మరికొన్ని సొసైటీలకు ఎక్కువ గ్రామాలున్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనులకు రైతులు వెళ్లిరావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రుణాలకోసం, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో రాజకీయ చైతన్యం, పలుకుబడి గల మండలాలు చిన్నవైనప్పటికీ రెండు నుంచి మూడు సొసైటీలు ఉన్నాయి. మిగతా మండలాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. విభజిస్తేనే ప్రయోజనం... వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే సహకార సంఘాల సేవలు అందుబాటులోకి రావాలంటే వాటిని విభజించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొత్తగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను విభజించాలని రైతులు కోరుతున్నారు. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యత్వం ఉండగా.. ఏ అవసరం వచ్చిన క్యూ కట్టాల్సి వస్తోంది. ప్రతి సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం సొసైటీల విభజనపై దృష్టి సారించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు. సొసైటీ లేక ఇబ్బంది.. మా ఊరిలో సహకార సంఘం లేదు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూషణరావుపేట సొసైటీ పరిధిలో మా గ్రామం ఉంది. వివిధ అవసరాల కోసం అక్కడకు రైతులు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. సీజన్లో పంట రుణాల కోసం పోతే ఒక్కరోజంతా వృథా అవుతుంది. మా ఊరికి సమీపంలో సొసైటీ ఏర్పాటు చేయాలి. –కారంగుల చంద్రయ్య, కలిగోట, కథలాపూర్ ఆదేశాలు వస్తే పునర్విభజన.. సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంటుంది. జిల్లాలో బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. ఆ మండలంలో కొత్తగా సహకార సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారుచేశాం. మిగతా సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వం నిర్ణయం బట్టి ఉంటుంది. –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి -
‘సహకారం’పై... వడ్డీ రాయితీల దెబ్బ
అమలాపురం టౌన్ : క్షేత్రస్థాయిలో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ఒకప్పుడు లాభాలు, నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు నష్టాల అంచులపై వేలాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో ఏ సంఘం రికార్డులు పరిశీలించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడ్డీ రాయితీల నిధులు జమ కాకపోవడంతో సంఘాల ఆర్థిక ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు సహకార సంఘాల ద్వారా ఇచ్చే పలు రకాలు రుణాలను సకాలంలో చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత శాతాలతో వడ్డీ రాయితీలు ఇవ్వటం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. గత మూడు సంవత్సరాలుగా సంఘాలకు ప్రభుత్వాలు వడ్డీ రాయితీలకు సంబంధించిన నిధులు జమ చేయకపోవటంతో ఆర్థిక ఒడుదొడుకులు ప్రారంభమయ్యాయి. ఏడాది కిందటి వరకూ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ నిల్వలతో ఉన్న సంఘాలు ఇప్పుడు ఇ¯ŒS బ్యాలె¯Œ్సలో పడిపోతున్నాయి. ఆ రూ.90 కోట్లు జమైతేనే సంఘాలకు జీవం... జిల్లాలో సహకార సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘ కాలిక, స్వల్ప కాలికంగా ఇస్తున్న వడ్డీ రాయితీల బకాయిలు గత మూడేళ్ల నుంచి దాదాపు రూ.90 కోట్లు పేరుకుపోయింది. ఒక్కో సంఘానికి రుణ బట్వాడాల స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఈ రాయితీల రూపేణా జమ కావాల్సి ఉంది. ఈ రూ.90 కోట్లు ప్రభుత్వాలు జమ చేస్తేనే సంఘాలు మనుగడ సాగించే అవకాశం ఉంది. 2016 సంవత్సరానికి దీర్ఘ కాలిక రుణాలపై ఇచ్చిన 6 శాతం వడ్డీ రాయితీ నిధులు దాదాపు రూ.15 కోట్ల వరకూ జమ కావాల్సి ఉంది. స్వల్పకాలిక రుణాలపై ఇస్తున్న 0 శాతం వడ్డీ రాయితీ అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం రాయితీ 2103 నుంచి విడుదల కావల్సి ఉండగా...కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 3 శాతం రాయితీ 2014 నుంచి రావాల్సి ఉంది. 0 శాతం వడ్డీ రాయితీ దాదాపు రూ.75 కోట్ల మేర పేరుకుపోయింది. 0 శాతం వడ్డీ వర్తింపునకు ప్రభుత్వం ప్రతి ఏటా ఓ జీవో విడుదల చేస్తుంది. 2015–16 సంవత్సరానికి ఆ జీవో విడుదల చేయకపోవటం గమనార్హం. ఈ పరిణామాన్ని గమనిస్తుంటే భవిష్యత్తులో 0 శాతం వడ్డీకి మంగళం పాడే అవకాశాలున్నాయనే అనుమానాన్ని బలపరుస్తోంది. కొన్ని వైఫల్యాలూ కారణమే... సహకార సంఘాలను పూర్తి కంప్యూటరీకరణ చేసి వాణిజ్య బ్యాంకుల మాదిరిగా వేగవంతంగా ఆ¯ŒSలై¯ŒS సేవలు చేయాలని జిల్లా సహకార శాఖ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే దీన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాయి. రైతుల నుంచి రుణాలు జమైన వెంటనే ఆ సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ¯ŒSలై¯ŒSలో తక్షణమే వాణిజ్య బ్యాంకులు చేర్చుతాయి. సహకార సంఘాల్లో మాన్యువల్ విధానంలో రుణాలు జమవుతున్నా ఆ సమాచారం ప్రభుత్వాలకు అందటంలో జాప్యం జరుగుతోంది. అందుకే సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు సకాలంతో జమ కావటం లేదని సహకార అధికారులు అంటున్నారు. ఆ¯ŒSలై¯ŒS లేదన్న సాకుతో రాయితీల నిధలు ఇవ్వకపోవటం అన్యాయమేమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లోన్నైనా జిల్లాలో సహకార రంగాన్ని ఆప్కాబ్, డీసీసీబీలు సానుకూలతతో చర్యలు చేపట్టాలని రైతు ప్రతినిధులు సూచిస్తున్నారు. డీసీసీబీ మహా జనసభలో ప్రస్తావన... సంఘాలకు వడ్డీ రాయితీల నిధులు జమకాని వైనంపై ఈ నెల మూడో తేదీన కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో జరిగిన జన మహాసభలో జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ప్రస్తావించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 0 వడ్డీకి విడుదలైన జీవో 270, ఆ తరువాత సరవణ జీవోతో సంఘాలకు వడ్డీ రాయితీలపరంగా ఇబ్బందులు లేవని..గత మూడేళ్లుగా కొర్రీ పెట్టడంతో సంఘాల మనగడ అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే సంఘాలను నడపలేం... వడ్డీ రాయితీల నిధులు ప్రభుత్వాలు జమ చేయకపోతే సంఘాలను నడపలేం. ఇప్పటికే మా కోన సీమలోని 116 సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వల పరంగా అ¯ŒS బ్యాలె¯Œ్సలో పడి సంఘాల మనుగడ ప్రశ్నార్ధకయ్యేలా మారాయి. అమలాపురం మండలంలో ఎ.వేమరం, సాకుర్రు, ఇందుపల్లి వంటి సంఘాల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. రావాలి్సన వడ్డీ రాయితీల నిధులు జమ చేస్తేనే సహకార సంఘాల వ్యవస్థ కొనసాగుతుంది. – గోకరకొండ విజయ రామారావు, అధ్యక్షుడు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య