సాక్షి, సిద్దిపేట : ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు రావాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో జరిగిన కో-ఆపరేటివ్ సొసైటి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని, అందుకే వారి కోసం కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లకు సమాజంలో గౌరవాన్ని పెంచేలా తోడ్పాటును అందిస్తామన్నారు. సిద్ధిపేట అన్నింటిలోనూ ఆదర్శంగా నిలుస్తోందని అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని అన్నారు. సిద్ధిపేట కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆటో డ్రైవర్లకు రుణాలు మంజూరు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.
ఆటో డ్రైవర్లు అప్పుల ఉచ్చులో పడకుండా కో ఆపరేటివ్ సొసైటి ద్వారా స్వయం సమృద్దిని సాధించాలని ఆయన సూచించారు. వచ్చే నెల రోజుల్లో డ్రైవర్లకు అత్యంత పారదర్శకంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ ఈ సొసైటిలో సభ్యత్వం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ వ్యక్తిగతంగా శుభ్రత, డ్రైస్ కోడ్ పాటించాలని.. వృత్తిని నమ్ముకుని జీవించే వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నారు. సిద్ధిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం 300 గజాల స్థలం ఇప్పిస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారి కోసం రూ. 5 లక్షల బీమా అందించేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment