Co-option members
-
40 మంది ప్రతినిధులు అవుట్!
సాక్షి, హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారం గందరగోళానికి దారితీసింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున టీపీసీసీ ప్రతినిధులను నియమించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. వీరికి తోడు మొత్తం ప్రతినిధుల్లో 15 శాతం మందిని అదనంగా కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు ఇటీవల జరిగిన పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యుల నియామక వ్యవ హారం ఓ ప్రహసనంగా మారిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పీసీసీ, ఎన్నికల రిటర్నింగ్ అసిస్టెంట్ అధికారి మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని గుర్తించగా పీసీసీ దిద్దుబాటుకు ఉపక్రమించింది. అనధికార జాబితాలోని 40 మందిని తొలగించి కొత్త జాబితా విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఏం జరిగింది? కాంగ్రెస్ ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 238 మందిని పీసీసీ ప్రతినిధులుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ 238లో 15%.. అంటే 36 మందిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇలా మొత్తం 274 మందిని పీసీసీ ప్రతినిధులుగా ఎంపిక చేయవచ్చు. కానీ ఇటీవల జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 330 మంది వరకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా ప్రతినిధులకు సమాచారం వెళ్లింది. అంతేగాకుండా పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే ఇటీవల నాంపల్లిలో జరిగిన ఒక సమావేశానికి హాజరు కావాలని కూడా వీరందరికీ సమాచారం వెళ్లింది. భగేల్‌పై ఒత్తిడి వల్లే గందరగోళం కొందరు కాంగ్రెస్ నేతలు.. తమ వర్గానికి చెందిన నేతల పేర్లను కోఆప్షన్, ప్రతినిధుల జాబితాలో చేర్చాల్సిందిగా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వచ్చిన రాజ్‌భగేల్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం వల్లే ఈ గందరగోళం నెలకొందనే చర్చ జరుగుతోంది. పీసీసీకి తెలియకుండానే భగేల్ జాబితాను రూపొందించి ఖరారు చేశారని అంటున్నారు. నియోజకవర్గానికి ఇద్దరు ప్రతినిధుల చొప్పున మాత్రమే ఎన్నుకోవాల్సి ఉండగా, ఆలేరులో ఏడుగురు, జనగామలో ఆరుగురు, నకిరేకల్ నుంచి ఆరుగురుకి పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది. పైగా నియోజకవర్గంలో పెద్దగా పలుకుబడి లేని వారిని, ప్రజలతో అసలు సంబంధాలు లేని వారిని పీసీసీ ప్రతినిధులుగా నియమించారనే చర్చా జరుగుతోంది. దీనిపై పలు నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం. కాగా అసలు ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులుగా ఎంపికైన వారి జాబితా పీసీసీ వద్ద కూడా లేకపోవడం గమనార్హం. దీంతో తమకు జాబితా ఇవ్వమని అడిగితే ఇవ్వలేదనే ఫిర్యాదులు కూడా సీనియర్ల నుంచి వస్తున్నాయి. పొరపాటు సరి చేయండి ఈ నేపథ్యంలో టీపీసీసీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పొరపాటును సరిదిద్దాల్సిందిగా సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్.. ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీతోపాటు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వచ్చిన కేరళ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్‌లను కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా ఉన్నితన్‌తో మాట్లాడారని, ఒకట్రెండు రోజుల్లో పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. -
5న దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
దుగ్గిరాల(తెనాలిటౌన్): దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈనెల 5న జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి ఆదివారం తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆమె వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ ప్రసన్న వ్యవహరిస్తారని, గతంలో కోరం లేక పోవడంతో మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక జరగలేదని వివరించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో 5న ఉదయం 10గంటలకు కో–ఆప్షన్ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో–ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందని, మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఎంపీడీఓ వెల్లడించారు. -
పంచాయతీల్లోనూ కో–ఆప్షన్ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కూడా కో–ఆప్షన్ సభ్యులను నామినేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిద్దరిని నామినేట్ చేయాలని భావిస్తోంది. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న అన్ని కార్యనిర్వాహక అధికారాలను సర్పంచులకు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తంగా పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఈటల, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో పాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఒకరిద్దరు కో–ఆప్షన్ సభ్యులతో.. మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తులకు నామినేట్ చేస్తున్న తరహాలోనే గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే కో–ఆప్షన్ సభ్యుడిని నామినేట్ చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. అదే గ్రామానికి చెందిన విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిని లేదా ఇద్దరిని నామినేట్ చేసే అంశంపై చర్చించారు. కో–ఆప్షన్ సభ్యుల నియామకంపై సానుకూలత వ్యక్తమైనా.. సర్పంచ్, ఉప సర్పంచ్ల ఎన్నికలో వారికి ఓటు హక్కు ఇవ్వాలా, వద్దా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలా, పరోక్షంగానా అన్నది తేలాక కో–ఆప్షన్ సభ్యుల ఓటుహక్కుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాన్ని పరిశీలించే బాధ్యతను అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు. జిల్లా స్థాయిలోనే జీ ప్లస్ టూ ఆపై ఉండే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు, గ్రామ పంచాయతీల పరిధిలోని లేఔట్లు వంటి వాటికి అనుమతులను కూడా జిల్లా స్థాయిలోనే ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన ఈ బాధ్యతను జిల్లా స్థాయి కమిటీకి అప్పగించాలని, నిర్ణీత కాల పరిమితిలోగా దరఖాస్తులను తిరస్కరించడమో, ఆమోదించడమో చేయాలని నిర్దేశించేలా నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. రెండు పర్యాయాలు రిజర్వేషన్..! పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్పైనా భేటీలో చర్చ జరిగింది. ప్రతిసారి (ఐదేళ్లకోసారి) రిజర్వేషన్ రొటేషన్ కావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. అభివృద్ధి చేయాలనుకునేవారికి మరోసారి అవకాశం రావడం లేదని అభిప్రాయం వ్యక్తమైంది. మరోసారి రిజర్వేషన్ రాదని, పోటీచేసే అవకాశం కూడా రాదనే ఉద్దేశంతో కొందరు సర్పంచులు బాధ్యతారహితంగా పని చేస్తున్నారనే ప్రస్తావన వచ్చింది. ఈ పరిస్థితిని నివారించడానికి ఏ రిజర్వేషన్ అయినా వరుసగా రెండు పర్యాయాలు ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. తరచూ గ్రామ సభలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఇతర మార్పులు, నిర్ణయాలపై ప్రజలను భాగస్వామ్యం చేయడానికి గ్రామ సభలను ఎక్కువసార్లు నిర్వహించేలా చట్టంలో నిబంధనలు పొందుపరచాలని సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు. నెలకోసారి లేదా కనీసం రెండు నెలలకోసారి కచ్చితంగా గ్రామ సభను నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కాగా మంత్రివర్గ ఉప సంఘం బుధ, గురువారాల్లో కూడా సమావేశం కానుంది. అన్ని అంశాలపై లోతుగా చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా నివేదికను రూపొందించనుంది. ‘పంచాయతీ’ ట్రిబ్యునల్ ప్రస్తుతం సర్పంచులు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన న్యాయపరమైన (జ్యుడీషియల్) అధికారాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయి. దీంతో ఆయా అంశాలకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో... న్యాయపరమైన అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా సబ్ కమిటీ భేటీలో చర్చించారు. ప్రభుత్వోద్యోగులకు ఉన్నట్టుగానే పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. సర్పంచులకేపూర్తి అధికారాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న కార్యనిర్వహణాధికారాలను పూర్తిగా సర్పంచులకే అప్పగించాలని సబ్ కమిటీ భేటీలో ప్రతిపాదన వచ్చింది. నిధులు, కార్యనిర్వాహక అధికారాలను సర్పంచ్‌కే అప్పగించడంతో పాటు విధులు, బాధ్యతలపైనా ప్రధానంగా చర్చించారు. సర్పంచులు, వార్డు సభ్యులకు పూర్తి అధికారాలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనం పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండటానికి పలు నియంత్రణలు కూడా విధించాలని నిర్ణయించారు. -
పురపాలకులు ఎవరో?
శ్రీకాకుళం: రెండు నెలల సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడనుంది. పురపాలకు లు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఒక నగర పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే జరుగుతాయి. ఉదయం పది గంటల నుంచి ఎన్నిక కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పదవులను కైవసం చేసుకునేందుకు ఎత్తులు పైఎత్తు లు వేస్తున్నాయి. గత ఏప్రిల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్ఛాపురం, ఆమదాలవలసల్లో వైఎస్ఆర్సీపీ.. పలాస, పాలకొండ ల్లో టీడీపీ మెజారిటీ వార్డులను గెలుచుకున్నాయి. ఈ లెక్కన వాటి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సైతం ఆ పార్టీలే దక్కించుకోవాల్సి ఉంది. అయితే అధికార టీడీపీ ఎక్స్ అఫీషియో మం త్రాంగంతో ఆమదాలవలస మున్సిపాలిటీని ఎగరేసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి విప్ జారీ చేసే అధికారం లేదని, ఒకవేళ జారీ చేసినా చెల్లదని ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా అధికారులు వైఎస్ఆర్సీపీ విప్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించడంతో ఖంగుతిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఆమదాలవలసపైనే దృష్టి మిగతా మున్సిపాలిటీల మాటెలా ఉన్నా టీడీపీ ప్రధానంగా ఆమదాలవలసపైనే దృష్టి సారించింది. ఈ మున్సిపాలిటీలో 23 వార్డులకు గానూ వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ 8, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 2 వార్డులను కైవసం చేసుకున్నారు. స్వతంత్రుల్లో ఒకరు వైఎస్ఆర్సీపీలోనూ, మరొకరు టీడీపీలోనూ చేరడంతో వైఎస్ఆర్సీపీ బలం 11కు, టీడీపీ బలం తొమ్మిదికి పెరిగింది. రెండు పార్టీల మధ్య రెండు ఓట్ల తేడాయే ఉండటంతో టీడీపీ అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆమదాలవలసను ఎంచుకోవడంతో అక్కడ టీడీపీ బలం 12కు చేరుతుంది. దీంతో ఇప్పుడు ముగ్గురు కాంగ్రెస్ సభ్యు ల మద్దతు కీలకంగా మారింది. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధ్యక్ష పీఠం దక్కించుకుం టుంది. అయితే కుతంత్రాలతో ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులు కాంగ్రెస్ సభ్యులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తమకు మద్దతు ఇవ్వకపోయినా ఎన్నికకు గైర్హాజరు అయ్యేలా చూడాలని వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇక్కడ 23 వార్డులకు గానూ వైఎస్ఆర్సీపీ 13, టీడీపీ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందగా వారిలో ఒకరు టీడీపీలో చేరారు. పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా టీడీపీ 12, వైఎస్ఆర్సీపీ 3, స్వతంత్రులు ఐదు వార్డుల్లో గెలుపొందారు. ఇండిపెండింట్లలో ఒకరు ఇప్పటికే టీడీపీలో చేరారు. టీడీపీ గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. పలాసలో 25వార్డులు ఉండగా టీడీపీ 17, వైఎస్ఆర్సీపీ 8 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వెళ్లడం ఖాయం.