పురపాలకులు ఎవరో?
శ్రీకాకుళం: రెండు నెలల సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడనుంది. పురపాలకు లు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఒక నగర పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే జరుగుతాయి. ఉదయం పది గంటల నుంచి ఎన్నిక కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పదవులను కైవసం చేసుకునేందుకు ఎత్తులు పైఎత్తు లు వేస్తున్నాయి.
గత ఏప్రిల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్ఛాపురం, ఆమదాలవలసల్లో వైఎస్‌ఆర్‌సీపీ.. పలాస, పాలకొండ ల్లో టీడీపీ మెజారిటీ వార్డులను గెలుచుకున్నాయి. ఈ లెక్కన వాటి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సైతం ఆ పార్టీలే దక్కించుకోవాల్సి ఉంది. అయితే అధికార టీడీపీ ఎక్స్ అఫీషియో మం త్రాంగంతో ఆమదాలవలస మున్సిపాలిటీని ఎగరేసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి విప్ జారీ చేసే అధికారం లేదని, ఒకవేళ జారీ చేసినా చెల్లదని ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ విప్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించడంతో ఖంగుతిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కుతంత్రాలకు పాల్పడుతున్నారు.
ఆమదాలవలసపైనే దృష్టి
మిగతా మున్సిపాలిటీల మాటెలా ఉన్నా టీడీపీ ప్రధానంగా ఆమదాలవలసపైనే దృష్టి సారించింది. ఈ మున్సిపాలిటీలో 23 వార్డులకు గానూ వైఎస్‌ఆర్‌సీపీ 10, టీడీపీ 8, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 2 వార్డులను కైవసం చేసుకున్నారు. స్వతంత్రుల్లో ఒకరు వైఎస్‌ఆర్‌సీపీలోనూ, మరొకరు టీడీపీలోనూ చేరడంతో వైఎస్‌ఆర్‌సీపీ బలం 11కు, టీడీపీ బలం తొమ్మిదికి పెరిగింది. రెండు పార్టీల మధ్య రెండు ఓట్ల తేడాయే ఉండటంతో టీడీపీ అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆమదాలవలసను ఎంచుకోవడంతో అక్కడ టీడీపీ బలం 12కు చేరుతుంది. దీంతో ఇప్పుడు ముగ్గురు కాంగ్రెస్ సభ్యు ల మద్దతు కీలకంగా మారింది. వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధ్యక్ష పీఠం దక్కించుకుం టుంది. అయితే కుతంత్రాలతో ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకులు కాంగ్రెస్ సభ్యులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తమకు మద్దతు ఇవ్వకపోయినా ఎన్నికకు గైర్హాజరు అయ్యేలా చూడాలని వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇక్కడ 23 వార్డులకు గానూ వైఎస్‌ఆర్‌సీపీ 13, టీడీపీ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందగా వారిలో ఒకరు టీడీపీలో చేరారు. పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా టీడీపీ 12, వైఎస్‌ఆర్‌సీపీ 3, స్వతంత్రులు ఐదు వార్డుల్లో గెలుపొందారు. ఇండిపెండింట్లలో ఒకరు ఇప్పటికే టీడీపీలో చేరారు. టీడీపీ గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. పలాసలో 25వార్డులు ఉండగా టీడీపీ 17, వైఎస్‌ఆర్‌సీపీ 8 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వెళ్లడం ఖాయం.