సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నామినేటెడ్ పదవుల్లో న్యాయమైన వాటా కోసం కళింగ వైశ్యులు గళమెత్తుతున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లాలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఈ సామాజికవర్గం, ఇటీవల తమకు లభించిన బీసీ హోదాతో కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తోంది. త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులతోపాటు, శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ వర్గానికి ప్రాధాన్యం కల్పించాలని జిల్లా నేతలపై ఒత్తిడి పెంచడంతోపాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయమైన వాటా దక్కకపోతే ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఈ వర్గానికి చెందిన సుమారు 1.20 మంది ఓటర్లు ఉండగా, ఇందులో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో 92వేల మంది, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 28వేల మంది ఉన్నారు. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఈ ఓట్లు ఎలా దోహదపడ్డాయో వివరిస్తూ పదవులు పొందేందుకు ఈ సామాజికవర్గ నేతలు పావులు కదుపుతున్నారు.
ఒక వర్గానికేనా పదవులు
ప్రస్తుతం జిల్లా టీడీపీలో పదవులు కొందరికే.. అదీ ఒకటి రెండు సామాజికవర్గాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కళింగ వైశ్య నాయకులు పదవీయోగం దక్కని నేతలను కలిసి పరిస్థితిని అధిష్టానానికి వివరించాలని కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు తమకూ పదవులిప్పించాలని ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు నేతలు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఒకరిని కలిసి కోరారు. దానికి ఆయన స్పందించిన తీరుపై కళింగ వైశ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుపునకు తాము ఎంతో కృషి చేశామని, అసలు తమ ఓట్లు పడకపోతే టీడీపీ గెలిచేదే కాదని గుర్తు చేస్తున్నారు.
తీరా ఇప్పుడు సదరు ఎమ్మెల్యే భర్త తమను కాదని అందరికీ పదవుల హామీ ఇచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారన్నది తెలిసిందే. దాంతోపాటు ఈసారి మార్కెట్ కమిటీలు, దేవాలయ పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెరగనున్నందున ఆ మేరకు తమ పదవుల కోటా కూడా పెంచాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పలు పదవులు నిర్వహించిన ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే వద్దకు కొంతమంది కళింగ వైశ్యులు వెళ్లి చర్చించినట్టు తెలిసింది. తనకు త్వరలో పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందని, అప్పుడు అధిష్టానం వద్ద మీ విషయం చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
పోస్టులకూ కార్పోరేట్ సంస్కృతా?
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల్లో పోటీ ఎక్కువైంది. అయితే ఫలానా వారికి, ఫలానా మొత్తంలో పార్టీ ఫండ్ చెల్లిస్తేనే పదవి ఇస్తామంటూ పదవికో రేటు కట్టి మరీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ తరఫున భారీగా సొమ్ము ఖర్చు పెట్టిన కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతే ఇలాంటి ప్రచారానికి తెర తీయడం గమనార్హం.
విద్యారంగాన్ని, ఎన్నికలను కార్పొరేటీకరించిన సదరు నేతలు, ఇప్పుడు జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులకూ సొమ్ము డిమాండ్ చేయడం ఘోరమని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత సూచనల మేరకే నడుచుకోవాలని అధిష్టానం పెద్దలు కూడా పలుమార్లు ప్రస్తావించిన ట్టు చెబుతున్నారు. అలా అయితే పార్టీ జెండా మోసి, ఏళ్ల తరబడి కష్టబడిన తమను కాదని, డబ్బున్న వాళ్లకే పదవులు దక్కే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని కొంతమంది కళింగ వైశ్య నాయకులు చెబుతున్నారు. ఇతర పార్టీల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదని, పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ యోగం తమకు పట్టకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా కోటా పెంచాల్సిందే!
Published Wed, Sep 3 2014 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement