సాక్షి, హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారం గందరగోళానికి దారితీసింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున టీపీసీసీ ప్రతినిధులను నియమించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. వీరికి తోడు మొత్తం ప్రతినిధుల్లో 15 శాతం మందిని అదనంగా కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవచ్చు.
ఈ మేరకు ఇటీవల జరిగిన పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యుల నియామక వ్యవ హారం ఓ ప్రహసనంగా మారిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పీసీసీ, ఎన్నికల రిటర్నింగ్ అసిస్టెంట్ అధికారి మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని గుర్తించగా పీసీసీ దిద్దుబాటుకు ఉపక్రమించింది. అనధికార జాబితాలోని 40 మందిని తొలగించి కొత్త జాబితా విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
ఏం జరిగింది?
కాంగ్రెస్ ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 238 మందిని పీసీసీ ప్రతినిధులుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ 238లో 15%.. అంటే 36 మందిని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇలా మొత్తం 274 మందిని పీసీసీ ప్రతినిధులుగా ఎంపిక చేయవచ్చు. కానీ ఇటీవల జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 330 మంది వరకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా ప్రతినిధులకు సమాచారం వెళ్లింది. అంతేగాకుండా పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే ఇటీవల నాంపల్లిలో జరిగిన ఒక సమావేశానికి హాజరు కావాలని కూడా వీరందరికీ సమాచారం వెళ్లింది.
భగేల్‌పై ఒత్తిడి వల్లే గందరగోళం
కొందరు కాంగ్రెస్ నేతలు.. తమ వర్గానికి చెందిన నేతల పేర్లను కోఆప్షన్, ప్రతినిధుల జాబితాలో చేర్చాల్సిందిగా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వచ్చిన రాజ్‌భగేల్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం వల్లే ఈ గందరగోళం నెలకొందనే చర్చ జరుగుతోంది. పీసీసీకి తెలియకుండానే భగేల్ జాబితాను రూపొందించి ఖరారు చేశారని అంటున్నారు. నియోజకవర్గానికి ఇద్దరు ప్రతినిధుల చొప్పున మాత్రమే ఎన్నుకోవాల్సి ఉండగా, ఆలేరులో ఏడుగురు, జనగామలో ఆరుగురు, నకిరేకల్ నుంచి ఆరుగురుకి పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులుగా నియమితులైనట్టు తెలుస్తోంది.
పైగా నియోజకవర్గంలో పెద్దగా పలుకుబడి లేని వారిని, ప్రజలతో అసలు సంబంధాలు లేని వారిని పీసీసీ ప్రతినిధులుగా నియమించారనే చర్చా జరుగుతోంది. దీనిపై పలు నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం. కాగా అసలు ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులుగా ఎంపికైన వారి జాబితా పీసీసీ వద్ద కూడా లేకపోవడం గమనార్హం. దీంతో తమకు జాబితా ఇవ్వమని అడిగితే ఇవ్వలేదనే ఫిర్యాదులు కూడా సీనియర్ల నుంచి వస్తున్నాయి.
పొరపాటు సరి చేయండి
ఈ నేపథ్యంలో టీపీసీసీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పొరపాటును సరిదిద్దాల్సిందిగా సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్.. ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీతోపాటు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వచ్చిన కేరళ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్‌లను కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా ఉన్నితన్‌తో మాట్లాడారని, ఒకట్రెండు రోజుల్లో పీసీసీ ప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment