అందరికీ బ్యాంక్ ఖాతా ఉండాలి
తోణాం (సాలూరు రూరల్):ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్కుమార్ సైనీ అన్నారు. సాలూరు మండలంలో మంగళవారం నిర్వహించిన బ్యాంక్ వ్యక్తిగత ఖాతాల కేంద్రాలను అయన పరిశీలించారు. ముందుగా మండలంలోని బాగువలస,మామిడిపల్లి,గంగన్నదొరవలస,తోణాం,కురుకూట్టి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ చిరంజీవి మాట్లాడుతూ బాగువలసలో 850 కుటుంబాలు,సాలూరులో 595,మామిడిపల్లిలో 645,గంగన్నదొరవలసలో 369,కురుకూట్టిలో 265,తోణాంలో 330 కుటుంబాలు ఉన్నాయని వాటికి సంబంధించి బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలకోసం ప్రారంభ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
హాస్టల్ ఏర్పాటు చేయాలి
బాగువలస గ్రామంలో విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.పి.సన్యాసిరావు పీఓను కోరారు. గ్రామ పరిధిలో నక్కడవలస,నార్లవలస,పెదపదం,గాదిబిల్లివలస,తాడిలోవ,మిర్తివలసతో పాటు సుమారు 30 గిరిజన గ్రామాలున్నాయని, విద్యార్థులకు భోజన వసతి సౌకర్యం లేకపోవడంతో వారంతా చదువుకు దూరంగా ఉంటున్నారన్నారు.
ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తపై విచారణకు అదేశాలు
తమ గ్రామానికి నిత్యం ఉపాధ్యాయుడు రావడం లేదని, తాగునీటి కోసం తీవ్ర అవస్ధలు పడుతున్నామని నారింజపాడు గ్రామ గిరిజనులు కురుకూట్టి వచ్చిన పీఓ ఎదుట మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన పీఓ వెంటనే ఉపాధ్యాయుడిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. అనంతరం పెదబరిగాం గ్రామాన్ని సందర్శించగా ఆ గ్రామానికి చెందిన చుక్కయ్య అనే ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు రావడం లేదని అంగన్వాడీ టీచర్ సాయమ్మ తమకు ఫీడింగ్ ఇవ్వడం లేదని గిరిజనులు మొరపెట్టుకున్నారు. ఆ ఇద్దరిపై కూడా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు పీఓ అదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో అయన వెంట ఉపాధి ఏపీవో కృష్ణారావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.