Collecting donations
-
చందాల సొమ్ముతో సోకులా!
చంద్రబాబు దుబారాపై సర్వత్రా విమర్శలు ఏపీ రాజధాని కోసం విరాళాలకు సర్కారు పిలుపు ఇష్టానుసారం ఖర్చు చేయడంపై సర్వత్రా విస్మయం హైదరాబాద్: ఒకపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ప్రతి కార్యక్రమానికీ విరాళాలు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మరోపక్క చేస్తున్న దుబారా వ్యయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయాల ముస్తాబుకు, కన్సల్టెన్సీలకు, ప్రత్యేక విమానాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది. విరాళాలు అడుగుతున్నందున ఆ నిధుల వ్యయంపై జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రాజధాని కోసం ప్రతి నెలా ఒకరోజు వేతనం ఇవ్వాలని, ఉగాది సందర్భంగా గత శనివారం చంద్రబాబు పిలుపునివ్వడంపై ఉద్యోగవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఒక చేత్తో పీఆర్సీ ఇచ్చినట్టే ఇచ్చి.. మరోచేత్తో రాజధాని చందాల పేరుతో పెరిగే వేతనాన్ని లాగేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఉద్యోగులు అంటున్నారు. ప్రతినెలా ఒకరోజు వేతనానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతామని కూడా సీఎం ప్రకటించడంతో.. ప్రతి నెలా ఒకరోజు వేతనాన్ని అధికారికంగానే లాగేసుకుంటారేమోనని వారు భయపడుతున్నారు. ఒకపక్క విరాళాలు కోరుతూ మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం, ప్రత్యేక విమానాల కోసం వృథాగా చేస్తున్న వ్యయంపై ఉన్నతస్థాయి వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్ వార్డు లు, స్మార్ట్ గ్రామాలకు విరాళాలివ్వాలంటూ.. వాటి ప్రచారం కోసం జిల్లాకు కోటి చొప్పున రూ.13 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను భారీ ఖర్చుకు సిద్ధమై విదేశీ కన్సల్టెంట్లకు అప్పగించడంపై కూడా ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో అభ్యం తరాలున్నాయి. ప్రజల నుంచి విరాళాల రూపంలోనైనా, లేదా పన్నుల రూపంలోనైనా వచ్చే ప్రతి పైసాను ప్రజలకు ఆస్తుల కల్పనకు, వారికి మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలి కానీ.. ఈ విధంగా దుబారా చేయడం ఏమిటని అధికార యంత్రాంగమే ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12,921 గ్రామాల్లో 1,384 గ్రామాలను, 3,463 మున్సిపల్ వార్డుల్లో 279 వార్డులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. స్మార్ట్ వార్డులు, గ్రామాలకు విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను రాయితీ ఇప్పించేందుకు సైతం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను మాత్రం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని అధికారులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే లకు బడ్జెట్ సమావేశాల కానుక కింద అత్యాదునిక ఐ ఫోనులు ఇవ్వడానికి కోటిన్నర రూపాయలను వ్యయం చేస్తున్నారు. అసెంబ్లీకి కేటాయించిన నిధుల్లో మిగుళ్ల నుంచి ఐ ఫోన్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి పేర్కొనడం గమనార్హం. విరాళాల వసూలు ఇలా.. రాజధానితో పాటు గ్రామాలు, వార్డులు బాగు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరివిగా విరాళాలు ఇవ్వాలని సర్కారు పిలుపునిచ్చింది.ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం విరాళాలు వసూలు చేస్తోంది. తాజాగా రాజధాని కోసం ఉద్యోగులు ప్రతి నెలా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఇలా దుబారా.. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేశారు.రాష్ట్రంలో జిల్లాల పర్యటనలకు, ఢిల్లీ, సింగపూర్ పర్యటనలకు రెగ్యులర్ విమానాలున్నా.. ప్రత్యేక విమానాల్లో కేవలం 63 సార్లు చేసిన ప్రయాణాలకే ఏకంగా రూ.15 కోట్లు వెచ్చించారు.స్మార్ట్ వార్డులు, గ్రామాల ప్రచారం కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేశారు.ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకోసం నియమించిన కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది.ముందస్తు బడ్జెట్ సమావేశాలంటూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించడం ద్వారా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. {పజా ప్రతినిధులు, అధికారులకు యోగా పేరుతో ప్రైవేట్ హోటల్లో మూడు రోజుల ఏర్పాట్లకు కోటిన్నర రూపాయలు వ్యయం చేశారు. విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెజర్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ అందుకు గాను రూ.12.62 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విచిత్రంగా ఈ సంస్థకు రూ.1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు. నీరు-చెట్టు కార్యక్రమం ప్రచారం కోసం ఏకంగా రూ.5 కోట్లు కేటాయించారు. -
ఎవరి పునర్నిర్మాణానికి ఈ వసూళ్లు!
స్వచ్ఛందం గా ఇచ్చేదాన్నే విరాళం అంటారు.. అలాకాకుండా పెద్దలే నిర్ణయించి.. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 రోజుల వేతనం ఇచ్చేయమంటే.. దాన్ని కడుపు కొట్టడం అంటారు తప్ప విరాళం అనరు. ప్రస్తుతం ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీలో ఈ తరహా విరాళాల వసూలు సాగుతోంది. దీనికి వారు పెట్టిన ముద్దుపేరు.. ‘రాజధాని పునర్నిర్మాణం, వర్సిటీ అభివృద్ధి నిధి’..యథారాజా.. తథా ప్రజా.. అన్నట్లు రాజధాని పునర్మాణ నిధుల కోసం పాలకులు ఏకంగా సచివాలయంలోనే హుండీలు పెట్టగా లేనిది.. మేం స్థానికంగా డిబ్బీలు పెడితే తప్పేమిటన్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో బాబుగారి వద్దకు వెళ్లి సొంత ఇమేజ్ పెంచుకోవడం.. మరో టెర్మ్ పొడిగించుకోవడం వీలైతే ఇంకా పెద్ద పోస్టు కొట్టేయడమే.. ఈ తతంగం వెనుక అసలు ఎజెండా అని సమాచారం. కోటరీ తీర్మానం తరగతులు జరగని మే నెల వేతనాలకు సంబంధించి ఉన్నతాధికారి కోటరీ ఒక తీర్మానం చేసిందట. దాన్ని అప్పట్లోనే కొందరు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. ఈ కమిటీ చేసిన తీర్మానం సారాంశం ఏమిటంటే.. ‘మే నెలకు వర్సిటీ జీతం మంజూరు చేస్తుంది. అందులో 15 రోజుల మొత్తం అధికారులకు తిరిగి ఇవ్వాలి. ఆ మొత్తాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, వర్సిటీ అభివృద్ధి నిధికి జమ చేస్తారు’. అసలు వేతనమే రాని కాలానికి ఇస్తున్నాం కనుక.. అందులో సగం విరాళంగా ఇవ్వాలని చెప్పి బలవంతంగా ఒప్పించారు. ఎచ్చెర్ల క్యాంపస్: సొంత ఎదుగుదల కోసం.. పెద్దల ప్రాపకం కోసం వేతన జీవుల పొట్ట కొట్టే పనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉన్నతాధికారి పాల్పడుతున్నారు. రాజధాని పునర్నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి పిలుపును తనకు అనుకూలంగా మలచుకున్నారు. విరాళాల పేరుతో కాంట్రాక్టు బోధకుల(టీఏలు) జీవితాలతో అడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా 15 రోజుల వేతనాన్ని విరాళం కింద తీసుకోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. సగం నెల జీతం తీసేసుకుంటే తమ కుటుంబాలు నెలంతా ఎలా గడుస్తాయని ఆవేదన చెందుతున్నారు. అయితే బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. కాంట్రాక్టు బోధకుల నుంచి 15 రోజుల వేతనం తీసుకున్న ఉన్నతాధికారి.. రెగ్యులర్ బోధకుల విషయంలో మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. అసలే తక్కువ వేతనాలు విశ్వవిద్యాలయాల్లో సాధారణంగా ఏడాదిలో 10 నెలలే తరగతులు జరుగుతాయి. కాంట్రాక్టు బోధకులకు ఈ పది నెలలకే జీతాలు చెల్లిస్తారు. తరగతులు జరగని కాలానికి ఎంత జీతం ఇవ్వాలన్నది ఆయా విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉం టుంది. కొన్ని యూని వర్సిటీల్లో 45 రోజుల జీతం ఇస్తుండగా, మరికొన్నింటిలో 30 రోజుల జీతమే ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి కొందరు టీఏలు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి గతంలో తీసుకువెళ్లగా.. సెలవు రోజులకు వేతనం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, అభివృద్ధి మండలి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అందువల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. గత ఏడాది కూడా కాంట్రాక్టు బోధకులకు పది నెలల వేతనమే ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి మే నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లే నిర్ణయించి.. అందులో సగం విరాళం పేరుతో కోత వేశారు. రెగ్యులర్ బోధకుల విముఖత వర్సిటీలో ప్రస్తుతం 62 మంది టీచింగ్ అసోసియేట్లు పని చేస్తున్నారు. వీరిలో పీహెచ్డీ చేసిన వారికి రూ.21,500, ఎంఫిల్ చేసిన వారికి రూ.20 వేలు, పీజీ చేసిన వారికి రూ. 18 వేలు నెల జీతంగా చెల్లిస్తున్నారు. ఇందులో 15 రోజుల వేతనం అంటే రూ.9వేల నుంచి రూ.11 వేల వరకు పోతుందన్నమాట. ఇలా సుమారు రూ. 7 లక్షలు వసూలు చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చినట్లు అందరి వద్దా సంతకాలు తీసేసుకున్నారు. ఉన్నతాధికారి కోటరీ సభ్యులే దగ్గరుండి ఈ తతంగమంతా నడిపించారు. దీంతో కాంట్రాక్టు బోధకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీలో ఉన్న 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రం ఈ నిర్ణయంపై విముఖత చూపుతున్నారు. ఒక్కరోజు జీతం ఇచ్చేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టు బోధకుల నుంచి ఇప్పటికే బలవంతంగా సంతకాలు సేకరించిన కోటరీ వీరి విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. అసలు లక్ష్యం ఏమిటంటే.. ఈ వసూళ్ల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. విరాళాల పేరుతో వసూలు చేసిన భారీ మొత్తాన్ని వర్సిటీ ఉన్నతాధికారి చెక్కు రూపంలో తీసుకెళ్లి స్వయంగా ముఖ్యమంత్రికి అందజేస్తారట. సీఎం వద్దకు తీసుకెళ్లడంతోపాటు వర్సిటీలో అమలు చేస్తున్న 20 ఆర్థిక ప్రగతి సూత్రాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనగారికి హామీ ఇచ్చారని తెలిసింది. భారీ మొత్తానికి చెక్కు అందజేయడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం వద్ద మార్కులు కొట్టేయాలన్నది వర్సిటీ ఉన్నతాధికారి ఆలోచన. తద్వారా ఇక్కడ తన పదవీకాలం పూర్తి కాగానే మరో టర్మ్ పొడిగించుకోవడం.. వీలుంటే దీని కంటే పెద్ద పోస్టు కొట్టేయడం ఆయన అసలు లక్ష్యమని తెలిసింది. ఇందుకు తన కోటరీలో ఉన్న టీఏలను భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశం కల్పిస్తానని ఆశ చూపి.. వారి ద్వారా కాంట్రాక్ట్ బోధకులను బలి చేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అందరి ఏకాభిప్రాయంతోనేనట.. టీఏల అందరి ఏకాభిప్రాయంతోనే 15 రోజుల జీతాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ కోసం వసూలు చేసినట్లు వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుంట తులసీరావు చెప్పారు. ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. నిర్బంధ వసూళ్లన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కాగా రెగ్యులర్ బోధకుల నుంచి ఎంత వసూలు చేయాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పడం విశేషం. -
‘ఆంధ్రజ్యోతి’ దురుద్దేశంతో వ్యవహరిస్తోంది..
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం విరాళాలు వసూలు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రచురణకర్త బొమ్మిశెట్టి వత్సల దాఖలు చేశారు. రెవిన్యూ అధికారులను, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం విరాళాలను వసూలు చేస్తోందని ఆమె తన పిటిషన్లో తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని సదరు పత్రిక యాజమాన్యం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని, ఈ విషయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఏ అధికారంతో విరాళాలను వసూలు చేస్తోందో ప్రశ్నించాలని కోర్టును ఆమె కోరారు. ఇలా విరాళాలు వసూలు చేయడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది.