‘ఆంధ్రజ్యోతి’ దురుద్దేశంతో వ్యవహరిస్తోంది..
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం విరాళాలు వసూలు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రచురణకర్త బొమ్మిశెట్టి వత్సల దాఖలు చేశారు. రెవిన్యూ అధికారులను, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం విరాళాలను వసూలు చేస్తోందని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని సదరు పత్రిక యాజమాన్యం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని, ఈ విషయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఏ అధికారంతో విరాళాలను వసూలు చేస్తోందో ప్రశ్నించాలని కోర్టును ఆమె కోరారు. ఇలా విరాళాలు వసూలు చేయడం ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది.