ఎవరి పునర్నిర్మాణానికి ఈ వసూళ్లు! | Dr. BR Ambedkar University Collecting donations in srikakulam | Sakshi
Sakshi News home page

ఎవరి పునర్నిర్మాణానికి ఈ వసూళ్లు!

Published Wed, Jul 30 2014 2:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఎవరి పునర్నిర్మాణానికి  ఈ వసూళ్లు! - Sakshi

ఎవరి పునర్నిర్మాణానికి ఈ వసూళ్లు!

స్వచ్ఛందం గా ఇచ్చేదాన్నే విరాళం అంటారు.. అలాకాకుండా పెద్దలే నిర్ణయించి.. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 రోజుల వేతనం ఇచ్చేయమంటే.. దాన్ని కడుపు కొట్టడం అంటారు తప్ప విరాళం అనరు. ప్రస్తుతం ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీలో ఈ తరహా విరాళాల వసూలు సాగుతోంది. దీనికి వారు పెట్టిన ముద్దుపేరు.. ‘రాజధాని పునర్నిర్మాణం, వర్సిటీ అభివృద్ధి నిధి’..యథారాజా.. తథా ప్రజా.. అన్నట్లు రాజధాని పునర్మాణ నిధుల కోసం పాలకులు ఏకంగా సచివాలయంలోనే హుండీలు పెట్టగా లేనిది.. మేం స్థానికంగా డిబ్బీలు పెడితే తప్పేమిటన్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ముతో బాబుగారి వద్దకు వెళ్లి సొంత ఇమేజ్ పెంచుకోవడం.. మరో టెర్మ్ పొడిగించుకోవడం వీలైతే ఇంకా పెద్ద పోస్టు కొట్టేయడమే.. ఈ తతంగం వెనుక అసలు ఎజెండా అని సమాచారం.
 
   కోటరీ తీర్మానం
 తరగతులు జరగని మే నెల వేతనాలకు సంబంధించి ఉన్నతాధికారి కోటరీ ఒక తీర్మానం చేసిందట. దాన్ని అప్పట్లోనే కొందరు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. ఈ కమిటీ చేసిన తీర్మానం సారాంశం ఏమిటంటే.. ‘మే నెలకు వర్సిటీ జీతం మంజూరు చేస్తుంది. అందులో 15 రోజుల మొత్తం అధికారులకు తిరిగి ఇవ్వాలి. ఆ మొత్తాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, వర్సిటీ అభివృద్ధి నిధికి జమ చేస్తారు’.  అసలు వేతనమే రాని కాలానికి ఇస్తున్నాం కనుక.. అందులో సగం విరాళంగా ఇవ్వాలని చెప్పి బలవంతంగా ఒప్పించారు.
 
 ఎచ్చెర్ల క్యాంపస్: సొంత ఎదుగుదల కోసం.. పెద్దల ప్రాపకం కోసం వేతన జీవుల పొట్ట కొట్టే పనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉన్నతాధికారి పాల్పడుతున్నారు. రాజధాని పునర్నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి పిలుపును తనకు అనుకూలంగా మలచుకున్నారు. విరాళాల పేరుతో కాంట్రాక్టు బోధకుల(టీఏలు) జీవితాలతో అడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా 15 రోజుల వేతనాన్ని విరాళం కింద తీసుకోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. సగం నెల జీతం తీసేసుకుంటే తమ కుటుంబాలు నెలంతా ఎలా గడుస్తాయని ఆవేదన చెందుతున్నారు. అయితే బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. కాంట్రాక్టు బోధకుల నుంచి 15 రోజుల వేతనం తీసుకున్న ఉన్నతాధికారి.. రెగ్యులర్ బోధకుల విషయంలో మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
 
 అసలే తక్కువ వేతనాలు
 విశ్వవిద్యాలయాల్లో సాధారణంగా ఏడాదిలో 10 నెలలే తరగతులు జరుగుతాయి. కాంట్రాక్టు బోధకులకు ఈ పది నెలలకే జీతాలు చెల్లిస్తారు. తరగతులు జరగని కాలానికి ఎంత జీతం ఇవ్వాలన్నది ఆయా విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారుల విచక్షణాధికారంపై ఆధారపడి ఉం టుంది. కొన్ని యూని వర్సిటీల్లో 45 రోజుల జీతం ఇస్తుండగా, మరికొన్నింటిలో 30 రోజుల జీతమే ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి కొందరు టీఏలు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి గతంలో తీసుకువెళ్లగా.. సెలవు రోజులకు వేతనం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, అభివృద్ధి మండలి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అందువల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. గత ఏడాది కూడా కాంట్రాక్టు బోధకులకు పది నెలల వేతనమే ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి మే నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లే నిర్ణయించి.. అందులో సగం విరాళం పేరుతో కోత వేశారు.
 
 రెగ్యులర్ బోధకుల విముఖత
 వర్సిటీలో ప్రస్తుతం 62 మంది టీచింగ్ అసోసియేట్లు పని చేస్తున్నారు. వీరిలో పీహెచ్‌డీ చేసిన వారికి రూ.21,500, ఎంఫిల్ చేసిన వారికి రూ.20 వేలు, పీజీ చేసిన వారికి రూ. 18 వేలు నెల జీతంగా చెల్లిస్తున్నారు. ఇందులో 15 రోజుల వేతనం అంటే రూ.9వేల నుంచి రూ.11 వేల వరకు పోతుందన్నమాట. ఇలా సుమారు రూ. 7 లక్షలు వసూలు చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చినట్లు అందరి వద్దా సంతకాలు తీసేసుకున్నారు. ఉన్నతాధికారి కోటరీ సభ్యులే దగ్గరుండి ఈ తతంగమంతా నడిపించారు. దీంతో కాంట్రాక్టు బోధకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీలో ఉన్న 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రం ఈ నిర్ణయంపై విముఖత చూపుతున్నారు. ఒక్కరోజు జీతం ఇచ్చేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టు బోధకుల నుంచి ఇప్పటికే బలవంతంగా సంతకాలు సేకరించిన కోటరీ వీరి విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది.
 
 అసలు లక్ష్యం ఏమిటంటే..
 ఈ వసూళ్ల వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. విరాళాల పేరుతో వసూలు చేసిన భారీ మొత్తాన్ని వర్సిటీ ఉన్నతాధికారి చెక్కు రూపంలో తీసుకెళ్లి స్వయంగా ముఖ్యమంత్రికి అందజేస్తారట. సీఎం వద్దకు తీసుకెళ్లడంతోపాటు వర్సిటీలో అమలు చేస్తున్న 20 ఆర్థిక ప్రగతి సూత్రాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనగారికి హామీ ఇచ్చారని తెలిసింది. భారీ మొత్తానికి చెక్కు అందజేయడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం వద్ద మార్కులు కొట్టేయాలన్నది వర్సిటీ ఉన్నతాధికారి ఆలోచన. తద్వారా ఇక్కడ తన పదవీకాలం పూర్తి కాగానే మరో టర్మ్ పొడిగించుకోవడం.. వీలుంటే దీని కంటే పెద్ద పోస్టు కొట్టేయడం ఆయన అసలు లక్ష్యమని తెలిసింది. ఇందుకు తన కోటరీలో ఉన్న టీఏలను భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అవకాశం కల్పిస్తానని ఆశ చూపి.. వారి ద్వారా కాంట్రాక్ట్ బోధకులను బలి చేస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
 
 అందరి ఏకాభిప్రాయంతోనేనట..
 టీఏల అందరి ఏకాభిప్రాయంతోనే 15 రోజుల జీతాన్ని రాజధాని పునర్నిర్మాణ నిధి, యూనివర్సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ కోసం వసూలు చేసినట్లు వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుంట తులసీరావు చెప్పారు. ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. నిర్బంధ వసూళ్లన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కాగా రెగ్యులర్ బోధకుల నుంచి ఎంత వసూలు చేయాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement