అంతటా సర్వే హడావుడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సమయం దగ్గర పడుతుండడంతో యంత్రాంగంలో హడావుడి మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఈ సర్వే ఆధారంగానే రూపొందించనున్నారు. దీంతో పకడ్బందీగా సర్వే చేపట్టాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో మాత్రమే సర్వే చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15.13లక్షల గృహాలున్నాయి. వీటిలో గ్రామీణ పరిధిలో ఉన్న 7.81లక్షల గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలను ఎన్యూమరేటర్లు ఈనెల 19 సేకరించనున్నారు. ప్రస్తుతం ఈ గృహాలకు మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
సిబ్బంది 26వేలు..
సర్వే వివరాల సేకరణకు జిల్లాలో 25,386 మంది ఎన్యూమరేటర్లు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినప్పటికీ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా సిబ్బందికి సర్వే ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం చేవెళ్ల, వికారాబాద్ డివిజన్లోని సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో కలెక్టర్ ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు. గురువారం కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తప్పులు దొర్లితే..
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు సేకరించేందుకు యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమిస్తోంది. అయితే ఈ అంశంపై పలు ఆరోపణలొస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించడంతో వివరాల సేకరణ పారదర్శకంగా సాగుతుందా అనే సందేహం నెలకొంది. వివరాల సేకరణలో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులైతే చర్యలు తీసుకోవచ్చని ఈనేపథ్యంలో పకడ్భందీగా సర్వే జరుగుతుందని, కానీ ప్రైవేటు సిబ్బందిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి.