Comenting
-
కారు కొంటున్నారా..
భారీ జీతాలందుకునే ఫ్రెండ్స్ ముందు తానూ ఆర్భాటంగానే ఉండాలనే కాన్సెప్టుతో తనకు ప్రత్యేకంగా అవసరం లేకపోయినా ఈఎంఐల మీద లగ్జరీ కారు కొనేశాడు ఆనంద్. మొదట కొన్నాళ్లు బాగానే నడిచినా.. ఆ తర్వాత అర్థమయింది కారు కొనుక్కోవడం ఒకెత్తు.. దాన్ని భరించడం మరో ఎత్తు అని. బైటికి తీస్తేనేమో పెట్రోల్ వాత.. పోనీ తియ్యకుండా అలా ఉంచేసినా.. ఎలుకలు వగైరాలు దూరేసి మెయింటెనెన్స్ మోత మోగిపోతోంది. ఇటు ఈఎంఐలు, అటు ఇంధనం ఖర్చులు, మరోవైపు రెండు మూడు నెలలకోసారి మెయింటెనెన్స్ బాదుడు కలిపి ఆనంద్కి తడిసిమోపెడవుతోంది. ఇలాంటి తలనొప్పులు లేకుండా ముందస్తుగా కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే.. కారులో జోరుగా హుషారుగా షికారు చేయొచ్చు. సరైన కారే కొంటున్నామా.. కారు తీసుకోవడం అన్న ఆలోచన వచ్చిన తర్వాత.. మన అవసరాలకు తగినట్లుగా ఉండేది ఎంచుకోవాలి. అంటే ఎంత మంది కుటుంబసభ్యులు ఉన్నారు, ఎంత ఎక్కువ లగేజి ఉంటుంది లాంటివి చూసుకోవాలి. ఆరేడు మంది కుటుంబసభ్యులు ఉన్నప్పుడు చిన్న కారు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెట్రోల్.. డీజిల్.. ఏది బెస్టు? కారన్నాక.. మైలేజీ మొదలుకుని మెయింటెనెన్స్ వ్యయాలు దాకా అన్నీ చూసుకోవాల్సిందే. పెట్రోల్ ఖరీదైనప్పటికీ.. పెట్రోల్ కార్ల రేట్లు తక్కువగానే ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే మెయింటెనెన్సూ తక్కువే. డీజిల్ రేటు తక్కువ అయినా పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల రేట్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.1 లక్ష పైగానే ఉంటోంది. పైగా మెయింటెనెన్సూ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు, మారుతీ సుజుకీ స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ సుమారు రూ. 4.57 లక్షల రేంజిలో ఉంటే.. డీజిల్ వెర్షన్ రూ. 5.66 లక్షల శ్రేణిలో ఉంది. రోజుకి కనీసం 80 కిలోమీటర్లయినా తిరిగేవారయితే డీజిల్ ఫర్వాలేదు. అయితే, ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ రేట్లకి మధ్య వ్యత్యాసం భారీగా తగ్గిపోతోంది కాబట్టి ఆ కోణంలోనూ ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. ఇక సీఎన్జీ కార్లు ఉన్నప్పటికీ.. అన్ని చోట్ల సీఎన్జీ దొరకడం ప్రస్తుతం సమస్యగా ఉంటోంది. కొన్ని కార్లు సీఎన్జీ- పెట్రోల్ కాంబినేషన్స్‌లో కూడా లభిస్తున్నాయి. కొత్తదా.. పాతదా.. కాస్త ఎక్కువ డబ్బు పెట్టి కొత్తది తీసుకోవడం లేదా చవకగా పాత కారును తీసుకోవడం అన్నది మన అవసరం, డబ్బు లభ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అసలు ఏ కారు రేటు ఎంత ఉంది, కొత్తది ఎంతకు లభిస్తోంది.. కొంత పాతబడినది ఎంతకు రావొచ్చు, మనం ఎంత బడ్జెట్ అనుకుంటున్నాము లాంటి అంశాలు చూసుకోవాలి. వివిధ కార్ల రేట్ల గురించి తెలుసుకోవడానికి, పోల్చి చూసుకోవడానికి కార్‌దేఖోడాట్‌కామ్ వంటి వెబ్సైట్లు ఉపయోగపడతాయి. ఇక, కార్ల తయారీ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం కోసం ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేశాయి. మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పేరిట, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఫస్ట్ చాయిస్ పేరిట యూజ్డ్ కార్లను కూడా విక్రయిస్తున్నాయి. ముందుగా డబ్బుల షాపింగ్.. ఒకవేళ లోన్ తీసుకుని కారు తీసుకోవాలనుకుంటున్న పక్షంలో ముందుగా ఎంత రుణం లభించే అవకాశం ఉంది, డౌన్‌పేమెంటు ఎంత చేయాల్సి ఉంటుంది అన్నవి చూసుకోవాలి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటు కు ఎక్కువ రుణం ఇస్తోందో తెలుసుకోవాలి. రుణ దరఖాస్తుకు బ్యాంకుల నుంచి ముందుగానే అప్రూవల్ దక్కించుకోగలిగితే.. బేరమాడేందుకు మరింత వీలు దొరుకుతుంది. ఏదైనా.. బడ్జెట్ దాటకుండా చూసుకోవాలి. కారు సైజు పెరిగే కొద్దీ భారీ డిస్కౌంట్లంటూ కంపెనీలు ఊదరగొడతాయి. ఆ మాయలో పడి బడ్జెట్‌ను దాటిపోకుండా జాగ్రత్తపడాలి. మీరు కట్టే ఈఎంఐ.. మీ ఇంటి ఖర్చులు, ఇతరత్రా కట్టాల్సిన బాకీలు అన్నీ పోయాక ఇన్వెస్ట్ చేసేందుకు మిగిలే డబ్బులో 40% మించకుండా ఉండాలి. -
‘క్రేజీ’వాల్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజధాని నడిబొడ్డున చేసిన ధర్నాతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టే చెప్పాలి. ఢిల్లీ పోలీసులపై అజమాయిషీ కోసం చేపట్టిన ధర్నాతో కే జ్రీవాల్ క్రేజ్ మరింత పెరిగింది. రెండు రోజులుగా ఢిల్లీలో ఏ ఇద్దరు కలిసినా ముఖ్యమంత్రి చేపట్టిన ధర్నాపైనే ప్రముఖంగా చర్చించుకున్నారు. కేజ్రీవాల్ ధర్నాకు దిగడం సమంజసమని కొందరు.. ముఖ్యమంత్రి హోదాలో ఇలా రోడ్లపై ధర్నాలు చేయడం ఏంటని మరికొందరు... ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేశారు. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి ఇది కలిసొచ్చే అంశంగానే చెప్పాలి. చర్చ అనుకూలమా? ప్రతి కూలమా? అనే విషయం పక్కన పెడితే ప్రతిపక్షాలనుంచి సామాన్యుల వరకు మరోమారు తనపేరు నోళ్లలో నానేలా చేసుకున్నారు. మీడియాలో కూడా ఎక్కువగా కే జ్రీవాల్ చేపట్టిన ధర్నా వార్తలే ప్రసారమయ్యాయి. జనవరి 26 వేడులకు సరిగ్గా ఐదురోజుల ముందు హైసెక్యురిటీ జోన్‌గా భావించే రైల్‌భవన్ ప్రాంతంలో ధర్నాకు దిగి అందరినీ అశ్చర్యపరిచారు. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పొలిటికల్‌గా ఈ ధర్నా మైలేజీనిస్తుందన్న విశ్వాసం ఆప్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ సమస్యలపై పోరాటానికి అవసరమైతే కేంద్రంతో అమితుమీ తేల్చుకునేందుకు తాను వెనుకాడరన్న సందేశాన్ని పార్టీలకు ప్రజలకు పంపారన్నది వారి అభిప్రాయం. ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఢిల్లీ పోలీసులకు రెండ్రోజులు ముచ్చెమటలు పట్టించారు. అత్యంత సున్నితంగా మారిన ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ మంత్రి సైతం రెండు దఫాలుగా స్వయంగా ప్రధానితో భేటీ కావాల్సి వచ్చింది. కేంద్ర హోంశాఖ గాంభీర్యాన్ని ప్రద ర్శించినా దేశ గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్ల దృష్ట్యా కలవరపాటుకు గురైంది. రైల్‌భవన్ వద్దే సోమవారం రాత్రి నిద్రించిన ఢిల్లీ సీఎం మంగళవారం కూడా ధర్నా కొనసాగించారు. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 26 వేడుకల్లో రాజ్‌పథ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓవైపు ధర్నాస్థలి వద్ద సీఎంగా ఫైళ్లను పరిశీలిస్తూనే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండడం, ఎల్జీ హామీ లభించడంతో కేజ్రీవాల్ వెంటనే ధర్నాకు ముగింపు పలికి వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తపడ్డారు. సోషల్ నె ట్వర్కింగ్ సైట్లలో చక్కర్లు.. ఫేస్బుక్, ట్విటర్తోసహా అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ కేజ్రీవాల్ వార్తలు కోడై కూశాయి. ప్రముఖ పత్రికల నెట్ ఎడిషన్లలోనూ ఎక్కువ మంది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ వార్తలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ఓ ప్రధాన పత్రిక నిర్వహించిన సర్వేలో అత్యధిక చర్చకు కారణమైన రాజకీయ నాయకుల జాబితాలో కేజ్రీవాల్ అత్యధికంగా 24,496 ఓట్లతో ముందుండగా, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ 5,041 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అత్యధికంగా చర్చకు కారణమైన రాజకీయపార్టీగా 44.21 శాతం ఓట్లతో ఆప్ మొదటి స్థానంలో, 28.46 శాతం ఓట్లతో బీజేపీ రెండోస్థానంలో, 23.07 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచాయి. ట్విటర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆప్ధర్నాపై చర్చలు కొనసాగాయి. కేజ్రీవాల్ ధర్నాపై మిశ్రమ స్పందన వ్యకమయింది. పేదల పక్షాన పోరాడుతున్నారని కొందరు కీర్తించగా, తన మంత్రులను కాపాడుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని మరికొందరు విమర్శించారు.