‘క్రేజీ’వాల్..!
Published Tue, Jan 21 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజధాని నడిబొడ్డున చేసిన ధర్నాతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టే చెప్పాలి. ఢిల్లీ పోలీసులపై అజమాయిషీ కోసం చేపట్టిన ధర్నాతో కే జ్రీవాల్ క్రేజ్ మరింత పెరిగింది. రెండు రోజులుగా ఢిల్లీలో ఏ ఇద్దరు కలిసినా ముఖ్యమంత్రి చేపట్టిన ధర్నాపైనే ప్రముఖంగా చర్చించుకున్నారు. కేజ్రీవాల్ ధర్నాకు దిగడం సమంజసమని కొందరు.. ముఖ్యమంత్రి హోదాలో ఇలా రోడ్లపై ధర్నాలు చేయడం ఏంటని మరికొందరు... ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేశారు. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి ఇది కలిసొచ్చే అంశంగానే చెప్పాలి.
చర్చ అనుకూలమా? ప్రతి కూలమా? అనే విషయం పక్కన పెడితే ప్రతిపక్షాలనుంచి సామాన్యుల వరకు మరోమారు తనపేరు నోళ్లలో నానేలా చేసుకున్నారు. మీడియాలో కూడా ఎక్కువగా కే జ్రీవాల్ చేపట్టిన ధర్నా వార్తలే ప్రసారమయ్యాయి. జనవరి 26 వేడులకు సరిగ్గా ఐదురోజుల ముందు హైసెక్యురిటీ జోన్‌గా భావించే రైల్‌భవన్ ప్రాంతంలో ధర్నాకు దిగి అందరినీ అశ్చర్యపరిచారు. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పొలిటికల్‌గా ఈ ధర్నా మైలేజీనిస్తుందన్న విశ్వాసం ఆప్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ సమస్యలపై పోరాటానికి అవసరమైతే కేంద్రంతో అమితుమీ తేల్చుకునేందుకు తాను వెనుకాడరన్న సందేశాన్ని పార్టీలకు ప్రజలకు పంపారన్నది వారి అభిప్రాయం. ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఢిల్లీ పోలీసులకు రెండ్రోజులు ముచ్చెమటలు పట్టించారు. అత్యంత సున్నితంగా మారిన ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ మంత్రి సైతం రెండు దఫాలుగా స్వయంగా ప్రధానితో భేటీ కావాల్సి వచ్చింది. కేంద్ర హోంశాఖ గాంభీర్యాన్ని ప్రద ర్శించినా దేశ గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్ల దృష్ట్యా కలవరపాటుకు గురైంది. రైల్‌భవన్ వద్దే సోమవారం రాత్రి నిద్రించిన ఢిల్లీ సీఎం మంగళవారం కూడా ధర్నా కొనసాగించారు. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 26 వేడుకల్లో రాజ్‌పథ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓవైపు ధర్నాస్థలి వద్ద సీఎంగా ఫైళ్లను పరిశీలిస్తూనే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండడం, ఎల్‌జీ హామీ లభించడంతో కేజ్రీవాల్ వెంటనే ధర్నాకు ముగింపు పలికి వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తపడ్డారు.
సోషల్ నె ట్‌వర్కింగ్ సైట్లలో చక్కర్లు..
ఫేస్‌బుక్, ట్విటర్‌తోసహా అన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ కేజ్రీవాల్ వార్తలు కోడై కూశాయి. ప్రముఖ పత్రికల నెట్ ఎడిషన్లలోనూ ఎక్కువ మంది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ వార్తలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. ఓ ప్రధాన పత్రిక నిర్వహించిన సర్వేలో అత్యధిక చర్చకు కారణమైన రాజకీయ నాయకుల జాబితాలో కేజ్రీవాల్ అత్యధికంగా 24,496 ఓట్లతో ముందుండగా, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ 5,041 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అత్యధికంగా చర్చకు కారణమైన రాజకీయపార్టీగా 44.21 శాతం ఓట్లతో ఆప్ మొదటి స్థానంలో, 28.46 శాతం ఓట్లతో బీజేపీ రెండోస్థానంలో, 23.07 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచాయి. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఆప్‌ధర్నాపై చర్చలు కొనసాగాయి. కేజ్రీవాల్ ధర్నాపై మిశ్రమ స్పందన వ్యకమయింది. పేదల పక్షాన పోరాడుతున్నారని కొందరు కీర్తించగా, తన మంత్రులను కాపాడుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని మరికొందరు విమర్శించారు.
Advertisement