కామెడీ కపిల్‌కు కోటి మందికి పైగా అభిమానులు
కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే పాపులర్ టీవీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' ఫేస్బుక్ పేజీకి కోటికి పైగా లైకులు వచ్చాయి. తన షోను ఇంతగా ఆదరించినందుకు అభిమానులందరికీ కపిల్ కృతజ్ఞతలు తెలిపాడు. తన పేజీని లైక్ చేసిన వారికి, తమ షో వీడియోలను స్నేహితులతో షేర్ చేసుకున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాడు. ప్రేక్షకులు అత్యధికంగా ఆదరించే షోగా మాత్రమే కాక, అభిమానుల విషయంలో కూడా తమ కామెడీ నైట్స్ నెంబర్ వన్‌గా నిలిచిందని అన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు తనను ఆదరించారనడానికి ఇదే నిదర్శనమని, కేవలం టీవీలో మాత్రమే కాక ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా చూడగలిగేలా తమ షోలను రూపొందిస్తున్నామని కపిల్ శర్మ చెప్పాడు. ప్రజలను నవ్వించాలనే తన చిన్న హాబీ కాస్తా టీవీలో చాలా పెద్దగా పెరిగిపోయిందని, దీన్ని మరింత మెరుగుపరచాలంటే తనకు చాలా కష్టంగా ఉందని అన్నాడు. ఏడాది కూడా పూర్తి కాకముందే ఈ షో ప్రాచుర్యం బాగా పెరిగిందని చెప్పాడు. ఈ షోలో బిట్టుగా కపిల్ శర్మ, ఆయన భార్యగా టీవీ నటి సుమోనా చక్రవర్తి, నాయనమ్మగా అలీ అస్గర్, మేనత్తగా ఉపాసనా సింగ్ నటిస్తారు. వాళ్ల ఇంట్లో వంటవాడిగా చందన్ ప్రభాకర్, పొరుగింటి బడ అమ్మాయిగా కికు శారద ఆయా పాత్రల్లో మెప్పిస్తారు.