వేధిస్తున్నారన్నా పట్టించుకోకపోవడంతో...
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా పరిధిలో పోలీసుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థిని ఉసురు తీసింది. తన పొరుగున ఉండే కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధిస్తూ, కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంతో మనస్తాపం చెందిన 11వ క్లాసు విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63 లో నివసించే పాఠశాల విద్యార్థిని తన ఇంటి పక్కనే ఉండే వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కెళ్లింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆందోళన చెందిన ఆ విద్యార్థిని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.
తన పక్క ఫ్లాట్ లో నివసించే వ్యక్తులు తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారని, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రేప్ చేస్తామని బెదిరించారంటూ తన సోదరి రాసుకున్న సూసైడ్ నోట్ ఆమె బ్యాగ్ లో చూసినట్లు మృతురాలి సోదరుడు తెలిపాడు. దీంతో అదే రోజు పోలీసు స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించకోలేదన్నాడు. ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి తెలిపారు. అందుకే తన బిడ్డ ఈ నిర్ణయం తీసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారి దినేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులను వివరణ కోరామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.