పాత ఇంటికీ లెక్కుంది
♦ పాత ఇళ్లనూ హరిత భవనాలుగా మార్చుకునే వీలు
♦ చిన్నచిన్న మార్పులతో సాధ్యమేనంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను పర్యావరణహితమైన గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించవచ్చు. ఆయా భవనాలకు ప్లాటినం, స్వర్ణం, రజతం పేర్లతో రేటింగ్ ఇచ్చే విధానం గురించి విన్నాం.. మరి పాత భవనాల సంగతేంటి? వాటిని కూడా హరిత భవనాలుగా మార్చుకోవటమెలా? పాత ఇళ్లను గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో మార్చుకునే వీలుంది.
హరిత ప్రమాణాలివే..
♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
♦ ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి.
♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్నచిన్న మార్పులు చే యాలి.
♦ భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్(సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి.
♦ భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి.
♦ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి.
♦ భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి.
♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి.
ప్రయోజనాలివే..
♦ భవనాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ) ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. పర్యావరణ హానికారక సమస్యలను హరిత భవనాల ద్వారా పరిష్కరించవచ్చు.
♦ రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ బిల్డింగ్స్‌లో వాడటం మూలంగా ఇంట్లోని వేడిని గ్రహిస్తాయి.
♦ సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించటంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది.
♦ గ్రీన్ బిల్డింగ్స్ భవనాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. దీంతో ఏసీ, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది.