నిర్బంధ ఓటింగ్ ఆచరణలో అసాధ్యం
న్యూఢిల్లీ: నిర్బంధ ఓటింగ్ ఆలోచన ఆచరణలో అసాధ్యమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఓ సదస్సులో నసీం జైదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో అమలవుతున్న తప్పనిసరి ఓటింగ్ విధానం చర్చకు తావిస్తోందని, కానీ ఇది ఆచరణలో అసాధ్యమని గుర్తించినట్లు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంపై ప్రశ్నించగా, జైదీ స్పందిస్తూ..
దీనికి సంబంధించి చట్ట సవరణకు అన్ని రాజకీయపార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని పార్లమెంటరీ కమిటీతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా ఈ ప్రతిపాదనను సమర్థిస్తామని, ఇందుకు రూ.9 వేల కోట్ల వ్యయమవుతుందని మే నెలలో న్యాయ మంత్రిత్వ శాఖకు ఎన్నికల కమిషన్ సమాధానమిచ్చింది. అలాగే పెద్ద సంఖ్యలో ఈవీఎంలు కొనాల్సి ఉంటుందని పేర్కొంది.