వాస్తు బాగోలేదని..
ఊరిని తరలించిన గ్రామస్తులు
ఆరేళ్ల క్రితం కొత్త ఊళ్లోకి..
సంతోషంగా ఉన్నామంటున్న ప్రజలు
వాస్తు.. దీనిని నమ్మని వారు చాలా అరుదు. ఇంటి నిర్మాణం నుంచి ఏవైపున ఏది ఉండాలో నిర్ణయించేది ఇదే. ఈ కంప్యూటర్ యుగంలోనూ వాస్తు ప్రకారమే ఇళ్లు నిర్మిస్తున్నారు. అది లేకుంటే అనర్థాలు జరుగుతాయని భావిస్తారు. వాస్తు బాగోలేని ఇళ్లను కూల్చి మళ్లీ కట్టడం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు ప్రభుత్వాధికారులు కూడా తమ కార్యాలయాలను వాస్తు ప్రకారం డిజైన్ చేయించుకుంటున్నారు.
ఇళ్లు, కార్యాలయాల మాట సరే.. మరి వాస్తు ఏమాత్రం బాగోలేదని ఓ ఊరినే తరలించే శారా గ్రామస్తులు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఎప్పుడో ఆరేళ్ల క్రితమే ఇది జరిగినా గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామానికి గ్రామాన్నే ఇలా తరలించడం వారి ఐక ్యతకు, నమ్మకానికి నిదర్శనం. మరి అదెలా జరిగిందో తెలుసుకోవాలంటే ములుగు మండలంలోని కొడిశలకుంటకు వెళ్లాల్సిందే.
బాధల్లేని గ్రామంగా..
గ్రామాన్ని తరలిస్తేనే మంచి జరుగుతుందని పండితులు చెప్పడంతో అయోమయంలో పడ్డ గ్రామస్తులు.. ఒకచోట సమావేశమై చర్చించుకున్నారు. అయ్యగార్లు చెప్పారు కాబట్టి గ్రామాన్ని తరలించడమే మంచిదని యువకులు పట్టుబట్టారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామానికి కిలోమీటరు దూరంలోని గడ్డపై వాస్తు ప్రకారం ఓ కొత్త గ్రామాన్ని పునర్నిర్మించుకున్నారు. 2008లో గ్రామస్తులంతా మూకుమ్మడిగా కొత్త ఊర్లోకి అడుగుపెట్టారు. గ్రామాన్ని మార్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందని, సమస్యలు లేవని, సంతోషంగా ఉన్నామని గ్రామస్తులంతా సంతోషంగా చెబుతున్నారు. ఇదీ.. ఊరును మార్చిన వాస్తు కథ.