త్వరలో... జంగిల్‌బుక్-2
అమెరికాలో రిలీజ్ కాక ముందే సంచలనం
మన దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నాట ఇప్పుడు జనమంతా చెప్పుకుంటున్న సినిమా - ‘ది జంగిల్ బుక్’. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలోవిడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం.
ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్! అమెరికాలో ఈ వారం రిలీజ్!
చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్’. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజానికి, పెద్ద నగరాల్లో ఇంగ్లీషే తప్ప ఈ ప్రాంతీయ భాషా వెర్షన్ల ప్రదర్శనలు తక్కువగా వేస్తున్నారు. దాంతో, ఉన్న ఒకటీ, అరా థియేటర్లలో రోజుకు ఒకటి, రెండు ఆటలతో టికెట్లు దొరక్క జనం అసంతృప్తితో వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి.
అయితేనేం, త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు వచ్చాయి. రెండో రోజున వసూళ్ళ స్థాయి ఇంకా పెరిగి, రూ.13.5 కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది.
దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్’! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేయనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెంటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది.
వార్నర్ బ్రదర్స్ పోటీ ‘జంగిల్ బుక్’ వాయిదా!
నిజానికి, డిస్నీ సంస్థతో పాటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా ఇదే ‘జంగిల్ బుక్’ కథతో ఒక సినిమా చేసే పనిలో ఉంది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్ - ఆరిజిన్స్’ పేరిట తీయాలనుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 6కు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, తాజాగా దాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. 2018 అక్టోబర్ 19కి రిలీజ్ చేసేలా, నిర్మించాలని భావిస్తున్నారు. దాంతో, వాల్ట్‌డిస్నీ, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల మధ్య పోటీలో ఒక రకంగా డిస్నీ సంస్థది ఇప్పుడు పైచేయి అయింది.
రెండో పార్ట్‌కీ అదే టీమ్
మొత్తానికి, గతంలో తీసిన ‘అలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘మ్యాలెఫిషెంట్’, ‘సిండెరెల్లా’ల ఫక్కీలో ఇప్పుడీ ‘ది జంగిల్ బుక్’ కూడా భారీ హిట్టవడంతో డిస్నీ సంస్థ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇంకా రిలీజైనా కాక ముందే వాల్ట్‌డిస్నీ సంస్థ ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ‘ఐరన్‌మ్యాన్’ చిత్ర ఫేమ్ జాన్ ఫావ్రీవ్ సారథ్యంలోనే ఈ రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నారు.
రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్’కు సినీ రచన చేశారు. ఇప్పుడు త్వరలోనే నిర్మించాలనుకుంటున్న రెండోభాగానికి సైతం రచన చేయాల్సిందిగా ఆయనతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి. నిజానికి, డిస్నీటూన్ స్టూడియోస్ సంస్థ గతంలో 2003లోనే ‘జంగిల్ బుక్-2’ అంటూ యానిమేషన్ చిత్రం తీసి, నేరుగా డి.వి.డి. విడుదల చేసింది. అయితే, ఇప్పుడు తీసిన సరికొత్త లైవ్ యాక్షన్ చిత్రం సీక్వెల్ కోసం ఆ యానిమేషన్ కథను వాడకపోవచ్చు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘జంగిల్ బుక్’ కథలు, నవలల నుంచి బోలెడన్ని అంశాల్ని తవ్వితీసి, స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంది.
‘అవతార్’తో పోలుస్తున్న విమర్శకులు
అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ‘ది జంగిల్ బుక్’ పార్ట్1 సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు. నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే! ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్’ సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు.
అయితే, షేర్‌ఖాన్, బాలూ, బఘీరా లాంటి జంతువుల పాత్రలన్నిటికీ ప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తమ గాత్రంతో ప్రాణం పోసి, కథాకథనంలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు అనుభవించేలా చేశారు. మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే కదూ!