చంద్రబాబుది నీచ రాజకీయం
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ధ్వజం
మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ఆయన..
బాబు ఇతర నేతల ఇంటి వద్ద ధర్నాలు చేరుుస్తారు..
సరస్వతి పవర్ సంస్థ ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుందని, న్యాయస్థానాల్లో పోరాటం చేసైనా సరే దాన్ని అక్కడ పెడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇతర రాజకీయ నాయకుల ఇంటి వద్దకు వెళ్లి ధర్నాలు చేయండంటూ ఆయన తన వాళ్లను ప్రోత్సహిస్తారు కానీ, రైతులు తనను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే మాత్రం లాఠీలతో కొట్టిస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనవాళ్లు తప్ప ఇతరులెవ్వరూ పరిశ్రమలు పెట్టరాదన్నది చంద్రబాబు దుర్బుద్ధి అని ఆయన దుయ్యబట్టారు. శనివారం జగన్ నివాసం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు నిరసనగా, ఆయనకు సంఘీభావం తెలుపడానికి.. ఆదివారం గుంటూరు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాలకు చెందిన చెన్నాయపాలెం, తం గెడ, వేమూరు గ్రామాల నుంచి సుమారు వెయ్యి మంది రైతులు, స్థానిక ప్రజలు హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
‘‘చంద్రబాబునాయుడు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేయకుండా రైతుల కడుపు కొట్టారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలను కూడా మాఫీ చేస్తానని చేయలేదు. చివరకు అవ్వా, తాతల పింఛన్లను కూడా నిర్దాక్షిణ్యంగా కత్తిరించారు. ఇలాంటి తన వైఫల్యాలన్నిటి నుంచీ ప్రజల దృష్టి మళ్లించేందుకు, తన విషయంలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా ఏ స్థాయికైనా దిగజారి ప్రవర్తిస్తున్నారు. నిన్న (శనివారం) నా ఇంటి వద్ద టీడీపీ వారు ధర్నా చేశారు.
టీడీపీకి చెందిన కొంతమందిని ఇక్కడకు (క్యాంపు కార్యాలయం వద్దకు) పంపి, వాళ్లనే రైతులన్నట్లుగా చూపి, తమకు అన్యాయం జరిగిపోయిందని వారి చేత చెప్పించే కార్యక్రమం చంద్రబాబు చేయించారు. జరుగుతున్నది చూసి నాకు బాధ అన్పించింది. ఇక్కడ జరిగింది టీవీల్లో చూసి జరుగుతున్న అన్యాయానికి బాధపడి నాకు సంఘీభావం తెలపడానికి మాచవరం, దాచేపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యాక్టరీ కోసం భూములమ్మిన రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయతలకు నాకు చాలా ఆనందంగా ఉంది. (జగన్ ఈ మాటలంటున్నప్పుడు రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి)
రైతులు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాం
సరస్వతి సిమెంట్స్ నిర్మాణం కోసం 2008-2009లో రైతుల నుంచి భూముల కొనుగోలు మొద లు పెట్టాం. ఆ రోజులు నాకు బాగా గుర్తు. ఐదేళ్ల కిందట అక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయని ఆరా తీశా. ఒక ఎకరా ఖరీదు రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఉందని అన్నారు. మేము భూమి కొనుగోలు చేస్తున్న ప్రదేశానికి ఒక కిలోమీటరు దూరంలో భవ్య సిమెంట్ కంపెనీ వాళ్లు కూడా భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్లు ఎకరాకు రూ.1 లక్ష నుంచి రూ.1.20 లక్షలిచ్చి కొంటున్నారని చెప్పారు.
మన రైతులు ఆనందంగా తమ భూములు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలో చెప్పండి అని వారినే అడిగా. అందరూ కలిసి సమావేశమై ఏ ధర ఇస్తే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందో చెప్పండి అన్నా. ఆ అంశం నాకిప్పటికీ గుర్తుంది. ఎకరాకు రూ.2.6 లక్షలిస్తే సంతృప్తికరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారని కంపెనీ ప్రతినిధి వేణుగోపాల్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఎకరాకు రూ.2.6 లక్షలు కాదు, రూ.3 లక్షలు ఇచ్చి కొనుగోలు చేయండి, రైతుల కళ్లల్లో ఆనందమే నేను చూడాల్సింది అని అప్పుడే చెప్పాను. అప్పటి నుంచీ ఐదు సంవత్సరాలైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన పర్యావరణ అనుమతులతో సహా అన్నీ తెచ్చాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులు మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీళ్లకు అనుమతి రావాలి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతి రావాలి.
ఏ పరిశ్రమ అయినా రావాలంటే ప్రధానంగా కావాల్సినవి నీళ్లు, కరెంటు. ఈ రెండూ లేనిదే ఏ పరిశ్రమా రాదు. ఈ అనుమతి ఇవ్వాల్సిన కనీస ధర్మం రాష్ట్ర ప్రభుత్వానిదైతే , అనుమతులు పొందడమనేది పారిశ్రామిక వేత్తల హక్కు. అయినప్పటికీ ఈ అనుమతులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉండి పోయాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్టరీకి నీళ్లివ్వకుండా తాత్సారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న నీళ్లు, కరెంటు ఇవ్వకుండా ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ఎలా ముందుకు వస్తారు? అని నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఈ రెండు అనుమతులూ ఇవ్వకుం డానే.. ఫ్యాక్టరీకి ఇచ్చిన గనుల లీజును ఏకంగా రద్దు చేసే స్థాయికి చివరకు ఈ రాజకీయాలు దిగజారిపోయాయి.
ఒకరికి ఒక న్యాయం..
మరొకరికి మరో న్యాయమా?
చంద్రబాబునాయుడును నేను అడగదల్చుకున్నదొక్కటే. ఇదే దాచేపల్లి మండలంలో 7 సిమెంట్ ఫ్యాక్టరీ కర్మాగారాలున్నాయి. వాటిలో కొన్ని అయితే 20 సంవత్సరాల క్రితం మైనింగ్ లీజులు పొందాయి. ఎవరూ కూడా ఇప్పటికీ ఫ్యాక్టరీ పెట్టక పోయినా వారి జోలికి పోరు. సాక్షాత్తూ టీడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డికి 8 సంవత్సరాల క్రితం ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వ భూమిని సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఫ్యాక్టరీ పెట్టక పోయినా ఆయనకు ఇచ్చిన లీజును మాత్రం రద్దు చేయరు.
మేం మాచవరం, దాచేపల్లి మండలాల్లోని రైతులకు ఒక ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.8.5 లక్షలు వరకు చెల్లించి భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ పెట్టడానికి ముందడుగు వేస్తున్నప్పుడు, తమ వాళ్లు తప్ప మరొకరు ఫ్యాక్టరీలు పెట్టకూడదు అనే దురుద్దేశంతో సరస్వతి ఫ్యాక్టరీ లీజును చంద్రబాబు రద్దు చేశారు. (ఆ సమయంలో ‘సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలి’ అంటూ రైతులు నినాదాలు చేశారు) నేను ఒక్కటే చెబుతున్నా. అక్కడ ఫ్యాక్టరీ కచ్చితంగా వస్తుంది. కచ్చితంగా మంచి జరుగుతుంది. కోర్టుకు పోయి అయినా సరే, పోరాటం చేసి అయినా సరే ఫ్యాక్టరీని అక్కడ పెడతాం. (రైతుల కేరింతలు) మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలను నేను గుండె నిండా దాచుకుంటాను. దేవుడు పై నుంచి అన్నీ చూస్తున్నాడు. చంద్రబాబుకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా అతి త్వరలో వస్తుంది.
అర్జీ ఇవ్వాలని వస్తే లాఠీ దెబ్బలా?
సరస్వతి సిమెంట్స్‌కు అనుమతులు ఇవ్వని విషయమై గట్టిగా నిలదీయాలని, ప్రభుత్వానికి ఒక అర్జీ ఇవ్వాలని దాచేపల్లి, మాచవరం మండలాల రైతులు వస్తే వారిపై చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేయించారు. ఇలాంటి వ్యక్తికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉందా? (రైతుల నుంచి ‘లేదు, లేదు’ అని అరుపులు) ఆయన అతిదారుణంగా పోలీసుల సాయంతో మనుషులను ఇతర రాజకీయ నాయకుల ఇళ్ల వద్దకు పంపి ధర్నాలు చేయించవచ్చు. సాధారణ రైతులు వచ్చి అర్జీ ఇవ్వాలని ప్రయత్నిస్తే లాఠీచార్జి చేయిస్తారా? చంద్రబాబు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంది?’’ అని జగన్ అన్నారు. ఆయన ప్రసంగం ముగిశాక సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించాలనీ, తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులు నినాదాలు చేశారు. రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ సైమన్ ఉన్నారు.
ఇది రాజకీయ కుట్ర
సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తే మా గ్రామా లు బాగుపడతాయని ఆశిస్తూ ఉంటే ఓ వర్గానికి చెందిన కొంతమంది రాజకీయాలతో కుట్ర చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ గనుల లీజు రద్దు చట్ట విరుద్ధం. వెంటనే అనుమతులు పునరుద్ధరించి ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలి.
-మాజీ సర్పంచ్ సైమన్
ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నాం
నేను సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఎకరా రూ.3 లక్షల చొప్పున 15 ఎకరాలు అమ్మా ను. మేము అడిగినదానికన్నా యాజమాన్యం రూ.40 వేలు ఎక్కువ ఇచ్చింది. సంతోషంగా భూములు ఇచ్చాం. ఫ్యాక్టరీ నిర్మించాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీ నిర్మిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చోటు చేసుకోవడం విచారకరం.
- వీరయ్యయాదవ్, ఎంపీటీసీ
టీడీపీ వాళ్లే రెచ్చగొడుతున్నారు
నేను రెండెకరాలు అమ్మాను. ఫ్యాక్టరీ కోసం ఎదురుచూస్తున్నాం. మీ పొలాలు తిరిగి ఉచితంగా ఇప్పిస్తామని మా ఊర్లోని కొందరు టీడీపీ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు. నిన్న (శనివారం) ఇక్కడ ధర్నా చేయించిందీ వాళ్లే.
- బి. వెంకటేశ్వర్లు, రైతు (చెన్నాయపాలెం)
ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు
నేను 12 ఎకరాలు అమ్మాను. ఊహిం చినదానికంటే అప్పట్లో ఎక్కువ రేటే ఇచ్చా రు. అప్పట్లో ఎకరా ధర రూ.60 వేలకు మిం చి లేదు. మా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వచ్చి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనీయబోమని, రైతుల పొలాలను ఇప్పించేస్తానని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.
- అన్నపురెడ్డి రామిరెడ్డి (చెన్నాయపాలెం)