consumer forum complaint
-
ఆ ఒక్క బిస్కెట్ విలువ రూ.1 లక్ష !
తిరువల్లూర్(తమిళనాడు): చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది. -
వినియోగదారుల ఫిర్యాదుల విచారణ.. ఇక ఆన్లైన్లో!
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఫిర్యాదులపై విచారణను ఇకపై ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. ఇది అమల్లోకి వస్తే ఫిర్యాదుదారులు భౌతికంగా కేసుల విచారణకు హాజరయ్యే అవసరం గణనీయంగా తగ్గనుంది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు, కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే అన్ని వినియోగదారుల కమిషన్లలో త్వరలోనే ఈ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో సరబ్జిత్ సింగ్ భార్య కన్నుమూత -
రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం
మైసూరు: సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో వస్తువులను విచ్చలవిడి ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక జనం కొంటూ ఉంటారు. కానీ ఎంఆర్పీ ధర కంటే వ్యాపారి రూ.20 అదనంగా తీసుకోవడంపై రిటైర్డు ఉపాధ్యాయుడు మూడేళ్లు న్యాయ పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ సంఘటన మైసూరులో జరిగింది. వివరాలు.. సత్యనారాయణ 2019లో హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90 అవుతుంది. కానీ హనుమంతరాజు రూ.110 వసూలు చేశాడు. ఇందుకు బిల్లు కూడా ఇచ్చాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని సత్యనారాయణ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సత్యనారాయణ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి వ్యాపారి నిర్వాకానికి గాను రూ.61 వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు. ఇప్పటివరకు విచారణ కొనసాగింది. వ్యాపారి చేసింది తప్పని నిర్ధారణ కావడంతో ఫోరం అతనికి రూ.6,020 జరిమానా విధిస్తూ, ఆ సొమ్మును బాధితునికి ఇవ్వాలని తెలిపింది. చదవండి: (Chandana: పుట్టిన రోజు నాడే డెత్ నోట్ రాసి..) -
ఏంటీ మీ తొక్కలో సర్వీస్.. ఇలాగైతే కుదరదు మరి..
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ ఇతర ఈ కామర్స్ సంస్థలపై కేంద్రం కన్నెర్ర చేసింది. మీ సర్వీసులు బాగాలేవంటూ మాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయ్. అసలు కస్టమర్ల సమస్యలు పరిష్కరించేందుకు మీరు అవలంభిస్తున్న విధానాలు ఏంటీ ? మరింత మెరుగ్గా సేవలు ఎలా అందివ్వగలరో మాకు తెలపండి అంటూ వాటికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక అందించేందుకు 15 రోజుల గడువు విధించింది. ఈ కామర్స్ సర్వీసుల్లో లోపాలపై గత ఏడాది కాలంలో నేషనల్ కన్సుమర్ హెల్ప్‌లైన్‌కి ఏకంగా 3,631 ఫిర్యాదులు అందాయి. ఇందులో జోమాటో, స్విగీపై 2,828 ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసింది కన్సుమర్ ఎఫైర్స్ శాఖ. ఇందులో ముఖ్యంగా సర్వీసుల్లో లోపాలపై స్విగ్గీ, జోమాటోలను నిలదీసింది. ఫుడ్ సర్వీసులపై ఎందుకు ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయంటూ ప్రశ్నించింది. చివరకు ఫిర్యాదుల పరిష్కారం, సేవల్లో లోపాలు సవరించే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కన్సుమర్ ఎఫైర్స్ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఆఫీస్‌లో కొత్త రూల్.. ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని! -
న్యాయవాది కేసు ఓడిపోతే సేవాలోపం అనలేం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ ఎవరైనా పరిహారం నిమిత్తం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చని, అయితే అది అన్ని వేళలా సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 8న విచారించింది. ఓ కేసు విషయంలో ముగ్గురు న్యాయవాదుల వల్ల నష్టపోయానంటూ వినియోగదారుల ఫోరాన్ని ఓ వ్యక్తి సంప్రదించారు. జాతీయ వినియోగదారుల ఫోరం కూడా సదరు వ్యక్తి అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించడం సబబే. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అంతమాత్రాన వినియోగదారుల ఫోరానికి వెళ్లి న్యాయవాది నుంచి పరిహారం ఇప్పించాలనడం సమంజసం కాదు. జరిమానా విధించకుండా పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నిర్లక్ష్యం ఉందని బలమైన ఆధారాలుంటే తప్ప సేవాలోపంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. -
స్విగ్గీకి షాక్! రూ.4.50 జీఎస్టీకి... రూ.20వేల ఫైన్
పంచకుల(హర్యానా): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది! కస్టమర్ నుంచి అనుచితంగా పన్ను వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరం ఫైర్ అయ్యింది. అనవసరంగా పన్ను విధించినందుకు, వినియోగదారున్ని మానసిక వేధనకు గురి చేసినందుకు భారీగా ఫైన్ విధించింది. కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్ గార్గ్ స్విగ్గీ ద్వారా స్విగ్గీ మొబైల్యాప్ ద్వారా చీజ్ గార్లిక్ స్టిక్‌తో పాటు మూడు సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. ఇందులో గార్లిక్ స్టిక్కి రూ. 144, కూల్‌డ్రింక్స్‌కి రూ.90లు అయ్యింది. అయితే బిల్ వచ్చిన తర్వాత పరిశీలిస్తే సాఫ్ట్‌డ్రింక్స్‌కి ప్రత్యేకంగా రూ. 4.50 జీఎస్టీగా స్విగ్గీ వసూలు చేసినట్టు గమనించాడు. కొనుగోలు చేసిన వస్తువులకు ఎంఆర్పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్‌డ్రింక్‌కి జీఎస్టీ వసూలు చేయడం కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పంచకుల వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. మా తప్పేం లేదు అయితే తాము కేవలం మధ్యవర్తులమేనని, సాఫ్ట్‌డ్రింక్ అమ్మకం దారు పాలసీకి అనుగుణంగానే జీఎస్టీ వసూలు చేశామని, తమ సేవల్లో లోపం లేదంటూ పేర్కొంది. అయితే స్విగ్గీ వాదనలు విన్న ఫోరం మండిపడింది. స్విగ్గీ ఏమీ ఛారిటబుల్ ట్రస్ట్ కాదని, వినియోగదారు, అమ్మందారుల మధ్యవర్తిగా ఉంటూ డెలివరీ పనులు నిర్వహిస్తోందని పేర్కొంది. రూ. 20,000 ఫైన్ కట్టండి చట్ట విరుద్ధంగా సాఫ్ట్‌డ్రింక్‌పై జీఎస్టీగా రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా వసూలు చేసిన రూ. 4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు కోర్టు, ఇతర ఖర్చుకు గాను అభిషేక్ గార్గ్‌కి రూ. 10,000 చెల్లించాలంది. దీంతో పాటు జరిగిన పొరపాటుకు జరిమానాగా రూ. 10,000 హర్యాణా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వేల్ఫేర్‌కి డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
విద్యుత్ బిల్లులకూ జీఎస్టీ అడుగుతున్నారు..
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ చార్జీలను జీఎస్టీతో కలిపి చెల్లిస్తున్నా, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, జీతాలకు సైతం జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్ చెల్లించాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు తమను ఒత్తిడి చేస్తున్నాయంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్‌మెంట్‌వాసులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్ చెల్లించకుంటే, నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొంటామంటూ ఇందూ ప్రాజెక్ట్స్ బెదిరిస్తోందని, తమకు మానసిక క్షోభ కలిగిస్తున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఇందూ అరణ్య పల్లవి అపార్ట్మెంట్స్ కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఫోరం ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, తెలంగాణ హౌసింగ్ బోర్డులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్స్, ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లు అపార్ట్మెంట్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, తోట పని, లిఫ్ట్‌ల నిర్వహణ తదితరాలన్నింటినీ ఔట్ సోర్సింగ్కి ఇచ్చి, అందుకు సంబంధించిన వ్యయాన్ని ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీతో కలిపి తమ నుంచి వసూలు చేస్తున్నాయంది. మానసిక వేదనకు గురి చేసినందుకు తమకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.24.9 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఫోరంను కోరింది. -
ఎంజీఎంలో మెడిసిన్స్ వ్యాపారంపై ఫిర్యాదు
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొనసాగుతున్న మందుల అక్రమ వ్యాపార విధానాలపై శుక్రవారం ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ అకున్ సబర్వాల్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని వినియోగదారుల మండలి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి తెలిపారు. ఎంజీఎంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో అధికారులు నిబంధనలు పాటించకుండా లోపాయికారి అవగాహనతో మందులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మందుల విక్రయ కమిటీతో సంబంధం లేకుండా స్థానిక ఉన్న సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు, అధికారులు ఏ మందులు కొనుగోలు చేయాలనేది నిర్ణయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు ఆస్పత్రిలో ఔషధ అవసరాలు సృష్టించి తమకు తెలిసిన ఏజెన్సీల ద్వారా కొటేషన్లు తీసుకుని లోపాయికారి మందులు కొనుగోళ్లు చేయడం జరుగుతుందన్నారు. ఎంజీఎంలోని స్టోర్స్ సిబ్బంది బినామీ ఏజెన్సీలు సృష్టించి ఆస్పత్రికి మందుల కొనుగోలు చేయడం చేసిన దందా నాసిరకం ప్రాలీడాక్సిన్ ఐడెడ్ యాంపిల్స్ ఘటనతో వెలుగు చూసిందన్నారు. అలాగే డైక్లోఫిన్ సోడియం మాత్రలు, అమ్మాక్సిలిన్ ఇంజక్షన్లు, పొటాషియం మాత్రలు, దగ్గు సిరఫ్‌లు నాసిరకంగా ఉన్నాయని ఔషధ నియంత్రణ అధికారులు హెచ్చరించడం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఔషధ నియంత్రణాధికారులు స్పందించి నాసిరకం మందులు సరఫరా చేస్తున్న ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలను గుర్తించి ఆయా మెడికల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.