ఎంజీఎంలో మెడిసిన్స్ వ్యాపారంపై ఫిర్యాదు
Published Fri, Aug 5 2016 11:54 PM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొనసాగుతున్న మందుల అక్రమ వ్యాపార విధానాలపై శుక్రవారం ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ అకున్ సబర్వాల్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని వినియోగదారుల మండలి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి తెలిపారు. ఎంజీఎంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రాథమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రుల్లో అధికారులు నిబంధనలు పాటించకుండా లోపాయికారి అవగాహనతో మందులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
మందుల విక్రయ కమిటీతో సంబంధం లేకుండా స్థానిక ఉన్న సూపరింటెండెంట్‌లు, ఫార్మసిస్టులు, అధికారులు ఏ మందులు కొనుగోలు చేయాలనేది నిర్ణయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు ఆస్పత్రిలో ఔషధ అవసరాలు సృష్టించి తమకు తెలిసిన ఏజెన్సీల ద్వారా కొటేషన్లు తీసుకుని లోపాయికారి మందులు కొనుగోళ్లు చేయడం జరుగుతుందన్నారు. ఎంజీఎంలోని స్టోర్స్ సిబ్బంది బినామీ ఏజెన్సీలు సృష్టించి ఆస్పత్రికి మందుల కొనుగోలు చేయడం చేసిన దందా నాసిరకం ప్రాలీడాక్సిన్ ఐడెడ్ యాంపిల్స్ ఘటనతో వెలుగు చూసిందన్నారు. అలాగే డైక్లోఫిన్ సోడియం మాత్రలు, అమ్మాక్సిలిన్ ఇంజక్షన్లు, పొటాషియం మాత్రలు, దగ్గు సిరఫ్‌లు నాసిరకంగా ఉన్నాయని ఔషధ నియంత్రణ అధికారులు హెచ్చరించడం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఔషధ నియంత్రణాధికారులు స్పందించి నాసిరకం మందులు సరఫరా చేస్తున్న ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలను గుర్తించి ఆయా మెడికల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement