ప్రజల చేతికే...ప్రగతి చ్రక్రం
మీ కాలనీలో రోడ్డు బాగా లేదా..? కొత్త రోడ్డు వేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయా.. ?
నో ప్రాబ్లమ్.
మీ బస్తీలో పిల్లల పుట్టిన రోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాలు ఉంటే బాగుండేదని అనుకుంటున్నారా ..?
ఇకపై చింతించాల్సిన పని లేదు.
మీ పరిసరాల్లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. దానికో ప్రహరీ నిర్మిస్తే పిల్లలకు ఆట స్థలంగానో.. లేదా పార్కుగానో అభివృద్ధి చేయవచ్చుననుకుంటున్నారా..?
మీరు చేయాలనుకుంటున్న పనికి సహకారం అందుతుంది.
సాక్షి, సిటీబ్యూరో: కాలనీలు.. బస్తీల ప్రజలు తమకు ఏఏ సదుపాయాలు అవసరమని భావిస్తున్నారో వాటిని స్వయంగా వారే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించబోతోంది. బస్తీ సంఘాలు.. కాలనీ అసోసియేషన్లు.. లేదా పదిమంది బృందంగా ఏర్పడి తమ అవసరాల కోసం తామే పనులు చేసుకుంటామంటే జీెహ చ్ఎంసీ అవకాశం కల్పించనుంది.
ప్రజలకు ఉపయోగపడే పనులను వారి భాగస్వామ్యంతోనే చేయించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ.10 నుంచి రూ.20 లక్షలకు మించని పనులను ఇలా ప్రజలకే ఇచ్చేందుకు సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. తద్వారా ప్రజలకు అవసరమైన సదుపాయాలు సకాలంలో సమకూరడమే కాకుండా.. పనులు సత్వరం పూర్తవుతాయని భావిస్తున్నారు. అంతేకాదు.. తమ కోసం పనులు చేసుకుంటారు కాబట్టి నాణ్యతలోనూ ప్రజలు రాజీ పడబోరని భావిస్తున్నారు.
వివిధ పనులకు సంబంధించి తగిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే వారికి అంచనా వ్యయం, ఇతరత్రా అంశాలను లెక్కించి, జీహెచ్ఎంసీ అధికారులు 80 శాతం మేర నిధులు అందజేస్తారు. మిగతా 20 శాతం నిధులను పనులు పూర్తయ్యాక, క్వాలిటీ కంట్రోల్ పరీక్షల అనంతరం చెల్లిస్తారు. సాంకేతిక పదాల జోలికి పోకుండా, వీలైనంత మేరకు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే అంచనాలు రూపొందిస్తారు.
ఇలా ఏటా దాదాపు రూ.500 కోట్ల మేర పనులు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 20-30 కాలనీల్లో రూ.10 కోట్ల మేర ఇలాంటి పనులను ప్రజలకు అప్పగించాలని భావిస్తున్నారు. త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. రెసిడె న్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు(ఆర్డబ్ల్యూఏలు) తాము చేయదలచుకున్న పనుల వివరాలతో ఆన్లైన్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయవచ్చు.
అటు నిధుల సద్వినియోగం.. ఇటు అభివృద్ధి
జీహెచ్ఎంసీకి దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ అందులో సగం నిధులు కూడా ఖర్చు కావడం లేదు. సాధారణంగా ఎక్కువ చోట్ల నిధుల లేమి సమస్య ఎదురవుతుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి భిన్నం. అందుకు కారణాలనేకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహ చ్ఎంసీ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను అలా కొనసాగిస్తూనే.. తక్కువ మొత్తాల్లో పూర్తయ్యే పనులను స్థానికులకు, భారీ మొత్తాల్లో చేపట్టాల్సిన వాటిని పెద్ద కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నారు. తద్వారా నిధులు వినియోగమై, ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఉండే రిటైర్డు ఇంజినీర్ల వంటి వారి సహకారంతో పనులు నాణ్యతగా జరుగుతాయనేది అధికారుల అభిప్రాయం.
‘మన ఊరు-మన ప్రణాళిక’ తరహాలో నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ విధానం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో స్థానికులకు భాగస్వామ్యం కల్పించినట్లూ అవుతుందని భావిస్తున్నారు. పెద్ద పెద్ద పనులకు (రూ.100- రూ.200 కోట్ల వరకు) అంతర్జాతీయ సంస్థలు పాల్గొనేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు.