వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దు
కంట్రోలింగ్ అథారిటీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పెంచిన గ్రాట్యుటీని తమకూ వర్తింపజేయాలని కోరుతూ 2010 మే 24కు ముందు పదవీ విరమణ చేసిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులను కంట్రోలింగ్ అథారిటీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పునిచ్చారు. గ్రాట్యుటీ పెంపు నిర్ణయాన్ని 2010 మే 24 తర్వాత ఈసీఐఎల్ బోర్డ్ తీసుకున్న విషయాన్ని న్యాయమూర్తి గుర్తుచేశారు.
పెంచిన గ్రాట్యుటీని వర్తింపజేయాలని కోరుతూ 2008లో పదవీ విరమణ చేసిన డాక్టర్ టీఎస్.కృష్ణారావు కంట్రోలింగ్ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని అథారిటీ నిర్ణయించింది. అథారిటీ చర్యలను సవాలు చేస్తూ ఈసీఐఎల్ సీఎండీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. గ్రాట్యుటీని రూ.3.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని 2010 మే 24న బోర్డ్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. కృష్ణారావు 2008లోనే పదవీ విరమణ చేశారని, దీంతో ఆయనకు కొత్త గ్రాట్యుటీ సాధ్యం కాదన్నారు. వాదనలను పరిగ ణించిన న్యాయమూర్తి, 2010 మే 24కు ముందు విరమణ చేసిన ఈసీఐఎల్ ఉద్యోగుల దరఖాస్తులను పరిగణించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చారు.