లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్‌మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్‌మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు.
వాల్‌మార్ట్‌లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్‌పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది.