మరింత జాప్యం
♦ ఖరారుకాని పట్టాభిషేకం
♦ భూ క్రమబద్ధీకరణపై సందిగ్ధత
♦ కన్వియెన్స్డీడ్పై కొరవడిన స్పష్టత
♦ హక్కుల కోసం ఎదురుచూస్తున్న 6,779 మంది
భూక్రమబద్ధీకరణ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరి నాటికి మొత్తం సొమ్ము చెల్లించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. అస్పష్ట విధానాలతో వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. కన్వియెన్స్ డీడ్ (యాజ మాన్య హక్కులు)కు తుదిరూపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో జీఓ 59 (చెల్లింపు కేటగిరీ) కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన స్థలాలకు కూడా మోక్షం కలగడంలేదు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా జీఓ 59 కింద 11,846 దరఖాస్తులు రాగా, వీటిలో 6,779 అర్జీలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. క్రమబద్ధీకరణ అర్హమైనవిగా తేల్చినవారందరికీ నోటీసులు జారీచేసిన జిల్లా యంత్రాంగం.. నిర్దేశిత కనీస ధర చెల్లించమని సూచించింది. ఈ మేరకు రూ.100.53 కోట్ల మొత్తం డీడీల రూపేణా సర్కారు ఖజానాకు చేరింది. అయితే, కన్వియెన్స్ డీడ్ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. డీడ్‌కు సంబంధించి నమూనా, డిజిటల్ సిగ్నేచర్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని తహసీల్దార్లకు బదలాయించినప్పటికీ, వీటిలో కొన్ని లోటుపాట్లను గుర్తించిన యంత్రాంగం.. రిజిస్ట్రేషన్ల విషయంలో తొందరపాటు తగదని సంకేతాలు పంపింది. దీంతో జిల్లాలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదేసమయంలో చె ల్లింపు కేటగిరీ కిందకు మార్చిన జీఓ 58 (ఉచిత కేటగిరీ) దరఖాస్తులపై సందిగ్ధత నెలకొంది.
బిల్టప్ ఏరియాలో కొంత మొత్తంలో చిన్న కొట్టు నిర్వహించుకున్నా లేదా మడిగ రూపంలో ఉన్నా భవనం మొత్తాన్ని కమర్షియల్ కింద పరిగణిస్తున్నారు. దీంతో 25శాతంతో క్రమబద్ధీకరణ జరిగే స్థలానికి వంద శాతం ఫీజు చెల్లించాల్సివస్తోంది. ఈ పరిణామంతో బిత్తెరపోయిన దరఖాస్తుదారులు ఆగమేఘాల మీద దుకాణాలు, మడిగలను తొలగించుకుంటున్నారు. తమ గృహాలను రె సిడెన్షియల్ బిల్డింగ్‌లుగా పరిగణనలోకి తీసుకోవాలని తాజా ఫొటోలతో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, వచ్చేవారంలో కన్వియెన్స్ డీడ్లను జారీ చేస్తామని జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ ’సాక్షి’కి తెలిపారు.
రూ.46 కోట్లు వెనక్కి..
క్రమబద్ధీకరణకు నోచుకోని దరఖాస్తుదారులకు సొమ్ము వాపస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. అయితే, నిధులను ట్రెజరీలలో జమచేసినందున.. సొమ్మును వెనక్కి తీసుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే డీడీలను వాపస్ చేసే అంశంపై జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడంలేదు. కాగా, జీఓ 59 కింద స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకొచ్చిన 11,846 మంది రూ.139.68 కోట్లను డీడీల రూపేణా ప్రభుత్వానికి జమ చేశారు. దీంట్లో కొందరు 25శాతమే చెల్లించగా, మరికొందరు 50%, ఇంకొందరు మొత్తం సొమ్ము చెల్లించారు. ఈ క్రమంలోనే దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు..
వీటిలో కేవలం 6,779 మాత్రమే రెగ్యులరైజేషన్‌కు అనువుగా ఉన్నాయని తేల్చారు. ఈ స్థలాలపై హక్కులు పొందేందుకు నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు రూ.100.53 కోట్ల ఆదాయం రాగా.. మిగతా రూ.46.36 కోట్లను తిరస్కరించిన 5,067 దరఖాస్తుదారులకు చెల్లించాల్సివుంది. ఈ మేరకు ఈ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. దీనికితోడు కొన్ని దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల తప్పిదాలు, సాంకేతిక కారణాలతో కొన్నింటిని పక్కనపెట్టారు. వీటిపై తుది నిర్ణయం తీసుకుంటే తప్ప దరఖాస్తుల తిరస్కరణపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు డీడీల వాపస్ అనుమానమేనని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.