Cooperative Election
-
పదవులు 8.. ఓట్లు 3!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్ అధ్యక్షులను ఏ–క్లాస్ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. క్రియాశీలకంగా లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్ ఇన్చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. వాటిలో టెలికం ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్‌సింగ్ బీసీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌తోపాటు మమతా సూపర్‌బజార్ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. ముగ్గురే మహిళలు.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్‌లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్ సొసైటీ నుంచి ఆర్.శైలజ, ధర్మరావుపేట్ సొసైటీ నుంచి బడావత్ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్‌లోని 22 డైరెక్టర్ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఐదు పదవులు మిగిలిపోనున్నాయి బీ–క్లాస్ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. – మోహన్, డీసీవో, ఆదిలాబాద్ -
మెజారిటీ ఏకగ్రీవాలు టీఆర్ఎస్లోకే
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల నామినేషన్లు, ఉప సంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నెల 15న ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) పరిధిలోని డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 904 పీఏసీఎస్‌ల పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాష్ట్రంలోని 156 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో.. అత్యధికంగా ఖమ్మంలో 34, నిజామాబాద్‌లో 26 సొసైటీల పరిధిలో డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవ మయ్యాయి. కామారెడ్డిలో 12, ఆదిలాబాద్‌లో 11, సూర్యాపేటలో 9, సంగారెడ్డిలో 8, మంచిర్యాల, జగిత్యాల, మెదక్ జిల్లా పరిధిలో ఐదేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కుమరంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలో రెండేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్, కరీంనగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో సొసైటీ ఏకగ్రీవం కాగా, జోగుళాంబ గద్వాల, యాదా ద్రి భువనగిరి, మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాల్లో మాత్రం అన్ని సొసైటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 5,387 డైరెక్టర్ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. లెక్కలు వేసుకుంటున్న టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్ఎస్ సహకార ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌ల పరిధిలో వీలైనంత మేర డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చూడటం ద్వారా అనుచరులకు పదవులు దక్కేలా చూడటంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ మద్దతుదారులకు ఒకటి రెండు డైరెక్టర్ స్థానాలివ్వడం ద్వారా మొత్తం సొసైటీ పరిధిలో ఏకగ్రీవమయ్యేలా పావులు కదిపారు. మెజారిటీ పీఏసీఎస్‌లో డైరెక్టర్, చైర్మన్ పదవులు దక్కేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు సాగిస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్, పీఏసీఎస్‌లపై నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన డైరెక్టర్ స్థానాలకు సంబంధించి పార్టీల వారీగా వివరాలు సేకరించి నివేదికలు సమర్పించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పూర్వపు జిల్లా పరిధిలో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. -
‘సహకార’కు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 905 ప్యాక్స్‌ల్లోని 11,765 డైరెక్టర్ పదవులకు జిల్లాల్లో సహకార ఎన్నికల అథారిటీ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లాల సహకార అధికారులతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయిన జనార్దన్ రెడ్డి, రాష్ట్ర సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య, రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌ల)కుగాను మహబూబాద్ జిల్లాలోని ఒక ప్యాక్స్‌కు ఎన్నిక నిర్వహించడం లేదు. ఆ ప్యాక్స్‌లో నిధులు లేకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు తెలిపారు. ప్రతీ ప్యాక్స్ వారి నిధులతోనే ఎన్నికలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 11,765 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇటు ప్రతి ప్యాక్స్‌కు ఎన్నికల నోటీసులు కూడా జారీ చేశారు. ఇక సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, బీసీలు రూ.750, ఓసీ (ఇతరులు) రూ.వెయ్యి నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఓటర్లను 13 డైరెక్టర్ వార్డులుగా విభజిస్తారు. ఈ 13 వార్డుల్లో రెండు డైరెక్టర్ పదవులు మహిళలు, మరో రెండు డైరెక్టర్ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి రిజర్వు చేశారు. సమాన ఓట్లు వస్తే లాటరీ.. ఒక్కోఅభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ పత్రాలకు మించి దాఖలు చేయరాదు. ఒక డైరెక్టర్ వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డైరెక్టర్ వార్డులో పోటీ చేయొచ్చు. సదరు అభ్యర్థిని బలపరిచి, ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం ఆయా వార్డుల్లోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. బలపరిచే, ప్రతిపాదించే వ్యక్తులు ఓటు వేసేందుకు అర్హులై ఉండాలి. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పోటీ చేసే వ్యక్తితో ఉండాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఒక్కో డైరెక్టర్ ఒక పోలింగ్ బూత్ ఒక్కో డైరెక్టర్ ఎన్నికకు ఒక్కో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 11,765 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 30 వేల మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. తొమ్మిదో తేదీన నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తు కేటాయింపులు చేస్తా రు. ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంట ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కిం పు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. -
చట్ట సవరణ తర్వాతే ‘సహకార’ ఎన్నికలు
బీర్కూర్: పంచాయతీరాజ్ చట్ట సవరణ తరహాలోనే సహకార చట్టాన్ని సవరించిన తర్వాతే సహకార సంఘా లకు ఎన్నికలు నిర్వహిస్తామని వ్యవ సాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో నిర్వహించిన గోదా దేవి–రంగనాథుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సహకార ఎన్నికల విషయమై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశమయ్యా మన్నారు. పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిం చడం, అఫీషియల్, నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలతోపాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ వేయడం, ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
నామినేషన్లన్నీ ఓకే
సాలూరు: సాలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి వచ్చిన నామినేషన్లన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నట్టు కోఆపరేటివ్ ఎన్నికల అధికారి పి బాంధవరావు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని బ్యాంకు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 12మంది డెరైక్టర్ల స్థానాలకు మొత్తం 40 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల అధికారులు పరిశీలించి అభ్యంతరాలను స్వీకరించారు. అయితే నామినేషన్లపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లు ఆమోదయోగ్యంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఈసందర్భంగా బాంధవరావు విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం సాయంత్రం 5గంటల వరకు మాత్రమే గడువు ఉందన్నారు. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో ఈనెల 16న ప్రత్యేకగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల తీరుతెన్నులపై సమావేశంలో అభ్యర్థులందరికీ వివరిస్తామన్నారు. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు నామినేషన్ల పరిశీలనలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికల బరిలో పోటీచేస్తున్న అభ్యర్థులు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు తదితరులు బ్యాంకు కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు బ్యాంక్ సిట్టింగ్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు సమక్షంలో ఎన్నికల అధికారి బాంధవరావు ప్రకటించారు. ఓటింగ్‌కు 10బూత్‌లు ఈనెల 22న జరగనున్న ఎన్నికకు 10 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. గతంలో 8 బూత్‌లు మాత్రమే ఉండేవని, ఓటర్ల సౌలభ్యం, లెక్కింపు సులభతరం చేసేందుకు ఈసారి 10 బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ జరుతుందని చెప్పారు.