సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల నామినేషన్లు, ఉప సంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నెల 15న ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) పరిధిలోని డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 904 పీఏసీఎస్‌ల పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాష్ట్రంలోని 156 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి.
అత్యధికంగా ఖమ్మంలో..
అత్యధికంగా ఖమ్మంలో 34, నిజామాబాద్‌లో 26 సొసైటీల పరిధిలో డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవ మయ్యాయి. కామారెడ్డిలో 12, ఆదిలాబాద్‌లో 11, సూర్యాపేటలో 9, సంగారెడ్డిలో 8, మంచిర్యాల, జగిత్యాల, మెదక్ జిల్లా పరిధిలో ఐదేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కుమరంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలో రెండేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్, కరీంనగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో సొసైటీ ఏకగ్రీవం కాగా, జోగుళాంబ గద్వాల, యాదా ద్రి భువనగిరి, మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాల్లో మాత్రం అన్ని సొసైటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 5,387 డైరెక్టర్ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది.
లెక్కలు వేసుకుంటున్న టీఆర్‌ఎస్
అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్‌ఎస్ సహకార ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌ల పరిధిలో వీలైనంత మేర డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చూడటం ద్వారా అనుచరులకు పదవులు దక్కేలా చూడటంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ మద్దతుదారులకు ఒకటి రెండు డైరెక్టర్ స్థానాలివ్వడం ద్వారా మొత్తం సొసైటీ పరిధిలో ఏకగ్రీవమయ్యేలా పావులు కదిపారు.
మెజారిటీ పీఏసీఎస్‌లో డైరెక్టర్, చైర్మన్ పదవులు దక్కేలా టీఆర్‌ఎస్ ప్రయత్నాలు సాగిస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్, పీఏసీఎస్‌లపై నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన డైరెక్టర్ స్థానాలకు సంబంధించి పార్టీల వారీగా వివరాలు సేకరించి నివేదికలు సమర్పించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు పూర్వపు జిల్లా పరిధిలో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment