Corporation School
-
అడ్మిషన్లకు పోటాపోటీ: కాలేజీల వద్ద విద్యార్థుల కిటకిట
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్లస్‌టూ పరీక్షల్లో ప్రభుత్వం ఆల్‌పాస్ ప్రకటించడంతో కాలేజీల్లో సీటు దక్కించుకునేందుకు విద్యార్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కొత్త విద్యాసంవత్సరంలో కాలేజీ అడ్మిషన్లు ఆన్లైన్లోనే జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించగా మంగళవారం నుంచి అన్ని కాలేజీల వద్ద విద్యార్థులు పోటెత్తుతున్నారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుని వెళుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రబలడంతో విద్యావ్యవస్థ కుప్పకూలింది. పాఠశాలలు, కాలేజీలు మూతపడగా ఆన్లైన్లోనే విద్యాబోధన, పరీక్షలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా, ప్లస్‌టూ పరీక్ష ఫలితాలు, మార్కుల జాబితాను రెండురోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌లో చేరేవారు ఈనెల 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులో చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగానే విద్యార్థులంతా తమ తమ విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. మార్కుల జాబితా చేతబట్టుకుని తమకు ఇష్టమైన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలకు వెళ్లి వివిధ గ్రూప్‌లలో చేరేందుకు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తిరునెల్వేలి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ప్లస్‌టూ పరీక్షల్లో అందరూ (8,16,473 మంది) పాస్ కావడంతో కాలేజీల్లో చేరేందుకు అందరికీ అవకాశం వచ్చింది. దీంతో సీటు దక్కించుకునేందుకు విద్యార్థులు తీవ్రంగా పోటీపడుతున్నారని అన్నారు. విద్యార్థులు నేరుగా రావద్దు, ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ పొందండని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ పాఠశాలలూ కిటకిట: చెన్నై కార్పొరేషన్ ఆధీనంలోని పాఠశాల్లో విద్యార్థుల చేరిక విపరీతంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత పదేళ్ల తరువాత కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో 119 ప్రాథమిక, 92 ప్రాథమికోన్నత, 38 ఉన్నత, 32 మహోన్నత పాఠశాలలున్నాయి. అన్ని పాఠశాలల్లో తరగతి గదులను స్మార్ట్ క్లాస్ రూములుగా మారుస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా తమిళం, ఆంగ్ల బోధన, క్రీడా మైదానం వసతులు కల్పిస్తున్నారు. యూకేజీ నుంచి ఎల్కేజీ వరకు 1.50 లక్షల మందికి విద్యాబోధనకు అనువైన వసతులున్నాయి. అయితే కార్పొరేట్ స్కూళ్లపై మోజుతో ప్రజలు కార్పొరేషన్ స్కూళ్ల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల గత ఏడాదిన్నర కాలంగా స్థితిగతులు పడిపోవడంతో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. కార్పొరేట్ స్కూళ్ల వైపు కన్నెత్తి చూసే స్థోమతలేక కార్పొరేషన్ స్కూళ్లవైపు దృష్టి సారిస్తున్నారని చెన్నై కార్పొరేషన్ విద్యాధికారి భారతిదాసన్ మీడియాకు చెప్పారు. 2021–22 విద్యాసంవత్సరంలో 27,311 మంది కొత్త విద్యార్థులు చేరారు. వీరిలో 19,038 మంది ప్రయివేటు స్కూళ్ల నుంచి వచ్చారు. దీంతో తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య లక్షా 1,757కు చేరింది. 2011లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. పదేళ్ల తరువాత మరలా లక్షకు పైగా విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెంచేలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
మార్పునకు ఇదే తరుణం
► కార్పొరేషన్ స్కూల్లో ఐఏఎస్ అధికారిణి కుమార్తె ► సమాజంలో మార్పుపై ఆకాంక్ష ► అధికారులకు ఆదర్శం ► కార్పొరేషన్ స్కూల్ ఐఏఎస్ కూతురు ► ఆదర్శంగా నిలిచిన అధికారిణి నేను సమాజంలో మార్పును ఆశిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులున్నారు. కార్పొరేషన్ స్కూల్లో చదివి నా కూతురు కచ్చితంగా ఉన్నత విద్యావంతురాలు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. కార్పొరేషన్ స్కూళ్ల స్థాయి పెరగాలనేదే నా ఆశయం . ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాల్లో చేర్చుతున్నారు. రోజు కూలిపై జీవించే వారు సైతం తమ బిడ్డలకు మంచి చదువు రావాలని ప్రయివేటు బాటపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఎందరో మేధావులు ఆవేదన చెంది.. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్చితే మార్పు వస్తుందంటున్నారు. ప్రభుత్వం విద్యకోసం వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు సద్వినియోగమవుతాయని చెబుతున్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించకూడదు’ అని ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ప్రశ్నించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు చెన్నైలోని ఐఏఎస్ అధికారిణి ఆర్.లతిత. తన కుమార్తెను కార్పొరేషన్ పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లిదండ్రులు తమ కడుపు మాడ్చుకునైనా పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్న ఈ రోజుల్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి తన కుమార్తెకు కార్పొరేషన్ స్కూల్లో ఓనమాలు దిద్దిస్తున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో రెవెన్యూ, ఆర్థికశాఖ సహాయ కమిషనర్ ఆర్.లలిత తన రెండున్నరేళ్ల కుమార్తె తరుణికను సోమవారం చెన్నై కోడంబాక్కం పులియూర్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించడం ద్వారా ఆదర్శనీయురాలిగా నిలిచారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించకూడదు’ అని ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కృపాకరన్ ప్రశ్నించారు. న్యాయమూర్తి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ‘నిజమేకదా’ అని అనుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు సహజంగా తమ పిల్లలను ప్రయివేటు, కార్పొరేషన్ విద్యాసంస్థల్లో చేర్పిస్తారు. పెద్ద స్కూళ్లలో చదివి తమ పిల్లలు ఐఏఎస్, ఇంజినీరు, డాక్టరుగా చేయాలని ఆశిస్తారు. అయితే ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండి కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాలని ఎందుకు అనిపించిందో ఆమె మాటల్లోనే.. ‘‘సమాజంలో ఏదైనా మార్పును ఆశిస్తున్నారా.. అయితే ఆ మార్పును మీతోనే ప్రారంభించండి.. అనే సూక్తి ఉంది. నేను కూడా సమాజంలో ఒక మార్పును ఆశిస్తున్నాను. ఆ మార్పుకోసం నా కూతురిని కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాను. చెన్నై కార్పొరేషన్ స్కూళ్లు ప్రస్తుతం మంచి దశలో ఉన్నాయి. చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేషన్ స్కూళ్లు పనిచేస్తున్నాయి. కార్పొరేషన్ స్కూల్లో చేరిన నా కూతురు కచ్చితంగా ఉన్నత విద్యావంతురాలు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటే వారి పిల్లలను కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోరుతున్నాను. కార్పొరేషన్ స్కూళ్ల స్థాయి పెరగాలనేదే నా ఆశయం. చెన్నై కార్పొరేషన్ విద్యాశాఖ సహాయ కమిషనర్‌గా 2013–14లో పనిచేసే సమయంలో నా కడుపులో బిడ్డ పెరుగుతున్నపుడే కార్పొరేషన్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. నా భర్త సుమంత్, తల్లిదండ్రులు రాజేంద్రన్, తమిళరసి సైతం నా నిర్ణయాన్ని సమర్థించారు. అన్ని రకాలా ప్రోత్సహించారు.’’ అన్నారు ఆ అధికారిణి. ఇదిలా ఉండగా తన కుమార్తెను కార్పొరేషన్ స్కూల్లో చేర్పించిన లలిత, మాజీ మేయర్ సైదై దొరైస్వామి నడుపుతున్న మనిదనేయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐఏఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలు కావడం కొసమెరుపు.