
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్లస్‌టూ పరీక్షల్లో ప్రభుత్వం ఆల్‌పాస్ ప్రకటించడంతో కాలేజీల్లో సీటు దక్కించుకునేందుకు విద్యార్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది. కొత్త విద్యాసంవత్సరంలో కాలేజీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించగా మంగళవారం నుంచి అన్ని కాలేజీల వద్ద విద్యార్థులు పోటెత్తుతున్నారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుని వెళుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రబలడంతో విద్యావ్యవస్థ కుప్పకూలింది. పాఠశాలలు, కాలేజీలు మూతపడగా ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన, పరీక్షలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా, ప్లస్‌టూ పరీక్ష ఫలితాలు, మార్కుల జాబితాను రెండురోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసింది.
కొత్త విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌లో చేరేవారు ఈనెల 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులో చేసుకోవాలని ప్రభుత్వం చెప్పగానే విద్యార్థులంతా తమ తమ విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. మార్కుల జాబితా చేతబట్టుకుని తమకు ఇష్టమైన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలకు వెళ్లి వివిధ గ్రూప్‌లలో చేరేందుకు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తిరునెల్వేలి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ప్లస్‌టూ పరీక్షల్లో అందరూ (8,16,473 మంది) పాస్ కావడంతో కాలేజీల్లో చేరేందుకు అందరికీ అవకాశం వచ్చింది. దీంతో సీటు దక్కించుకునేందుకు విద్యార్థులు తీవ్రంగా పోటీపడుతున్నారని అన్నారు. విద్యార్థులు నేరుగా రావద్దు, ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ పొందండని విజ్ఞప్తి చేశారు.
కార్పొరేషన్ పాఠశాలలూ కిటకిట:
చెన్నై కార్పొరేషన్ ఆధీనంలోని పాఠశాల్లో విద్యార్థుల చేరిక విపరీతంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత పదేళ్ల తరువాత కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో 119 ప్రాథమిక, 92 ప్రాథమికోన్నత, 38 ఉన్నత, 32 మహోన్నత పాఠశాలలున్నాయి. అన్ని పాఠశాలల్లో తరగతి గదులను స్మార్ట్ క్లాస్ రూములుగా మారుస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా తమిళం, ఆంగ్ల బోధన, క్రీడా మైదానం వసతులు కల్పిస్తున్నారు. యూకేజీ నుంచి ఎల్‌కేజీ వరకు 1.50 లక్షల మందికి విద్యాబోధనకు అనువైన వసతులున్నాయి.
అయితే కార్పొరేట్ స్కూళ్లపై మోజుతో ప్రజలు కార్పొరేషన్ స్కూళ్ల పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల గత ఏడాదిన్నర కాలంగా స్థితిగతులు పడిపోవడంతో ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. కార్పొరేట్ స్కూళ్ల వైపు కన్నెత్తి చూసే స్థోమతలేక కార్పొరేషన్ స్కూళ్లవైపు దృష్టి సారిస్తున్నారని చెన్నై కార్పొరేషన్ విద్యాధికారి భారతిదాసన్ మీడియాకు చెప్పారు. 2021–22 విద్యాసంవత్సరంలో 27,311 మంది కొత్త విద్యార్థులు చేరారు. వీరిలో 19,038 మంది ప్రయివేటు స్కూళ్ల నుంచి వచ్చారు. దీంతో తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య లక్షా 1,757కు చేరింది. 2011లో విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. పదేళ్ల తరువాత మరలా లక్షకు పైగా విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెంచేలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment