
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదవాడు సైతం ప్రైవేట్ స్కూళ్లవైపు చూడడం ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. ఏడాదికి ఏడాది అడ్మిషన్లు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. కనీసం పదిమంది కూడా లేని 890 పాఠశాలలను శాశ్వతంగా మూసివేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, సర్వోన్నత పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 1– 5 తరగతుల వరకు విద్యనభ్యసించే అవకాశం ఉంది. ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా యూనిఫారంలు, పాఠ్యపుస్తకాలు, పాదరక్షలు వంటి పథకాలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇన్ని ఆకర్షణులున్నా అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ‘తమిళనాడు అందరికీ విద్య సంస్థ’, ‘ప్రాథమిక విద్య సంస్థ’గత ఏడాది నిర్వహించిన సర్వేలో స్పష్టం చేశాయి. ఈ సర్వేల్లోని వివరాలతో విస్తుపోయిన ప్రభుత్వం మరిన్ని వివరాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యనభ్యసిస్తున్నారు, ఎంత మంది ఉపాధ్యాయులున్నారు, పౌష్టికాహార ఆయాలు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను విద్యాశాఖ సేకరించింది. 890 ప్రభుత్వ పాఠశాలల్లో 10 మందికి తక్కువగా విద్యార్థులు ఉండడాన్ని గుర్తించారు. 29 పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలు, 4 మున్సిపల్ పాఠశాలలు లెక్కన మొత్తం 33 పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థిలేక పోవడం, అక్కడి ఆయాలు మాత్రమే రోజూ వచ్చి వెళుతున్నారనే వివరాలు చూసి ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. కొన్ని పాఠశాలల్లో కేవలం ఒక విద్యార్థి ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ అనసరపు ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులను మరో పాఠశాలలో చేర్పించాలని తీర్మానించింది. విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న పాఠశాలల్లో చక్కని వసతులను కల్పించి రాబోయే విద్యాసంవత్సరానికైనా విద్యార్థులను ఆకర్షించాలని భావిస్తోంది. త్వరలో జీఓ జారీ అయ్యే అవకాశం ఉంది.
ప్రైవేట్ పాఠశాలలకు 3 లక్షల మంది..: గత ఏడేళ్ల కాలంలో ప్రభుత్వ, ఎయిడెట్‌కు సంబంధించి 33 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు లోపించడం వల్లనే 33 ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం, ప్రైవేట్ మెట్రిక్యులేషన్ పాఠశాలలకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు పాఠ్యాంశాలను ఒకే ఉపాధ్యాయుడు బోధించడం, ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడమే విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఆందోళన తప్పదు: ఎమ్మెల్యే టీటీవీ దినకరన్
విద్యార్థుల సంఖ్య తగ్గిందనే సాకుతో పాఠశాలలు మూసివేస్తే ఆందోళన తప్పదని అమ్మ మక్కల్ మన్రం అధ్యక్షుడు, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు వ్యాపారధోరణితో ఏర్పడినవి కావన్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కొత్తగా పలు ప్రైవేట్ విద్యాసంస్థలను నెలకొల్పుతుండగా ప్రభుత్వం ఉన్నవాటినే మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచే మార్గాలను పరిశీలించకుండా మూసివేస్తే అతిపెద్ద పోరాటాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని సీఎం ఎడపాడిని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment