జలయోగం
164 గ్రామాలకు తీరనున్న దాహార్తి నీటి సరఫరాకు జలమండలి సిద్ధం వ్యయ భారం పంచాయతీలదే తొలివిడతగా ముందుకొచ్చి బోడుప్పల్, పుప్పాల్‌గూడ, మణికొండ
సిటీబ్యూరో: శివారు గ్రామాలకు త్వరలో తాగునీటి సమస్య నుంచి విముక్తి లభించనుంది. జీహెచ్ఎంసీ సరిహద్దుకు ఆనుకొని... ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు మంచినీటి సరఫరాకు జలమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఔటర్‌కు లోపల ఉన్న పంచాయతీల పరిధిలో సుమారు 164 గ్రామాలు ఉన్నట్లు బోర్డు అంచనా వేస్తోంది. ఈ పంచాయతీలు నేరుగా జలమండలిని సంప్రదిస్తే... వ్యయ అంచనాలను ఇంజినీర్లు సిద్ధం చేస్తారని తెలిపింది. ఈ మొత్తాన్ని పూర్తిగా పంచాయతీలే భరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తొలివిడతగా పుప్పాల్‌గూడ, మణికొండ, బోడుప్పల్ పంచాయతీలు తమను సంప్రదించాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నీటి వినియోగానికి రోజుకు 100 లీటర్ల (ఎల్పీసీడీ) వంతున సరఫరా చేయాలని నిర్దేశిస్తూ గతంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు.
ఈ పంచాయతీలకు జలకళ
జలమండలి అంచనా ప్రకారం జీహెచ్ఎంసీకి ఆవల.. ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపల ఉన్న గ్రామాల్లో కొన్ని... పోశెట్టిగూడ, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, లక్ష్మీతాండా, సాతంరాయి, శంషాబాద్, సిద్దాంతి, బసురేగడి, గ్యానాపూర్, గుండ్లపోచంపల్లి, లక్ష్మీనగర్, మైసమ్మగూడ, బోడుప్పల్, చెంగిచెర్ల, చౌదరిగూడ, మక్తా.మహేశ్వరం మండలంలోని 4 పంచాయతీలు, సరూర్ నగర్లో 6, హయత్‌నగర్‌లో 11, రాజేంద్ర నగర్లో 16, మేడ్చల్‌లో 2, ఘట్కేసర్లో 15, కీసర మండలంలో 9, శామీర్‌పేట్ పరిధిలో 9, కుత్బుల్లాపూర్‌లో 9, ఇబ్రహీంపట్నంలో వివిధ పంచాయతీలు ఉన్నట్లు జలమండలి అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కృష్ణా, గోదావరి పథకాలతో...
ప్రస్తుతం జలమండలి పరిధిలో 8.64 లక్షల నల్లాలకు రోజువారీగా 365 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం మొదటి దశల ద్వారా అదనంగా మరో 262 మిలియన్ గ్యాలన్లు నగరానికి తరలిరానున్నాయి. పంచాయతీలు ముందుకొస్తే ఈ నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి.
నిధులే కీలకం...
ఔటర్‌కు లోపల ఉన్న గ్రామాల పరిధిలో ఇంటింటికీ నీటి పంపిణీకి అవసరమైన పైప్‌లైన్ నెట్వర్క్, ఓవర్‌హెడ్‌ట్యాంక్, మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలంటే రూ.వందల కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని పంచాయతీలు భరిస్తాయా? లేదా ప్రభుత్వం గ్రాంటుగా మంజూరు చేస్తుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో కొన్ని పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి నిధుల వ్యయానికి సిద్ధంగా ఉన్నాయి.మరికొన్ని నిధుల లేమితో కునారిల్లుతుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రామ ఈ పంచాయతీల దాహార్తి తీరే అంశం ఆధారపడి ఉంది.