‘రైతు ఆత్మహత్య’ల పరిహారం పొందడమిలా..
మంచిర్యాల రూరల్ : ఆరుగాలం కష్టించినా పెరుగుతున్న సాగు ఖర్చులు.. చేసిన అప్పులు.. తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సమస్యకు చావు పరిష్కారం కాదు. అనాలోచితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఇంటి పెద్ద చనిపోతే ఆయనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు వీధిన పడతారు.
వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నా.. అవగాహనలేమితో చాలామంది ప్రభుత్వ పరిహారం పొందలేక పోతున్నారు. ప్రతీ ఏడాది వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే విధానం, నియమ నిబంధనలు తెలుసుకుందాం.
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు..
ఎఫ్ఐఆర్ కాపీ
పంచనామా రిపోర్టు
పోస్టుమార్టం రిపోర్టు
ఫోరెన్సిక్ సైన్స్‌ల్యాబ్ రిపోర్టు
పైవేట్ రుణాలుంటే.. పత్రాలు
బ్యాంకు రుణాల డాక్యుమెంట్లు
రైతు పేరున నమోదైన పట్టాదారు పాసుపుస్తకం
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల వివరాలు
అధికారిక సర్టిఫికెట్లు
రేషన్‌కార్డు
మూడేళ్లుగా సాగు వివరాల పహనీ
మండలస్థాయి పరిశీలన కమిటీ నివేదిక (ఆర్డీవో, డీఎస్పీ, ఏడీఏ కమిటీ నివేదిక)
రైతు మరణించాక ఏం చేయాలంటే..
రైతు ఆత్మహత్య చేసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు లేదా గ్రామస్తులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే రశీదు తీసుకోవాలి.
రైతు ఆత్మహత్య చేసుకున్న కారణాలు (పంట నష్టం, బోర్లు ఫెయిల్ కావడం, అప్పుల భారం పెరగడం) నమోదు చేయించాలి.
స్థానిక రెవెన్యూ అధికారులకు (వీఆర్వో, ఆర్ఐ) సమాచారం అందజేయాలి.
ఘటన జరిగిన వెంటనే తహశీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి కుటుంబాన్ని పరమార్శించాలి. అప్పుల వాళ్లను పిలిచి మాట్లాడాలి. అలా జరగకపోతే బాధిత కుటుంబ సభ్యులు నేరుగా తహశీల్దార్‌ను కలిసి దరఖాస్తు ఇచ్చి, జీవో 421లో పేర్కొన్న సౌకర్యాలు కల్పించాలని కోరాలి.
మండల స్థాయి నిజనిర్ధారణ కమిటీ విచారణకు వచ్చినప్పుడు కూడా కటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, కులపెద్దలు, గ్రామపెద్దలు రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాలి.
మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టకపోతే, డివిజన్ స్థాయిలోని ఆర్డీవోను కలిసి పరిస్థితిని వివరించాలి. అక్కడ స్పందన లేకపోతే కలెక్టర్‌ను నేరుగా కలిసి పరిస్థితి వివరించాలి.