ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రశాంతంగా ముగిసింది. అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా కౌంటింగ్ పూర్తయింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఏ పార్టీకి విజయం వరిస్తుందో తెలియక అందరిలోను ఉత్కంఠ రేపింది. సాయంత్రం ఆరు గంటల వరకూ చోడవరం, పాయకరావుపేట ఫలితాలు తేలలేదు.
జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనకాపల్లి లోక్‌సభకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ సాయంత్రం 7 గంటల వరకు సాగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకవైపు చేపడుతుండగానే ఉదయం 8.30కు ఈవీఎంలను స్ట్రాంగ్‌ల రూమ్‌లను తీసుకువచ్చారు.
ఉదయం 9 నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు వేరువేరుగా 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. భీమిలి నియోజకవర్గానికి అధికంగా 22 రౌండ్లు లెక్కింపు జరగగా, మాడుగులకు తక్కువగా 14 రౌండ్లుగా చేపట్టారు. ముందుగా ఈ నియోజకవర్గం ఫలితమే వెల్లడైంది. అనకాపల్లి లోక్‌సభ ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా సాయంత్రం 7.30కు వచ్చింది.
గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి సందడి చేశారు. రిటర్నింగ్ అధికారులు వారికి డిక్లరేషన్లు ఇచ్చారు. అన్ని కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చు కున్నారు.