CPS process
-
సీపీఎస్ రద్దు చేయాలి
సాక్షి, జడ్చర్ల: మండలంలోని గొల్లపల్లి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ విద్రోహదినంగా వారు పాటిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకృష్ణ, చంద్రమోహన్, ఘమలమ్మ, సంధ్య, అరుణ, కమల్‌రాజ, శ్రీనివాసులు పాల్గొన్నారు. బాలానగర్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని సర్వీస్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యోగుల ఐక్యవేదిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు మాన్యం, శివారెడ్డి, బాలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు తహసీల్దార్ రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ, బదిలీ, పదోన్నతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. 2004 సెప్టంబర్ 1 నుంచి ఉద్యోగంలో చేరినవారికి పాత పెన్షన్ విధానం వర్తించకుండా ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడం నిరంకుశత్వమే అన్నారు. మిడ్జిల్: సీపీఎస్ విధానంను వ్యతిరేకిస్తూ అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంగళవారం మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నర్సింహులు, వెంకటయ్య, రాజేంద్రప్రసాద్, రమేష్‌గౌడ్, లక్ష్మయ్య, గురుప్రసాద్, వసంత్‌నాయక్ తదితరులు ఉన్నారు. -
అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్
శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులతోపాటు నిరుద్యోగుల్లో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా ఆదోని ఎన్నికల సభలో చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 12 వేల మంది ఉపాధ్యాయులు, 30 వేల మంది ఉద్యోగులున్నారు. వీరు పీఆర్సీ కోసం పోరాటం చేయగా సుమారు ఏడాది జాప్యం చేసి ఇటీవలనే 22 శాతం ఐఆర్‌ను చంద్రబాబు ప్రకటించారు. దీనిని తక్షణం అమలు చేయకపోగా మే నెల నుంచి అమలు చేస్తామని చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు, పెన్షనర్లు చంద్రబాబు మోసపూరిత ప్రకటనను గ్రహించారు. మూడు విడతల డీఏ బకాయి ఉండగా ఒక డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా అది సైతం ఎన్నికల తర్వాతనే అమలయ్యేటట్లు ఉత్తర్వులు విడుదల కావడంతో ఆయా వర్గాలు ఖంగుతిన్నాయి. దీనిపై ప్రతిపక్షనేత సోమవారం ఆదోనిలోని ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్‌ను ఇస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. సకాలంలో పీఆర్సీ కమిషన్‌ను నియమించి అమలు చేస్తామని చెప్పడం కూడా ఆ వర్గంలో ఆనందాన్నిచ్చింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో సంతోషాన్ని నింపింది. ఎప్పటి నుంచో సీపీఎస రద్దు కోసం పోరాటం చేస్తుండగా దానిని అమలు చేయకపోగా ఆందోళనను అణగదోక్కే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రకటన వల్ల జిల్లాలో 8,900 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇస్తామని చెప్పడం పోలీసు ఉద్యోగ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నా ఆయా వర్గాలు దీనిని బహిర్గతం చేయలేకపోతున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీలిచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయకపోగా ఎందరో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటిదారి పట్టించారు. దీనిపై కూడా జగన్మోహన్రెడ్డి ప్రకటన చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రకటించడంతో దీనిని ఆయా ఉద్యోగ వర్గాలు విశ్వసిస్తున్నాయి. దీని వల్ల జిల్లాలో సుమారు 20వేల మంది లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల వేలాదిమంది నిరుద్యోగ యువకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంది. పెన్షనర్లకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించడం వల్ల జిల్లాలో ఉన్న 20 వేల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక ఐఆర్‌గా నమోదు ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ప్రకటించి న 27శాతం ఐఆర్ ఇప్పటి వరకు ప్రకటించిన ఐఆర్‌లలో అత్యధికమవుతుంది. ఈ ప్రకటన అభినందనీయం. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు లబ్ధి పొందుతారు. –పాలక పురుషొత్తం, గిరిజన ఉపాధ్యాయ విభాగం నాయకుడు, శ్రీకాకుళం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన మంచిదే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం పెంచుతున్నట్లు వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల ఉద్యోగులకు కొంత మేలు జరుగుతుంది. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థిక వెసులబాటు ఉంటుంది. ఉద్యోగులందరూ వైఎస్ జగన్ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఎస్.ప్రభాకరరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నరసన్నపేట సుప్రీం తీర్పుకు న్యాయం జరుగుతుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నేడు జగన్ చేసిన ప్రకటనతో న్యాయం జరుగుతుంది. ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనలో ఎనలేని కషిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని జగన్ చేసిన ప్రకటన హర్షణీయం. – టి.బాలమురళీకృష్ణ, కాంట్రాక్ట్ అధ్యాపకుడు, వీరఘట్టం చాలా మంచి పరిణామం.. ఉద్యోగులుకు 27 శాతం ఐఆర్‌ను జగన్మోహన్రెడ్డి ప్రకటించడం ఆనందదాయకం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. 2019 జనవరి 1 నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. ఉద్యోగులు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. – గడే అప్పలనాయుడు, సీపీఎస్ ఉద్యోగి, రాజాం ఎంతో ఆనందం కలిగించింది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పోలీసులకు, కాంట్రాక్ట్ సిబ్బందికి మేలు కలిగేలా జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన ఎంతో ఆనందం కలిగించింది. ఐఆర్ 27 శాతం ఇస్తామనే ప్రకటనతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగస్తులకు లబ్ధి కలుగుతుంది. సీపీఎస్ విధానం రద్దు చేయాలని చేసిన పోరాటాలకు గత ప్రభుత్వం కనీసం స్పందించలేదు. –బి.బాలకృష్ణ, ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి జగన్ హామీని స్వాగతిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చేందుకు తాను అధికారంలోకి రాగా చర్యలు చేపడతామన్న జగన్మోహన్రెడ్డి హామీ ఉద్యోగ సంఘాల తరఫున స్వాగతిస్తున్నాం. సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయడం ఆనందంగా ఉంది. – ఎం.చినబాబు, ఉపాధ్యాయుడు, పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు -
సకల ఉద్యోగుల మహాసభను జయప్రదం చేయాలి
సంగారెడ్డి రూరల్: హైదరాబాద్‌లో ఈ నెల 25న నిర్వహించే సకల ఉద్యోగుల మహాసభను జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వై. శివప్రసాద్ పిలుపునిచ్చారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో గురువారం సాయంత్రం అసోసియేషన్ సభ్యులతో కలిసి మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ అంశంతో ఉద్యోగులు భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నారన్నారు. జిల్లాల విభజనలో భాగంగా ఉద్యోగులు తమ అనుమతి లేకుండా జరిగిన బదిలీలతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించి అవసరమైన చోట ఖాళీలు భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. 11వ పే రివిజన్ కమిషన్‌ను వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొమ్మరాములు, వీరేశం, బాల్‌రాజ్, వరప్రసాద్, శ్రీనివాస్, గుండేరావు, సయ్యద్‌ఉమర్‌పాష, కిరణ్‌కుమార్, అలీమ్, విశ్వేశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు చట్ట సవరణ చేయాలి
అనంతపురం టౌన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోసం చట్ట సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై సీపీఎం రద్దు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పండిట్స్, పీఈటీలను మునిసిపల్ పాఠశాలలకు ఇవ్వాలనీ, పదో పీఆర్సీ అరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ సంతకాల సేకరణ
ఎస్టీఎఫ్–ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్–ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు చెప్పారు. గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే గ్రాట్యుటీ, పెన్షన్‌తో జీవితాలను వెళ్లదీస్తున్న పరిస్థితుల్లో సీపీఎస్ విధానంతో వారి జీవితాలకు భద్రత కరువైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోటి మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంతకాలు సేకరించి వాటిని దేశ ప్రధానికి అందజేసేందుకు నవంబర్ 29న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నట్లు చెప్పారు. సీపీఎస్‌ను రద్దుపరచాలని సీఎం చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తాము తీసుకెళ్లామని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు తన శాఖపై సరైన అవగాహన లేని కారణంగా మున్సిపల్ పాఠశాలలపై ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ టీచర్లకు సర్వీసు రూల్స్ వర్తింపజేసి, పదోన్నతులు, రేషనలైజేషన్ చేపట్టాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పాల్గొన్నారు.