సీపీఎస్ రద్దు కోరుతూ సంతకాల సేకరణ
Published Tue, Aug 2 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఎస్‌టీఎఫ్–ఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్–ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు చెప్పారు. గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే గ్రాట్యుటీ, పెన్షన్‌తో జీవితాలను వెళ్లదీస్తున్న పరిస్థితుల్లో సీపీఎస్ విధానంతో వారి జీవితాలకు భద్రత కరువైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కోటి మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంతకాలు సేకరించి వాటిని దేశ ప్రధానికి అందజేసేందుకు నవంబర్ 29న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నట్లు చెప్పారు. సీపీఎస్‌ను రద్దుపరచాలని సీఎం చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తాము తీసుకెళ్లామని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు తన శాఖపై సరైన అవగాహన లేని కారణంగా మున్సిపల్ పాఠశాలలపై ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ టీచర్లకు సర్వీసు రూల్స్ వర్తింపజేసి, పదోన్నతులు, రేషనలైజేషన్ చేపట్టాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement