రైతు రుణాల మాఫీపై అరుంధతి అభ్యంతరాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణ మాఫీ పథకాలపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుంధతి భట్టాచార్య కొన్నిఅభ్యంతరాలను వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలను ఎత్తివేస్తే..క్రెడిట్ క్రమశిక్షణ కు భంగం కలిగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు రుణాలకు మాఫీ కల్పించడం వల్ల బ్యాంకులకు ఖాతా సమస్య తలెత్తుతుందన్నారు. అలాగే ప్రభుత్వాలు రైతులకు కల్పించే రుణ మాఫీ వల్ల బ్యాంకుల ఆదాయం తగ్గిపోతుందని కూడా ఆమె చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో అరుంధతీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రుణం తీసుకున్న రైతులు ఆ బాకీలు చెల్లించకుండా క్రెడిట్ డిసిప్లైన్‌ను దెబ్బతీస్తున్నారని అరుధంతి ఆరోపించారు. రైతులు మద్దుతు ఇవ్వడం ముఖ్యమే అయినా ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాలన్నారు. ముఖ్యంగా రైతులకు రుణ మాఫీ కల్పించడం వల్ల బ్యాంకు క్రెడిట్ ప్రక్రియ దెబ్బతింటున్నదన్న ఆమె రుణ మాఫీ పొందిన రైతులు భవిష్యత్తులోనూ అలాంటి మాఫీ కోసం ఎదురుచూస్తుంటారన్నారు. తద్వారా కొత్తగా ఇచ్చిన రుణాలకు బకాయిలు చెల్లించేందుకు రైతులు వెనుకాడుతారని చెప్పారు. రైతు రుణాల మాఫీపై ఉత్తరప్రదేశ్ నుంచి తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం మంచి ప్రక్రియే, కానీ ఆ పద్ధతి వల్ల క్రెడిట్ ప్రక్రియ దెబ్బతినకూడదని వ్యాఖ్యానించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీం ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రుణాల రికవరీకి అవకాశం ఇస్తామనీ, అయితే ట్రాక్టర్ సెగ్మెంట్లో ఈ రికవరీ చాలా బావుందని ఆమె చెప్పారు.
కాగా ఇటీవల రైతుల, ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ యాంత్రీకరణ రుణాలపై రూ. 6 వేల కోట్ల మేరకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.