గుర్తుకొస్తాయని...
గ్రేట్ లవ్ స్టోరీస్
‘కోకిల... తనకు ఇష్టమైన వసంతాన్ని మరిచిపోయింది.
తనకు మరీ ఇష్టమైన గానాన్ని మరిచిపోయింది.
ఇప్పుడు వసంతకోకిల దుఃఖనదిగా మారింది!’
‘‘నీ ముఖం నాకు చూపించకు... వెళ్లు... తక్షణం ఇక్కడి నుంచి వెళ్లు’’ అరిచింది క్రిక్. ఆమె కళ్లు ఎర్రగా ఉన్నాయి. కోపంతో జ్వలిస్తున్నాయి. ‘‘అలా అనకు క్రిక్... నేను తట్టుకోలేను.
నేను నీ భర్తను...’’ చెప్పు కుంటూ పోతున్నాడు కిమ్ కార్పెంటర్. ‘‘నువ్వెవరో నాకు తెలియదు. వెళ్లు ఇక్కడి నుంచి’’ ఈసడించుకుంది క్రిక్. కిమ్ విలవిల్లాడిపోయాడు. భారంగా గుండెను చేత్తో పట్టుకున్నాడు. అతడి మదిలో అలలు అలలుగా జ్ఞాపకాలు......
ఇరవై నాలుగు సంవత్సరాల క్రిక్ (కాలిఫోర్నియా, యు.ఎస్.) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక స్పోర్ట్స్ గూడ్స్ కంపెనీలో రిప్రజెంటేటివ్‌గా చేరింది. ఒకరోజు కంపెనీ పనిలో భాగంగా న్యూ మెక్సికోలోని హ్యాలాండ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల కిమ్ కార్పెంటర్ పరిచయం అయ్యాడు. అతను అక్కడ బాస్కెట్‌బాల్ కోచ్. క్రిక్ తరపున చాలా స్పోర్ట్స్ జాకెట్లు అమ్మి పెట్టాడు కిమ్. అలా వారి మధ్య స్నేహం మొలకెత్తింది.
ఫోన్లో గంటల తరబడి మాటలు. వందల్లో విరిసిన ప్రేమలేఖలు! ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేని పరిస్థితి. ఒక వారాంతంలో క్రిక్ను వెదుక్కుంటూ కాలిఫోర్నియా వచ్చేవాడు కిమ్. ఇంకో వారాంతంలో కిమ్‌ను వెదుక్కుంటూ న్యూ మెక్సికో వెళ్లేది క్రిక్. కొంత కాలానికి వారి ప్రేమ పెళ్లిగా మారింది. క్రిక్, కిమ్‌లు భార్యాభర్తలయ్యారు.
రెండు నెలల తరువాత... క్రిక్ తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి కిమ్‌తో కలిసి కారులో బయలుదేరింది. డ్రైవింగ్ సీట్లో కిమ్ కూర్చుని ఉన్నాడు. అంతలో పెను ప్రమాదం...! వెనక నుంచి ఒక లారీ వచ్చి ఢీ కొట్టింది. కారు ఎగిరిపడింది. కిమ్ పక్కటెముకలు విరిగాయి. క్రిక్ అయితే కోమాలోకి వెళ్లి పోయింది.
నాలుగు మాసాలు ఈ లోకంలో లేదు క్రిక్. తర్వాత ఓ రోజు కళ్లు తెరిచింది. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తోన్న కిమ్ ఆనందంగా ఆమె దగ్గరకు వెళ్లాడు. కానీ అతణ్ని చూసిన కిమ్‌లో ఏ స్పందనా లేదు. కనీసం అతణ్ని గుర్తించినట్టు ఆమె కళ్లు కూడా మెరవలేదు. అల్లాడిపోయాడు కిమ్. క్రిక్‌కి ఏమైందంటూ డాక్టర్లను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. చివరకు వాళ్లు చెప్పిన విషయం విని విలవిల్లాడాడు.
తలకు బలమైన గాయాలు కావడం వల్ల జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయింది క్రిక్. పండ్లు తోముకోవడం నుంచి నడ వడం వరకు ఏది ఎలా చేయాలో కూడా మరిచిపోయింది! ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురావడానికి నాటి నుంచీ ప్రయత్ని స్తూనే ఉన్నాడు కిమ్. ఇంటెన్సివ్ థెరపీ చేయిస్తున్నాడు. తమ ఇద్దరికీ సంబంధిం చిన విషయాలను చెప్తున్నాడు. తాము కలిసి తిరిగిన ప్రదేశాలకు తీసుకెళ్తున్నాడు. కానీ ఫలితం లేదు. అతడిని గూర్చిన ఏ జ్ఞాపకమూ క్రిక్ మనసులో మెదలట్లేదు. పాతికేళ్లుగా ఆమె కళ్లలో అదే శూన్యం.
‘‘మేము మొదటిసారి కలుసుకున్న సందర్భం, మాట్లాడుకున్న మాటలు, మా తియ్యటి జ్ఞాపకాలను తనకి గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఎన్ని గుర్తు చేసినా సరే... తను నన్ను అపరిచితుడి లానే చూస్తోంది’’ అంటాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. ‘‘ఇప్పుడు నేను తన భర్తను కాదు తండ్రిని’’ అంటున్నప్పుడు కిమ్ ఉద్వేగాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రేమకు బలం... నమ్మకం! ఆ నమ్మకంతోనే కిమ్ ముందుకు సాగుతు న్నాడు. తన ప్రియసఖి ఒక్కసారి తనను గుర్తిస్తే చాలని తపిస్తున్నాడు.
క్రిక్, కిమ్ కార్పెంటర్ల ప్రేమకథ ఆధారంగా హాలీవుడ్లో ‘ది వావ్’ సినిమా రూపుదిద్దుకుంది. మైఖేల్ సక్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘హయ్యెస్ట్ గ్రాసింగ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ఆఫ్ ఆల్‌టైమ్’ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. అలాగే వీరి ప్రేమ ఆధారంగా తెరకెక్కిన ‘ఫిఫ్టీ ఫస్ట్ డేట్స్’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది.