Cricket Lovers
-
చార్మినార్.. హుస్సేన్ సాగర్.. ఉప్పల్
సాక్షి, హైదరాబాద్: పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై నిర్వహిస్తున్న వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన సందడి అంతటా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రచార కార్యక్రమాల తర్వాత ఇప్పుడు మన నగరంలో వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన ఈ కప్ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో అభిమానులకు చేరువగా వచ్చింది. గురువారంతో నగరంలో ఈ ఐసీసీ ట్రోఫీ టూర్ ముగిసింది. బుధవారం అభిమానుల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ, ఇనార్బిట్ మాల్‌లలో ట్రోఫీని ఉంచారు. క్రికెట్ ప్రేమికులు సెల్ఫీలతో ఆటపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం వరల్డ్ కప్ నిర్వాహకులు నగరంలో మూడు చోట్ల ట్రోఫీని ప్రదర్శించారు. నగరానికి చిరునామా అయిన చారిత్రాత్మక చార్మినార్ వద్ద, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ ఐసీసీ ప్రతినిధులు ట్రోఫీని ఉంచి ప్రచారం నిర్వహించారు. అనంతరం వరల్డ్ కప్‌లో మూడు మ్యాచ్‌లకు వేదికై న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. అంతకు ముందు ఈ నెల 29, అక్టోబర్ 3 తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తారు. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు ఇక్కడ లేకపోయినా.. వరల్డ్ కప్ పోరు కావడంతో ఇతర టీమ్‌ల మ్యాచ్‌లపై కూడా ఆసక్తి నెలకొంది. వరల్డ్ కప్ టూర్లో భాగంగా ట్రోఫీ నగరం నుంచి చైన్నెకి వెళ్లింది. -
కోహ్లి వ్యాఖ్యలపై హర్షా భోగ్లే స్పందన
న్యూఢిల్లీ: చాలా విషయాల్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇటీవల కోహ్లి చేసిన ఒక కామెంట్ విమర్శలకు దారి తీసింది. తన బర్త్ డే సందర్భంగా విరాట్ కోహ్లి అఫీషియల్ యాప్‌ను ఆవిష్కరించాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ కోహ్లిని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అతని బ్యాటింగ్‌లో తనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించదని, అతని కంటే ఇంగ్లిష్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆటే నచ్చుతుందని కామెంట్ చేశాడు. అయితే ఈ మాటలను స్పోర్టివ్ గా తీసుకోలేదు కోహ్లి.. అలాంటప్పుడు ‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు.. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో’ అంటూ క్లాస్ పీకాడు. దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు కోహ్లి. ‘ఒక వ్యక్తికి ఆటగాళ్లు నచ్చడం అనేది వారి అభిప్రాయాల్ని బట్టే ఉంటుంది. చాలా మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు తమ మాజీ ఆటగాళ్ల కంటే సచిన్ టెండూల్కర్‌గా పేర్కొంటారు. ఏబీ డివిలియర్స్, జయసూర్య, షాహిద్ ఆఫ్రిది ఇలా ఆటగాళ్లకు దేశాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్నే ఆ అభిమాని చెప్పాలని అనుకున్నాడు’ అంటూ నెటిజన్లు కోహ్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. కాగా, ఈ ఘటనపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. ఈ విషయంలో కోహ్లి స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. చాలా మంది ప్రముఖులు పడిపోయే బుడగలోనే కోహ్లి కూడా పడ్డాడని అతడు అన్నాడు. కోహ్లిలాంటి సెలబ్రిటీలు ఇలాంటి బుడగలు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించాడు. చాలా మంది ప్రముఖులు తమకు నచ్చే విషయాలే వినాలన్న ఓ రకమైన బుడగను తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది అని భోగ్లే ట్విటర్లో తన అభిప్రాయాన్ని చెప్పాడు. Virat Kohli's statement is a reflection of the bubble that most famous people either slip into or are forced into. The voices within it are frequently those that they wish to hear. It is a comfortable bubble and that is why famous people must try hard to prevent it from forming — Harsha Bhogle (@bhogleharsha) 8 November 2018 -
దేశం విడిచి వెళ్లిపో : విరాట్ కోహ్లి
ఓ అభిమానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. కాగా, అభిమాని వ్యాఖ్యలపై కోహ్లి ఇచ్చిన సమాధానం తీవ్ర దుమారం రేపింది. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని ‘కోహ్లి యాప్’లో సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్) ‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు.కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు’ అని బదులిచ్చాడు. కాగా, కోహ్లి వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లిపై విరుచుకుపడుతున్నారు. -
క్రికెట్ మహా సంగ్రామం
నాలుగేళ్లుగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఏర్పాట్లు ఘనంగా చేశారు. ‘ప్రేమికుల రోజు’ ఆతిథ్య జట్లు ఆసీస్, న్యూజిలాండ్‌లు... ఇంగ్లండ్, శ్రీలంకలతో పోటీ పడుతూ టోర్నీకి స్వాగతం పలుకుతుండగా... మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు పోరు అభిమానులకు కనువిందు చేయనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనే 23 ఏళ్లక్రితం క్రికెట్ రంగులద్దుకుంది. 1992 ప్రపంచ కప్ సందర్భంగా తెల్ల బంతులు, రంగురంగుల దుస్తులు రాత్రింబగళ్లను సప్తవర్ణ శోభితం చేశాయి. తొలిసారి డే నైట్ మ్యాచ్‌లు రంగుల్లో మెరిసిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులు! సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ఆటలో చాలా మార్పులొచ్చాయి. టీవీల ముందు కూర్చుని చూసే కోట్లాదిమంది ఆటను మరింత అందంగా ఆస్వాదించగలుగుతున్నారు. 200కు పైగా దేశాల్లో సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు ఈసారి ప్రపంచకప్‌ను వీక్షిస్తారని ఒక అంచనా. ఆతిథ్య దేశాలు కూడా 366 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,270 కోట్లు) సొమ్ము చేసుకునేందుకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. మొత్తం ప్రైజ్‌మనీని కూడా ఈసారి 25 శాతం అధికంగా రూ. 60 కోట్లకు పెంచడం మరో విశేషం. కేవలం ఆటగాళ్లు, అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, మార్కెటింగ్ రంగాల దృష్టి కూడా ఇప్పుడు ఈ మహా సంగ్రామంపైనే ఉంటుంది. ఇప్పుడు వన్డేల్లోనూ వేగం చాలా పెరిగింది. టి-20 ఫార్మాట్ వచ్చాక ఇది మరింత జోరందుకుంది. ఒకప్పుడు వన్డే క్రికెట్లో 230 పరుగులు భారీ స్కోరుగా పరిగణించేవారు. ఇప్పుడు 300 పైచిలుకు స్కోర్లు కూడా గొప్ప స్కోర్లుగా చెప్పుకోలేని పరిస్థితి. ఆటలో ఇంత వేగం పెరగడంతో సహజంగానే వినోదం పెరిగింది. 2014 నుంచి ఆస్ట్రేలియాలోనే ఓవర్‌కు 5.42, న్యూజిలాండ్‌లో 5.64 పరుగుల చొప్పున స్కోర్లు నమోదయ్యాయంటే బ్యాట్స్‌మెన్ ఎంత దూకుడుగా ఆడుతున్నారో అర్థమవుతోంది. క్రికెట్ ప్రపంచంలో నాలుగేళ్లు అంటే చాలా పెద్ద సమయం. ఈ సమయంలో ఓడలు బండ్లు కావడం... బండ్లు ఓడలు కావడం సహజం. ఆశించిన ప్రదర్శన చూపించకుండా తెర వెనక్కి వెళ్లిపోయిన వారు కొందరైతే... ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రీడా ప్రపంచంనుంచి నిష్ర్కమించింది ఈ కాలంలోనే. ఆటపరంగా కూడా 2011తో పోలిస్తే ఈసారి ప్రపంచ కప్ కొత్త పుంతలు తొక్కబోతోంది. రెండు వైపులనుంచి రెండు కొత్త బంతులను ఉపయోగిస్తుండటం, ఫీల్డింగ్ పరిమితుల్లో మార్పులు తొలిసారి ప్రపంచకప్‌లో కనిపించబోతున్నాయి. ఇవి ఆశించిన ఫలితాన్ని ఇస్తాయా, ప్రతికూలంగా మారతాయా అనేది టోర్నమెంట్ ప్రారంభమయ్యాకే తెలుస్తుంది. 1975లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్... ఆ దశాబ్దంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా అన్ని జట్లూ పుంజుకున్నాయి. అటు తర్వాత క్రికెట్లో దశాబ్దకాలం పాటు ఏ జట్టుకూ అందనంత ఎత్తులో నిలిచి ప్రపంచకప్‌ల హ్యాట్రిక్ సహా నాలుగు సార్లు టైటిల్ సాధించిన ఘనత ఆస్ట్రేలియాది. ఈసారి ప్రపంచకప్‌లో బ్యాట్‌కి, బంతికి మధ్య సమరం సమతూకం తో జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌లో బంతి బాగా స్వింగ్ అవుతుంది. అలాగే ఆస్ట్రేలియా పిచ్‌ల మీద బౌన్స్ ఉంటుంది. కాబట్టి రెండు దేశాల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోగలిగే జట్టు చివరివరకూ నిలబడుతుంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేవరెట్స్‌గా కనిపిస్తు న్నాయి. ప్రపంచకప్ వేదికలలో ఉండే పరిస్థితులకు ఏ మేరకు అలవాటు పడతాయి.. ఆటను ఎంతమేరకు మెరుగుపరుచుకుంటాయి అన్న అంశాలపై ఉపఖండ దిగ్గజ జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంకల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. క్రికెట్ పుట్టినిల్లే అయినా ఎన్నడూ ప్రపంచకప్ గెలవని ఇంగ్లండ్... పూలమ్మిన చోట కట్టెలమ్మే పరిస్థితిలో ఉన్న వెస్టిండీస్ ఈసారి కూడా అండర్‌డాగ్స్‌గానే బరిలోకి దిగుతున్నాయి. ఇక డిఫెండింగ్ చాంపియన్‌గా ఆశలు, అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత జట్టు మరోసారి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే ప్రపంచకప్ విజయానికి చేరువ కావొచ్చు. అద్భుతమైన బ్యాటింగ్ బలగం భారత్‌కు ఉంది. ప్రస్తుత వన్డే క్రికెట్లో అనేక దేశాల ఆటగాళ్లతో పోలిస్తే మన జట్టు ప్రదర్శన చాలా మెరుగ్గా ఉండగా... వ్యక్తిగతంగా చూసినా టీమిండియా సభ్యుల మెడలో అనేక రికార్డుల హారాలు జిగేల్మంటున్నాయి. బ్యాట్స్‌మెన్ రాణిస్తే భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసరగల నైపుణ్యం ధోని సేన సొంతం. ఇటీవల టీమిండియా కొన్ని నాసిరకం ప్రదర్శనలు ఇచ్చినా కీలక సమయంలో కోలుకొని సత్తా చాటిన సందర్భాలనేకం. 15 మంది సభ్యుల జట్టులో ధోని, కోహ్లి, రైనా, అశ్విన్‌లు గత విజయంలో కూడా భాగంగా ఉన్నారు. వీరి మార్గదర్శనంలో మిగతా 11 మంది కుర్రాళ్లు తొలిసారి తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కొండొకచో పేస్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తున్నా... ఒకట్రెండు మినహా ఇతర జట్లలో కూడా ఇలాంటి అనుభవలేమి గల బౌలింగ్ బృందమే ఉండటం కూడా మన అవకాశాలను మెరుగుపరుస్తోంది. మన బృందంలో తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి రాయుడు కూడా ఉండటం అభిమానులు ఆనందించాల్సిన సందర్భం. ఎప్పుడో 1999లో అజహరుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రాయుడు టోర్నీలో తనదైన ముద్ర వేస్తే అది మనోళ్లు ఎంతగానో గర్వించే క్షణమవుతుంది. మన దేశంలో క్రికెట్ అంటేనే ఒక మతం. దానిని ఆటకు అన్వయిస్తే అదీ మత్తులాంటిదే! రానున్న 44 రోజులూ అభిమానులు రాత్రింబగళ్లు అందులో ఊగుతూ, తూలుతూ కనిపిస్తారు. అది పెళ్లి పందిరి అయినా, చౌరస్తా అయినా... ఎక్కడైనా చర్చంతా ఇప్పుడు క్రికెట్ మీదకే మళ్లుతుంది. ఫలితాలు, గణాంకాలు, రికార్డులు... ఆహాలు, ఓహోలు, అయ్యోలు వినిపిస్తుంటాయి. అంతరాంతరాల్లోని ఆశలెలా ఉన్నా సమర్థతను ప్రదర్శించే మేటి జట్టు విశ్వ విజేత కావాలని కోరుకోవడమే క్రీడా స్ఫూర్తి అంటే! వారు, వీరనే తేడా లేకుండా అందరినీ ఒక్కచోటికి చేర్చే ఈ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో మీరు కూడా మమేకం అయిపోండి. మనసారా ఆస్వాదించండి. -
క్రికెట్ లవర్స్‌కు పండుగ
క్రికెట్ లవర్స్‌కు పండుగ వచ్చేసింది. చాంపియన్స్ లీగ్ టి20 (సిఎల్టి) చడీ చప్పుడు కాకుండా ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఐపిఎల్(ఇండియన్ ప్రిమీయర్ లీగ్) అంత ఫాలోయింగ్ చాంపియన్స్ లీగ్‌కు లేదని ఇప్పటి వరకు భావించారు. క్రికెట్‌ను పిచ్చపిచ్చగా ఆదరించే మన దేశంలో క్రికెట్ ప్లేయర్లను దేవుళ్లుగా కొలుస్తారు. స్టార్ ప్లేయర్లుంటే చాలు ఏ టోర్నీ అయినా గ్రాండ్ సక్సెస్. అందులోనూ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, శిఖర్ ధావన్ బరిలో దిగుతున్నారంటే గోలగోలే! స్టేడియంలు ఫ్యాన్స్ ఈలలు, గోలతో మార్మోగుతాయి. చాంపియన్స్ లీగ్‌కు ఐపిఎల్ మాదిరి హడావిడి కనిపించడం లేదు. న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో వోల్ట్స్ టీమ్ గురించి ఎంత మంది క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలుసు. ఆ టీమ్‌లో ఎవరెవరు వున్నారో ఓ అయిదుగురి క్రీడాకారుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ లీగ్ టోర్నీ చూసేందుకు కొన్ని కారణాలు వున్నాయి. ది వాల్ అనే ముద్దు పేరుతో పదిహేడేళ్లుగా ఇండియన్ క్రికెట్‌కు సేవలందించిన రాహుల్ ద్రావిడ్‌కు ఇదే చివరి టోర్నమెంట్. రాజస్థాన్ రాయల్స్‌కు ద్రావిడ్ తన చివరి టోర్నీలో ఆడుతున్నాడు. గొప్ప టెస్ట్ క్రికెటర్ అయిన ద్రావిడ్ టి ట్వంటీ టోర్నీల్లోనూ చెప్పుకోదగ్గ రన్స్ తీయడమే కాకుండా, టీమ్‌ను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ కూడా. అందుకే ఐపిఎల్‌లో మూడో స్థానం పొందిన రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్ లీగ్‌కు క్వాలిఫై అయింది. ముగ్గురు ప్లేయర్లు స్పాట్ ఫిక్సింగ్ వూబిలో కూరుకుపోయి టీమ్‌కు దూరమైనప్పటికీ, అందుబాటులో వున్న వారితోనే జైత్రయాత్ర సాగించడం ద్రావిడ్ ప్రత్యేకత. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 198 మ్యాచ్‌లు ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇటీవల ఆడిన ఐపిఎల్ తన చివరి టోర్నీ అన్నాడు. వచ్చే ఏడాది ఊపిఎల్ లాంటి పొట్టి ఫార్మాట్లో సచిన్ ఆటను మన చూసే అవకాశం లేదు. అందుకే చాంపియన్స్ లీగ్ టోర్నీలోనే చివరి సారిగా సచిన్‌ను ఈ పొట్టి ఫార్మాట్లో ఆడటాన్ని తనవి తీరా చూసే చాన్సుంది. గాయాన్ని సైతం లెక్క చేయక ఐపిఎల్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన సచిన్ లాంటి మెగా ప్లేయర్‌కు ఈ పొట్టి ఫార్మాట్లో గ్రాండ్‌గా వీడ్కోలు ఇవ్వాల్సిందిగా మాజీ లెగ్ స్పిన్నర్, ముంబై ఇండియన్స్ మెంటర్ అనిల్ కుంబ్లే ఫ్యాన్స్‌ను కోరారు. గత ఏడాదిగా న్యూస్ మేకర్ క్రికెటర్ ఎవరంటే శిఖర్ ధావన్ అనే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదుర్స్ అనిపించిన ఈ ఓపెనర్ ఐపిఎల్ లాంటి పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటి వన్డే టీమ్‌కు సెలెక్టయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆ తర్వాత వెస్టిండీస్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో, ఆ తర్వాత జింబాబ్వేలో జరిగిన సిరీస్‌లోనూ శిఖర్ ధావన్ తనేమిటో రుజువు చేసుకున్నాడు. ఫలితంగా సంగక్కర గైర్హాజరీలో వైస్ కెప్టెన్ కామెరూన్ వైట్ నుండి సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్సీని ధావన్ చేజిక్కించుకున్నాడు కూడా. సిఎల్టికి ఐపిఎల్‌కు వున్న ఆదరణ లేదని బాధపడేవారికి ఇది ఓ శుభవార్తే. ఈ టోర్నీలో నాలుగు ఇండియా టీమ్స్ బరిలో వున్నాయి. ఈ స్టార్ ప్లేయర్ల యాక్షన్‌ను షార్ట్ ఫార్మాట్లో చూసి ఆనందించడం ఇక మీ వంతే. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది. చాంపియన్స్ లీగ్ టి20 షెడ్యూల్ సెప్టెంబర్ - 21 - ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్-జైపూర్ - రా. గం. 8 నుంచి 22- బ్రిస్బేన్ హీట్ - ట్రినిడాడ్ అండ్ టొబాగో -రాంచీ- సా. గం. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ - టైటాన్స్ -రాంచీ -రా. గం. 8 నుంచి 23 -హైవెల్డ్ లయన్స్ - పెర్త్ స్కార్చర్స్ -అహ్మదాబాద్-సా. గం. 4 నుంచి ముంబై ఇండియన్స్ - ఒటాగో వోల్ట్స్ -అహ్మదాబాద్- రా. గం. 8 నుంచి 24 -బ్రిస్బేన్ హీట్ - టైటాన్స్ మొహాలీ- సా. గం. 4 నుంచి సన్‌రైజర్స్ -ట్రినిడాడ్ అండ్ టొబాగో- మొహాలీ-రా. గం. 8 నుంచి 25 -పెర్త్ స్కార్చర్స్ - ఒటాగో వోల్ట్స్ -జైపూర్ -గం. సా. 4 నుంచి రాజస్థాన్ రాయల్స్ - హైవెల్డ్ లయన్స్- జైపూర్- గం. రా. 8 నుంచి 26 -సన్‌రైజర్స్ - చెన్నై సూపర్ కింగ్స్ -రాంచీ- రా. గం. 8 నుంచి 27 -ముంబై ఇండియన్స్ - హైవెల్డ్ లయన్స్-అహ్మదాబాద్-రా. గం. 8 నుంచి 28 -సన్‌రైజర్స్ - టైటాన్స్ -రాంచీ- సా. గం. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ - బ్రిస్బేన్ హీట్ -రాంచీ-రా. గం. 8 నుంచి 29 -హైవెల్డ్ లయన్స్ - ఒటాగో వోల్ట్స్- జైపూర్- సా. గం. 4 నుంచి రాజస్థాన్ రాయల్స్ - పెర్త్ స్కార్చర్స్- జైపూర్ -రా. గం. 8 నుంచి 30 -టైటాన్స్ - ట్రినిడాన్ అండ్ టొబాగో- అహ్మదాబాద్- సా. గం. 4 నుంచి సన్‌రైజర్స్ -బ్రిస్బేన్ హీట్ -అహ్మదాబాద్- రా. గం. 8 నుంచి అక్టోబర్ 1 -రాజస్థాన్ రాయల్స్ -ఒటాగో వోల్ట్స్ -జైపూర్- రా. గం. 8 నుంచి 2 -ముంబై ఇండియన్స్ -పెర్త్ స్కార్చర్స్-ఢిల్లీ- గం. సా. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్- ట్రినిడాడ్ అండ్ టొబాగో- ఢిల్లీ-గం. రా. 8 నుంచి 4 -తొలి సెమీ ఫైనల్ (ఎ1-బి2) -జైపూర్ -రా. గం. 8 నుంచి 5 -రెండో సెమీ ఫైనల్ (ఎ2-బి1)- ఢిల్లీ- రా. గం. 8 నుంచి 6 -ఫైనల్ -ఢిల్లీ -రా. గం. 8 నుంచి ఏ గ్రూప్‌లో ఎవరు గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, హైవెల్డ్ లయన్స్, పెర్త్ స్కార్చర్స్, ఒటాగో వోల్ట్స్ గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, బ్రిస్బేన్ హీట్, టైటాన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో