నాలుగేళ్లుగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఏర్పాట్లు ఘనంగా చేశారు. ‘ప్రేమికుల రోజు’ ఆతిథ్య జట్లు ఆసీస్, న్యూజిలాండ్‌లు... ఇంగ్లండ్, శ్రీలంకలతో పోటీ పడుతూ టోర్నీకి స్వాగతం పలుకుతుండగా... మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు పోరు అభిమానులకు కనువిందు చేయనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనే 23 ఏళ్లక్రితం క్రికెట్ రంగులద్దుకుంది.
1992 ప్రపంచ కప్ సందర్భంగా తెల్ల బంతులు, రంగురంగుల దుస్తులు రాత్రింబగళ్లను సప్తవర్ణ శోభితం చేశాయి. తొలిసారి డే నైట్ మ్యాచ్‌లు రంగుల్లో మెరిసిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులు! సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ఆటలో చాలా మార్పులొచ్చాయి. టీవీల ముందు కూర్చుని చూసే కోట్లాదిమంది ఆటను మరింత అందంగా ఆస్వాదించగలుగుతున్నారు. 200కు పైగా దేశాల్లో సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు ఈసారి ప్రపంచకప్‌ను వీక్షిస్తారని ఒక అంచనా. ఆతిథ్య దేశాలు కూడా 366 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,270 కోట్లు) సొమ్ము చేసుకునేందుకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది. మొత్తం ప్రైజ్‌మనీని కూడా ఈసారి 25 శాతం అధికంగా రూ. 60 కోట్లకు పెంచడం మరో విశేషం. కేవలం ఆటగాళ్లు, అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, మార్కెటింగ్ రంగాల దృష్టి కూడా ఇప్పుడు ఈ మహా సంగ్రామంపైనే ఉంటుంది.
ఇప్పుడు వన్డేల్లోనూ వేగం చాలా పెరిగింది. టి-20 ఫార్మాట్ వచ్చాక ఇది మరింత జోరందుకుంది. ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో 230 పరుగులు భారీ స్కోరుగా పరిగణించేవారు. ఇప్పుడు 300 పైచిలుకు స్కోర్లు కూడా గొప్ప స్కోర్లుగా చెప్పుకోలేని పరిస్థితి. ఆటలో ఇంత వేగం పెరగడంతో సహజంగానే వినోదం పెరిగింది. 2014 నుంచి ఆస్ట్రేలియాలోనే ఓవర్‌కు 5.42, న్యూజిలాండ్‌లో 5.64 పరుగుల చొప్పున స్కోర్లు నమోదయ్యాయంటే బ్యాట్స్‌మెన్ ఎంత దూకుడుగా ఆడుతున్నారో అర్థమవుతోంది. క్రికెట్ ప్రపంచంలో నాలుగేళ్లు అంటే చాలా పెద్ద సమయం.
ఈ సమయంలో ఓడలు బండ్లు కావడం... బండ్లు ఓడలు కావడం సహజం. ఆశించిన ప్రదర్శన చూపించకుండా తెర వెనక్కి వెళ్లిపోయిన వారు కొందరైతే... ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రీడా ప్రపంచంనుంచి నిష్ర్కమించింది ఈ కాలంలోనే. ఆటపరంగా కూడా 2011తో పోలిస్తే ఈసారి ప్రపంచ కప్ కొత్త పుంతలు తొక్కబోతోంది. రెండు వైపులనుంచి రెండు కొత్త బంతులను ఉపయోగిస్తుండటం, ఫీల్డింగ్ పరిమితుల్లో మార్పులు తొలిసారి ప్రపంచకప్‌లో కనిపించబోతున్నాయి. ఇవి ఆశించిన ఫలితాన్ని ఇస్తాయా, ప్రతికూలంగా మారతాయా అనేది టోర్నమెంట్ ప్రారంభమయ్యాకే తెలుస్తుంది.
1975లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్... ఆ దశాబ్దంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా అన్ని జట్లూ పుంజుకున్నాయి. అటు తర్వాత క్రికెట్‌లో దశాబ్దకాలం పాటు ఏ జట్టుకూ అందనంత ఎత్తులో నిలిచి ప్రపంచకప్‌ల హ్యాట్రిక్ సహా నాలుగు సార్లు టైటిల్ సాధించిన ఘనత ఆస్ట్రేలియాది. ఈసారి ప్రపంచకప్‌లో బ్యాట్‌కి, బంతికి మధ్య సమరం సమతూకం తో జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌లో బంతి బాగా స్వింగ్ అవుతుంది. అలాగే ఆస్ట్రేలియా పిచ్‌ల మీద బౌన్స్ ఉంటుంది. కాబట్టి రెండు దేశాల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోగలిగే జట్టు చివరివరకూ నిలబడుతుంది.
ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫేవరెట్స్‌గా కనిపిస్తు న్నాయి. ప్రపంచకప్ వేదికలలో ఉండే పరిస్థితులకు ఏ మేరకు అలవాటు పడతాయి.. ఆటను ఎంతమేరకు మెరుగుపరుచుకుంటాయి అన్న అంశాలపై ఉపఖండ దిగ్గజ జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంకల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. క్రికెట్ పుట్టినిల్లే అయినా ఎన్నడూ ప్రపంచకప్ గెలవని ఇంగ్లండ్... పూలమ్మిన చోట కట్టెలమ్మే పరిస్థితిలో ఉన్న వెస్టిండీస్ ఈసారి కూడా అండర్‌డాగ్స్‌గానే బరిలోకి దిగుతున్నాయి.
ఇక డిఫెండింగ్ చాంపియన్‌గా ఆశలు, అంచనాలతో బరిలోకి దిగుతున్న భారత జట్టు మరోసారి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే ప్రపంచకప్ విజయానికి చేరువ కావొచ్చు. అద్భుతమైన బ్యాటింగ్ బలగం భారత్‌కు ఉంది. ప్రస్తుత వన్డే క్రికెట్‌లో అనేక దేశాల ఆటగాళ్లతో పోలిస్తే మన జట్టు ప్రదర్శన చాలా మెరుగ్గా ఉండగా... వ్యక్తిగతంగా చూసినా టీమిండియా సభ్యుల మెడలో అనేక రికార్డుల హారాలు జిగేల్మంటున్నాయి. బ్యాట్స్‌మెన్ రాణిస్తే భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసరగల నైపుణ్యం ధోని సేన సొంతం. ఇటీవల టీమిండియా కొన్ని నాసిరకం ప్రదర్శనలు ఇచ్చినా కీలక సమయంలో కోలుకొని సత్తా చాటిన సందర్భాలనేకం.
15 మంది సభ్యుల జట్టులో ధోని, కోహ్లి, రైనా, అశ్విన్‌లు గత విజయంలో కూడా భాగంగా ఉన్నారు. వీరి మార్గదర్శనంలో మిగతా 11 మంది కుర్రాళ్లు తొలిసారి తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కొండొకచో పేస్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తున్నా... ఒకట్రెండు మినహా ఇతర జట్లలో కూడా ఇలాంటి అనుభవలేమి గల బౌలింగ్ బృందమే ఉండటం కూడా మన అవకాశాలను మెరుగుపరుస్తోంది. మన బృందంలో తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి రాయుడు కూడా ఉండటం అభిమానులు ఆనందించాల్సిన సందర్భం. ఎప్పుడో 1999లో అజహరుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రాయుడు టోర్నీలో తనదైన ముద్ర వేస్తే అది మనోళ్లు ఎంతగానో గర్వించే క్షణమవుతుంది.
మన దేశంలో క్రికెట్ అంటేనే ఒక మతం. దానిని ఆటకు అన్వయిస్తే అదీ మత్తులాంటిదే! రానున్న 44 రోజులూ అభిమానులు రాత్రింబగళ్లు అందులో ఊగుతూ, తూలుతూ కనిపిస్తారు. అది పెళ్లి పందిరి అయినా, చౌరస్తా అయినా... ఎక్కడైనా చర్చంతా ఇప్పుడు క్రికెట్ మీదకే మళ్లుతుంది. ఫలితాలు, గణాంకాలు, రికార్డులు... ఆహాలు, ఓహోలు, అయ్యోలు వినిపిస్తుంటాయి. అంతరాంతరాల్లోని ఆశలెలా ఉన్నా సమర్థతను ప్రదర్శించే మేటి జట్టు విశ్వ విజేత కావాలని కోరుకోవడమే క్రీడా స్ఫూర్తి అంటే! వారు, వీరనే తేడా లేకుండా అందరినీ ఒక్కచోటికి చేర్చే ఈ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో మీరు కూడా మమేకం అయిపోండి. మనసారా ఆస్వాదించండి.
క్రికెట్ మహా సంగ్రామం
Published Sat, Feb 14 2015 1:35 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
Advertisement