critcise
-
‘విపక్ష ఎమ్మెల్యేను కావడంతోనే వివక్ష’
సాక్షి, గుంటూరు: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గుంటూరు ఈస్టు ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. కార్పొరేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల గత ఐదు రోజుల్లో పది మంది చనిపోయారని, వందల మంది చికిత్స పొదుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డయేరియా రోగులకు నాసిరకం మందుల్ని అందిస్తోందని ఆయన విమర్శించారు. తాగునీరు కలుషితమౌతోందని అనేకసార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మురికి నీళ్లు వస్తున్నాయని బాటిల్లో నీళ్లు పట్టి చూపించినా అధికారులు స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను కావడంతోనే తన నియోజక వర్గ అభివృద్ధి పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
విమర్శించడం మానుకోవాలి
జైనథ్ : రైతుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌ను విమర్శించడం మానుకోవాలని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కోరెడ్డి నర్సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబి రంగు పురుగు, కింగ్ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ శంకర్ నిర్వహించిన ధర్నాను టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం అనైతికమన్నారు. మండలంలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లని టీఆర్ఎస్ నాయకులు కేవలం పదవుల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో గులాబి రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తుంటే, ఇక్కడ ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శలు మాని రైతులకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండి స్వామి, నాయకులు రాకేష్ రెడ్డి, నవీన్, రాకేష్, ఆశీష్, రమేష్ పాల్గొన్నారు. -
ట్రైలర్ ఇలా.. సినిమా ఇంకెలానో..!
ప్రభుత్వం పనై పోయింది 2018లోనే ఎన్నికలు వస్తాయ్! రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి సత్తుపల్లి : ‘‘పెన్షన్లకు డబ్బుల్లేవ్.. ఉద్యోగుల వేతనాలకు డబ్బుల్లేవ్.. బతుకమ్మకు మాత్రం బడ్జెట్ ఉంటుంది. సీఎం కేసీఆర్.. ఫాం హౌస్‌లో పడుకుని ఏదేదో మాట్లాడుతుంటారు. ఏవేవో హామీలిస్తుంటారు. వాటిలో ఒక్కటీ అమలుకాదు. ఈ ప్రభుత్వం పనైపోయింది. ట్రైలరే ఇలా ఉంటే.. సినిమా ఇంకెలా ఉంటుందో... అర్థం చేసుకోవచ్చు. 2019కి ఏడాది ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముంది’’ అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. ఆమె మంగళవారం సత్తుపల్లిలో డీసీసీ అధికార ప్రతినిధి రామిశెట్టి సుబ్బారావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన పథకాల అమలులో అవినీతి బహిరంగంగానే కనిపిస్తోందని, ఈ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమైందని, ఏం చేయాలో వారే తేల్చుకుంటారని అన్నారు. ‘‘జిల్లాలో ఎక్కడ చూసినా జామాయిల్, సర్వే బాదుల తోటలే కన్పిస్తున్నాయి. ఇవి వేస్తే భూమి దేనికి పనికి రాదు. ఏమీ మొలవదు. బంజరు భూములుగా మారిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటుతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ ప్రభుత్వం ఎన్నటికీ కట్టలేదని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఐదులక్షల రూపాయలు మంజూరు చేస్తే.. కేవలం ఒక్క గదికే ప్రతిపాదనలు ఇస్తున్నారు. అదే ఐదు లక్షలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా కడతారో అర్థమవడం లేదు’’ అని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి జిల్లాలో రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లి చీపురి కుంటను కొందరు ఆక్రమించి పంటలకు నీళ్లు అందకుండా అడ్డుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘అధికారులు.. రాజకీయాలు చేయాలనుకుంటే ముందుగా ఉద్యోగాలు మానేయాలి’’ అని సలహా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు.