
సాక్షి, గుంటూరు: అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గుంటూరు ఈస్టు ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. కార్పొరేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల గత ఐదు రోజుల్లో పది మంది చనిపోయారని, వందల మంది చికిత్స పొదుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డయేరియా రోగులకు నాసిరకం మందుల్ని అందిస్తోందని ఆయన విమర్శించారు.
తాగునీరు కలుషితమౌతోందని అనేకసార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మురికి నీళ్లు వస్తున్నాయని బాటిల్‌లో నీళ్లు పట్టి చూపించినా అధికారులు స్పందించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను కావడంతోనే తన నియోజక వర్గ అభివృద్ధి పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.