సమావేశంలో మాట్లాడుతున్న రేణుకాచౌదరి
- ప్రభుత్వం పనై పోయింది
- 2018లోనే ఎన్నికలు వస్తాయ్!
-
రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
సత్తుపల్లి : ‘‘పెన్షన్లకు డబ్బుల్లేవ్.. ఉద్యోగుల వేతనాలకు డబ్బుల్లేవ్.. బతుకమ్మకు మాత్రం బడ్జెట్ ఉంటుంది. సీఎం కేసీఆర్.. ఫాం హౌస్‌లో పడుకుని ఏదేదో మాట్లాడుతుంటారు. ఏవేవో హామీలిస్తుంటారు. వాటిలో ఒక్కటీ అమలుకాదు. ఈ ప్రభుత్వం పనైపోయింది. ట్రైలరే ఇలా ఉంటే.. సినిమా ఇంకెలా ఉంటుందో... అర్థం చేసుకోవచ్చు. 2019కి ఏడాది ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముంది’’ అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.
ఆమె మంగళవారం సత్తుపల్లిలో డీసీసీ అధికార ప్రతినిధి రామిశెట్టి సుబ్బారావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన పథకాల అమలులో అవినీతి బహిరంగంగానే కనిపిస్తోందని, ఈ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమైందని, ఏం చేయాలో వారే తేల్చుకుంటారని అన్నారు. ‘‘జిల్లాలో ఎక్కడ చూసినా జామాయిల్, సర్వే బాదుల తోటలే కన్పిస్తున్నాయి. ఇవి వేస్తే భూమి దేనికి పనికి రాదు. ఏమీ మొలవదు. బంజరు భూములుగా మారిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటుతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ ప్రభుత్వం ఎన్నటికీ కట్టలేదని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఐదులక్షల రూపాయలు మంజూరు చేస్తే.. కేవలం ఒక్క గదికే ప్రతిపాదనలు ఇస్తున్నారు.
అదే ఐదు లక్షలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా కడతారో అర్థమవడం లేదు’’ అని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి జిల్లాలో రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లి చీపురి కుంటను కొందరు ఆక్రమించి పంటలకు నీళ్లు అందకుండా అడ్డుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘అధికారులు.. రాజకీయాలు చేయాలనుకుంటే ముందుగా ఉద్యోగాలు మానేయాలి’’ అని సలహా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు.