Crore rupees
-
AP: గిరిజనుడికి చిక్కిన కోటి రూపాయల కీటకం!
సాక్షి,అనకాపల్లిజిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల నియోజకవర్గం కోనాంలో కోటి రూపాలయ కీటకం ప్రత్యక్షమైంది. అడవికి వెళ్లిన గిరిజనుడికి వింత కీటకం కనిపించడంతో దానిని ఆకులో చుట్టి ఇంటికి తీసుకువచ్చాడు. నిజానికి ఆ కీటకం పేరు స్టాగ్బీటిల్. వింత ఆకారంలో ఉండటంతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకంగా స్టాగ్బీటిల్కు గుర్తింపు ఉంది. ఔషధ తయారీలో ఈ కీటకాన్ని వాడతారని తెలుస్తోంది. కీటకం విలువ మార్కెట్లో కోటి రూపాయలకుపైగా ఉంటుందని ప్రచారం. అయితే ఆ గిరిజనుడికి ప్రస్తుతం కీటకాన్ని ఏం చేయాలో తెలియక ఇంటివద్దే ఉంచుకున్నాడు. అడవిలో తిరిగే కీటకానికి ఏం తిండి పెట్టాలో తెలియక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. -
ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?
మనం ఇప్పటి వరకు మునుపటి కథనాల్లో ఖరీదైన కారు గురించి, ఖరీదైన బైకు గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కథనంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం (వైన్) ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం వోడ్కా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. దీని ధర రూ. 30 కోట్లు వరకు ఉంటుంది. భారతదేశంలో ఖరీదైన మద్యం అంటే సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు ఉంటుంది. అలాంటిది 'లియోన్ వెర్రెస్ మాస్టర్‌పీస్' (Leon Verres Masterpiece) 3.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. నిజానికి ఈ మద్యం బాటిల్ కొనుగోలు చేసే ధరతో కొన్ని జీవితాలు సెటిల్ అయిపోతాయి అంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మద్యం ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణం బాటిల్ 3000 వజ్రాలతో ఉంటుంది. అంతే కాకుండా ఈ బాటిల్ ఆకర్షణీయకంగా కనిపించేందుకు వైలెట్ హ్యూడ్ హెవీ గ్లాస్‌తో ఒక ప్రత్యేకమైన పూత ఉంటుంది. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) బాటిల్ లోపల ఉండే మద్యం ధర కంటే కూడా బాటిల్ ధర ఎక్కువ కావడం గమనార్హం. ఇది ఖరీదైన ప్లాటినం, రోడియం వంటి విలువైన లోహాల కలయికతో అందంగా తాయారు చేసి దానికి గోల్డ్ లేబుల్ అందించడం జరిగింది. బాటిల్ మొత్తం ఖరీదైన వజ్రాలతో తయారై ఉంటుంది కావున ధర భారీగా ఉంటుంది. -
బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్
కొన్ని విలువైన వస్తువులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనం ఇల్లు, కారు, వాహనాలకు బీమా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆ బీమా డబ్బుని క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహాలోనే కొందరు సెలబ్రిటీలు తమ శరీర భాగాలకు ఇన్సురెన్స్ చేయించుకుంటుంటారు. ఈ జాబితాలో తారలు కూడా ఉన్నారు. తాజాగా బ్రేజిల్‌లో ఓ మోడల్ కూడా తన బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకుంది. ఇంతకీ ఏంటా పార్ట్ అంటారా? ఆ మోడల్ తన పిరుదులను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటికే ఎందుకంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారాకు తన పిరుదులే అందం. వాటి వల్లనే తను మిస్ బుమ్‌బుమ్ 2021 వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె తన పిరుదుల కారణంగానే ప్రసిద్ధి చెందానని, అందుకే వాటికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది. నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. చదవండి: Britney Spears: నా జీవితంలో ఇదే అత్త్యుత్తమ రోజు: బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం -
భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి
భువనేశ్వర్: ఏ ప్రతిఫలం ఆశించకుండా రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రుపాయలకుపైగా ఆస్తిని దానం చేసింది. ఈ మేరకు ఆస్తిని అతని పేరు మీద రాసిన పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ ఘటన ఒరిస్సాలోని సంబల్పూర్లో చోటు చేసుకుంది. అయితే అంత ఆస్తిని కుటుంబ సభ్యులకో, లేక బంధువులకో కాకుండా రిక్షా కార్మికుడికి దానం చేయడానికి పెద్ద కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. సబల్పూర్కు చెందిన మినాతి పట్నాయక్(63) భర్త 2020లో మరణించగా, తన కుమార్తె 2021లో మరణించింది. అప్పటి నుంచి తనని ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆమె బంధువులు ఇటీవల తన ఆస్తి కోసం ఒక్కసారిగా ఆమెతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గత 25 ఏళ్లుగా ఆమె కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్న వచ్చిన రిక్షా కార్మికుడికి తన ఆస్తి మొత్తాన్ని దానం చేసింది. అందులో రూ.కోటి విలువైన భవనం, ఇతర సామగ్రిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. దీనిపై వృద్దురాలు మాట్లాడుతూ.. తన భర్త, కూతురు చనిపోయి కృంగిపోయి, దుఃఖంలో బతుకుతున్నప్పుడు, తన బంధువులెవరూ కూడా అండగా నిలబడలేదని ఆ సమయంలో తాను ఒంటరిగా కాలాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ రిక్షా కార్మికుడు, అతని కుటుంబం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఆస్తి కోసం ఎదురుచూసే వారికంటే ఏ లాభం ఆశించకుండా తన కుటుంబం కోసం నిశ్వార్ధంగా పని చేసిన బుధాకు( రిక్షా కార్మికుడు) తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది.. -
కోటి దాటితే కోతే!!
సాక్షి, అమరావతి: వ్యవస్థలో నగదు చలామణీని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచే దిశగా కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో నగదు రూపంలో కోటి రూపాయలు మించి విత్‌డ్రా చేస్తే అదనంగా కొంత చేతి చమురు వదలనుంది. నగదు రూపంలో కోటి రూపాయలు దాటి తీస్తే రెండు శాతం సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు. కోటి రూపాయలు దాటి ఎంత మొత్తం తీస్తే ఆ మొత్తంపై రెండు శాతం సర్ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకు బ్యాంకు నుంచి వివిధ సందర్భాల్లో ఒక ఏడాదిలో కోటిన్నర రూపాయలు నగదు రూపంలో తీస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు కోత పడిపోతాయి. నగదు చెలామణిని తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచడం కోసం ఈ సర్ చార్జిని విధిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ► అదే విధంగా వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల లోపు ఉన్న వారికి డిజిటల్ లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను (ఎండీఆర్) పూర్తిగా ఎత్తివేసినట్లు మంత్రి తెలిపారు. అంటే రూ.50 కోట్ల లోపు టర్నోవర్ లోపు ఉన్న వ్యాపార సంస్థల్లో కార్డు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తే ఎటువంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు. ఈ ఎండీఆర్ భారాన్ని ఆర్బీఐ, బ్యాంకులు సంయుక్తంగా భరిస్తాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 లోపు జరిపే లావాదేవీలు, భీమ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై రుసుములు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ► ఈ మధ్యనే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై కూడా కేంద్రం రుసుములను తొలగించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి డిజిటల్ లావాదేవీలు పెంచడంపై కేంద్రం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్ 2016లో 79.67 కోట్లుగా ఉన్న డిజిటల్ లావాదేవీల సంఖ్య మార్చి 2019 నాటికి 332.34 కోట్లకు ఎగబాకింది. అదే విలువ పరంగా చూస్తే డిజిటల్ లావాదేవీలు రూ.108 లక్షల కోట్ల నుంచి రూ.258 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశముందనేది మార్కెట్ పరిశీలకుల అంచనా. -
దరఖాస్తు చేయకుండానే ముంబైకర్‌కు రూ.1.2 కోట్ల వేతనం
ముంబై: ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో చదివి ప్రఖ్యాత సంస్థల్లో రూ.కోట్ల వేతనాల కొలువులు పొందడం చూశాం. కానీ, అబ్దుల్లా ఖాన్(21) విషయం వేరు. ముంబైకి చెందిన ఈ ఇంజినీరింగ్ విద్యార్థి ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో గూగుల్ సంస్థలో ఉద్యోగంలో చేరబోతున్నాడు..! ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే ఈ ఘనత సాధించాడు. అదెలా? సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అబ్దుల్లా ఖాన్ ముంబైకి వచ్చి ఐఐటీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ముంబై మీరా రోడ్డులో ఉన్న శ్రీ ఎల్ఆర్ తివారీ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోడింగ్ అంటే ఇష్టపడే అబ్దుల్లా.. ఉద్యోగం కోసమని కాకుండా, యథాలాపంగా గూగుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్ ఉంచాడు. దీనిని చూసి ఇంప్రెస్ అయిన గూగుల్ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మంటూ మెయిల్ పంపారు. మొదట్లో దీనిని అబ్దుల్లా నమ్మలేదు. ఇలాంటి మెయిల్ తన స్నేహితుడి పరిచయస్తునికి కూడా రావడంతో వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం పలు విడతలుగా జరిగిన ఇంటర్వ్యూల్లో అబ్దుల్లా విజేతగా నిలిచాడు. దీంతోపాటు మార్చి మొదటి వారంలో లండన్‌లో జరిగిన ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ పాసయ్యాడు. దీంతో, సెప్టెంబర్‌లో లండన్‌లోని గూగుల్ కార్యాలయంలో ‘రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీం’ సభ్యునిగా ఉద్యోగంలో జాయిన్ కావాలంటూ గూగుల్ నుంచి అబ్దుల్లాకు పిలుపొచ్చింది. ఏడాది వేతనం రూ.54.5 లక్షలు కాగా కంపెనీ బోనస్‌లో 15 శాతం, నాలుగేళ్లకు కలిపి రూ.58.9 లక్షల విలువైన కంపెనీ షేర్లు అతడికి అందుతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి అతడికి అందే మొత్తం సుమారు రూ.1.2 కోట్లు అవుతుంది. రూ.2 కోట్ల స్కాలర్షిప్ అమెరికాలోని ప్రఖ్యాత బోస్టన్ యూనివర్సిటీలో చదివేందుకు నోయిడాకు చెందిన ఆర్నవ్ మిశ్రా అనే విద్యార్థి ఎంపికయ్యాడు. బోస్టన్ వర్సిటీ ట్రస్టీ స్కాలర్‌షిప్‌పై చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్‌కు చెందిన ఏకైక విద్యార్థి మిశ్రా కావడం గమనార్హం. ట్రస్టీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 1,600 మార్కులకు గాను 1,500 మార్కులు, యూనివర్సిటీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 99 శాతం మార్కులు మిశ్రా సాధించాడు. దీంతో అతడు నాలుగేళ్లకు కలిపి దాదాపు రూ.2 కోట్ల మేర ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు. -
భిక్షగాడిగా మారిన కోటీశ్వరుడు
సాకి, చెన్నై : కుటుంబ తగాదాల వల్ల భార్య, కుమారులపై కోపంతో ఓ కోటీశ్వరుడు ఇల్లు వదిలి ఆలయం మెట్లపై భిక్షాటన చేస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో గల దివసూల్ ప్రాంతానికి చెందిన నటరాజన్ కోటీశ్వరుడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కోడలితో ఏర్పడిన తగాదా కారణంగా ఇంటి యజమాని నటరాజన్ భార్య, పిల్లలకు చెప్పకుండా ఇల్లు వదిలి తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చాడు. మూడు నెలలుగా అక్కడే ఉంటూ ఆలయంలో వచ్చే అన్నప్రసాదాలను తింటూ జీవిస్తున్నాడు. అతని కోసం భార్య, పిల్లలు అనేక ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఆదివారం తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చిన భార్య, పిల్లలకు నటరాజన్ భిక్షగాడి రూపంలో కనిపించాడు. వెంటనే వారందరూ అతడి వద్ద క్షమాపణలు చెప్పి కారులో ఇంటికి తీసుకెళ్లారు. -
చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు.. పరార్!
అనకాపల్లి: విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో చిట్టీల పేరుతో దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. విశాఖ పట్టణానికి చెందిన కొణతాల ఉదయ్ శ్రీనివాస్, జయశ్రీ భార్యాభర్తలు. గత కొన్నేళ్లుగా వీరు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ ప్రజల నుంచి దాదాపు రూ.3 కోట్లు వరకు వసూలు చేసిన ఈ దంపతులు కొన్ని రోజులుగా కనిపించకుండాపోయారు. వారి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై స్పందించటం లేదంటూ మంగళవారం సాయంత్రం శ్రీనివాస్ ఇంటి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించివేశారు. -
కోటి రూపాయలతో అమ్మవారి అలంకారం
పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆదివారం సరస్వతీ, ధనలక్ష్మీ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కోటీ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలతో ధనలక్ష్మీ అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహాకులు భద్రతా ఏర్పాట్లను భారీగా పెంచారు. -
కాయ్.. రాజా.. కాయ్..
విజయనగరం క్రైం: పట్టణానికి చెందిన ఓ వైద్యుడు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు కోటి రూపాయల వరకు నష్టపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. చివరకు వైద్యుడి తండ్రి కూడా వైద్యుడు కావడంతో కొడుకు చేసిన అప్పులను తీర్చినట్లు తెలిసింది. అలాగే పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు లక్ష రూపాయల వరకు నష్టపోవడంతో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.70వేలవరకు అప్పులుచేసి పెద్దలద్వారా సమస్యను పరిష్కరించుకున్నట్లు సమాచారం. ఇవి కొంతవరకు తెలిసిన ఉదాహరణలు మాత్రమే. వీరిద్దరే కాకుండా జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ బాధితులు వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్,విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా జిల్లాకు ఒక బెట్టింగ్ ముఠా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ ముఠా నియోజకవర్గకేంద్రంలో ఏజెంట్లద్వారా బెట్టింగ్‌లు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగా ముఠా సభ్యులు వారిలో వారే డమ్మీ బెట్టింగ్‌లు నిర్వహించి, వేలల్లో డబ్బులు వచ్చినట్టు నటిస్తున్నారు. వారిని చూసి అమాకులు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతోపాటు నియోజవర్గకేంద్రాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు ప్రధానంగా లాడ్జిలు, హోటళ్లు,అపార్ట్మెంట్లను వేదికగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు ఇంతవరకూ వీటిపై దృష్టి సారించలేదు. నష్టపోయేది సామాన్యులే ఏజెంట్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారు ఏజెంట్లకు కొంత కమీషన్ కేటాయిస్తారని సమాచారం. దీంతో ఓడినా...గెలిచినా అమాయకులే ఎక్కువగా నష్టపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్లు వారికి రావాల్సిన కమీషన్‌ను ముందుగానే తీసుకుంటారని, అదీ కాకుండా వారికి అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల అండ ఉండడంతో యథేచ్ఛగా బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల గజపతినగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన సభ్యులనుఅరెస్ట్‌చేసిన సమయంలో టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కొందరిని తప్పించినట్లు సమాచారం. తస్మాస్ జాగ్రత్త.. డిసెంబర్ 7నుంచి 50రోజులపాటు ప్రపంచ జట్లతో బిగ్‌బాస్ ట్వంటీ,ట్వంటీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌ల ముఠా మరింత రెచ్చిపోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో బెట్టింగ్‌లకు పాల్పడే ముఠా మండలాలకూ పాకే అవకాశం ఉంది. జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మరింత మంది తమ పిల్లలు నష్టపోయి తాము రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బయటపడిన కొన్ని సంఘటనలు.. పార్వతీపురం పట్టణంలోని లాడ్జిల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకోగా,అందులో కొందరిని విచారించి 150మందికి పైగా అరెస్ట్‌చేశారు విజయనగరం మండలం జమ్ము ప్రాంతంలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని పట్టుకుని రూ.రెండు లక్షల యాబైవేలు, రెండుకార్లు,రెండు బై కులు, 14సెల్ఫోన్లను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 14న గజపతినగరం మండల కేంద్రంలో క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్‌చేసి వారివద్దనున్న రూ.10,500, డైరీ, టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాకు సమాచారం లేదు జిల్లాలోక్రికెట్ బెట్టింగ్‌ల ముఠా ఉన్నట్లు సమాచారం లేదు. క్రైంపార్టీ సిబ్బంది, పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. సమాచారం ఉంటే ఇవ్వండి దాడులు చేసి పట్టుకుంటాం. ఎస్.శ్రీనివాస్, విజయనగరం డీఎస్పీ