
సాకి, చెన్నై : కుటుంబ తగాదాల వల్ల భార్య, కుమారులపై కోపంతో ఓ కోటీశ్వరుడు ఇల్లు వదిలి ఆలయం మెట్లపై భిక్షాటన చేస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలో గల దివసూల్ ప్రాంతానికి చెందిన నటరాజన్ కోటీశ్వరుడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కోడలితో ఏర్పడిన తగాదా కారణంగా ఇంటి యజమాని నటరాజన్ భార్య, పిల్లలకు చెప్పకుండా ఇల్లు వదిలి తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చాడు.
మూడు నెలలుగా అక్కడే ఉంటూ ఆలయంలో వచ్చే అన్నప్రసాదాలను తింటూ జీవిస్తున్నాడు. అతని కోసం భార్య, పిల్లలు అనేక ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఆదివారం తిరుప్పోరూర్ మురుగన్ ఆలయానికి వచ్చిన భార్య, పిల్లలకు నటరాజన్ భిక్షగాడి రూపంలో కనిపించాడు. వెంటనే వారందరూ అతడి వద్ద క్షమాపణలు చెప్పి కారులో ఇంటికి తీసుకెళ్లారు.