Cruise trip
-
ఎగిరే ‘హోటల్’!
ఏమిటిది? చూస్తుంటే.. క్రూయిజ్‌షిప్ తరహాలో ఉన్న అతిభారీ విమానంలా ఉందే అనుకుంటున్నారా? మీ ఊహ కరక్టే.. ఇది ఆ రెండింటి కలబోతే! సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఎగిరే హోటల్ ‘స్కై క్రూయిజ్’ గ్రాఫిక్స్ నమూనా ఇది. విమానంలా ఎగిరే అనుభూతిని, విలాసవంతమైన ఓడలో లభించే సకల సౌకర్యాలను ప్రయాణికులకు ఏకకాలంలో అందించగల బాహుబలి తరహా విమానమన్నమాట. ఓస్ ఇంతేనా అనుకోకండి.. ఇందులోని ప్రత్యేకతల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆకాశంలో ఏళ్ల తరబడి ఎగురుతూ.. సాధారణంగా ఎంత భారీ విమానమైనా కొన్ని గంటలపాటు ప్రయాణించాక కిందకు దిగడం అనివార్యం. అలాగే నెలల తరబడి సముద్రంపై ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లు సైతం ఎక్కడో ఒకచోట లంగరు వేయక తప్పదు. కానీ యెమెన్‌కు చెందిన ప్రముఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్–ఘాయిలీ యూట్యూబ్‌లో స్కై క్రూయిజ్ పేరిట తాజాగా విడుదల చేసిన ‘ఎగిరే హోటల్’ కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. వేలాది మంది ప్రయాణికులతో ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలగడం దీని ప్రత్యేకతల్లో ఒకటి! పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఎగిరే ఈ విమానంలో ఒకేసారి 5 వేల మంది అతిథులు ఆకాశయానం చేయొచ్చట!! ఇంత భారీ విమానం గాల్లో ఎగిరేందుకు వీలుగా అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లను దీనికోసం డిజైన్ చేశారు. ఇందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి అణు రియాక్టర్‌నే ఇందులో ఏర్పాటు చేయనున్నారు. నియంత్రిత స్థాయిలో కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా అపరిమిత ఇంధనాన్ని ఈ విమానానికి సమకూర్చనున్నారు. దీంతో ఈ విమానం ఎప్పటికీ నేలపై వాలాల్సిన అవసరం రాదని డిజైనర్ చెబుతున్నాడు. మరి ప్రయాణికులు ఇందులోకి ఎలా ఎక్కి దిగగలరు అని అనుకుంటున్నారా? ఈ నూతన డిజైన్ ప్రకారం ప్రయాణికులను లేదా నిత్యావసరాలను సాధారణ వాణిజ్య విమానాలు లేదా ప్రైవేటు జెట్ల ద్వారా స్కై క్రూయిజ్ చెంతకు చేర్చి ప్రత్యేకమైన ‘లిఫ్ట్’ ద్వారా ఈ ఎగిరే హోటల్లోకి చేరుస్తారట!! విమానానికి చేపట్టే మరమ్మతులు సైతం గాల్లోనే నిర్వహిస్తారట! గాల్లోనే ప్రపంచమంతా.. ఈ విమానంలో ఉండబోయే సౌకర్యాలు అన్నీఇన్నీ కావు. ఇందులో ఒక భారీ షాపింగ్ మాల్, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్ సెంటర్లు, ప్లేగ్రౌండ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూళ్లు, వెడ్డింగ్ హాళ్లు, సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్ చేశారు. ప్రత్యేకించి విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్ నుంచి 360 డిగ్రీల కోణంలో పైనున్న అంతరిక్షాన్ని, దిగువనున్న యావత్ ప్రపంచాన్ని అతిథులు వీక్షించే ఏర్పాటు ఉండనుంది. విమానం మధ్య భాగం నుంచి లోపలకు వెలుతురు ప్రసరించేలా పూర్తిగా గ్లాస్ బాడీతో దీన్ని డిజైన్ చేయనున్నారు. విమానానికి ఇరువైపులా ఏర్పాటు చేసే బాల్కనీల తరహా డోమ్‌ల నుంచి అతిథులు చుక్కలను చూసే ఏర్పాటు సైతం ఉంది. అలాగే దట్టమైన మేఘాల్లోంచి ప్రయాణించే సమయంలో విమానం కుదుపులు లేదా కంపనాలకు గురయ్యే అవకాశం ఉంటే దాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి వాటిని నివారించేలా యాంటీ వైబ్రేషన్ టెక్నాలజీ సైతం ఈ క్రూయిజ్ క్రాఫ్ట్‌లో ఉండనుంది. అంతా బాగానే ఉంది కానీ.. ప్రయాణికులు రోజుల తరబడి గాల్లో ప్రయాణించే క్రమంలో జెట్‌ల్యాగ్ తరహా అనారోగ్యానికి గురైతే ఎలా? ఈ డౌట్ విమానం డిజైనర్‌కు కూడా వచ్చింది. అందుకే ఇందులో ఒక అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కూడా డిజైన్ చేశారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సజీవ దహనం!
సాక్షి, చెన్నై : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బర్గూర్, ఉక్కులి, మిడ్నాపూర్ ప్రాంతాలకు చెందిన 70 మంది ఆగస్టు 22వ తేదీ విహార యాత్రకు వచ్చారు. మిడ్నాపూర్ నుంచి బస్సులో విహారయాత్రకు బయలు దేరిన ఈ బృందంలో అత్యధిక శాతం మంది 50 ఏళ్లకు పైబడ్డ వారే. అనేక ప్రాంతాలను సందర్శించిన ఈ బృందం శనివారం రామనాథపురం చేరుకుంది. రామనాథపురంలోని రామనాథ స్వామి దర్శనానంతరం అక్కడే వంటా వార్పుతో రాత్రి భోజనం ముగించారు. రాత్రి 11 గంటల సమయంలో కన్యాకుమారికి బయలుదేరారు. ఉదయాన్నే కన్యాకుమారిలో సూర్యోదయాన్ని వీక్షించాలన్న తపనతో వీరందరూ బయల్దేరారు. బస్సులో మంటలు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తిరుప్పులాని సమీపంలో బస్సు వెళుతుండగా, ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును హఠాత్తుగా నిలిపి వేసి, కిందకు దూకేశాడు. గాధ నిద్రలో ఉన్న ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. బస్సు నుంచి దూకేయాలంటూ పెద్దఎత్తున అతడు పెట్టిన కేకలకు కొందరు అప్రమత్తం అయ్యారు. తొలుత స్వల్పంగానే మంటలు చెలరేగడంతో కొందరు హుటాహుటిన బయటకు దూకేశారు. వృద్ధులు కిందకు దిగడంలో ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వంటావార్పునకు ఉపయోగించే సిలిండర్ బస్సులో ఉండడం, నిప్పురవ్వలు దాని మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ సిలిండర్ పేలుడు దాటికి మంటలు పూర్తిగా బస్సును ఆవహించాయి. లోపల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు కాలిన గాయాలతో బయట పడ్డారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో ఎవ్వరూ లేకపోవడం, అగ్నిమాపక కేంద్రానికి ఎలా సమాచారం ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డ వారు అయోమయూనికి గురయ్యూరు. గాయపడ్డవారు నరకయూతన పడ్డారు. చివరకు అటు వైపుగా వచ్చిన ఓ మోటార్ సైకిలిస్టు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు. సజీవ దహనం హుటాహుటీన తిరుప్వులాని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన అంబులెన్స్‌లు అక్కడికి పరుగులు తీశాయి. గాయపడ్డ వాళ్లను ఆగమేఘాలపై రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంటల్లో బస్సు లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది. అలాగే, పర్యాటకుల వస్తువులన్నీ బుగ్గి పాలయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చినానంతరం ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. భాష సమస్య ఊరు గాని ఊరొచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్‌వాసుల రోదన వర్ణనాతీతం. ఐదుగురు మృతి చెందగా, 8 మంది ఆసుపత్రి పలయ్యారు. మిగిలిన 50 మందిని అధికారులు అక్కున చేర్చుకున్నారు. అయితే, భాషా సమస్యతో నానా తంటాలు తప్పలేదు. మృతుల వివరాలు సేకరించడంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతులు, గాయపడ్డ వారిలో కొందరి పేర్లను పోలీసులు ప్రకటించారు. మృతుల్లో విశ్వనాథ దాసు(68), విశ్వనాథ అతుల్(78), దుర్గా శ్యామాదార్( 48), మాలతి(60), గోపాల్ శతృబాగాల్(70) ఉన్నారు. గాయపడ్డ వారిలో సుబాన్ మాల్ సతీమణి గపూర్ రాణి(40), నిఘార్ చంద్ర పాల్ సతీమణి బిజి బియాపాల్(50), కరుపొత్తమకాల్(68), శక్తి సుగన్(43), గాయత్రి బాగల్( 50), శైలేంద్ర రాజకుమార్ భార్య సూర్య రాజా తదితరులు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సులో చెలరేగిన మంటల తీవ్రత తక్కువేనని, అయితే, సిలిండర్ పేలడంతోనే భారీ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. స్వగ్రామాలకు తరలింపు ఏర్పాట్లు బస్సు మంటల్లో సర్వం కోల్పోయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డున పడ్డ 50 మందికి పైగా పశ్చిమ బెంగాల్ వాసులను ఆదుకునేందుకు రామనాధపురం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరందర్నీ తిరుప్పులానిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్టలను అందజేశారు. వీరిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు రామనాథపురం ఎంసీ అన్వర్‌రాజా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు రైలు ద్వారా వీరందరినీ పంపించేందుకు చర్యలు వేగవంతం చేశారు తమ వద్ద ఉన్న వివరాల మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించారు. -
సముద్ర తీర ప్రాంతాల సందర్శన
పాఠక పర్యటన మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు... ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల. మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్రోడ్లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్లో మా ప్రయాణం సాగింది. పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది. అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం. ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం. పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం. పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం. పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం. మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. -
కలలు కల్లలై..
బియాస్ దుర్ఘటనకు వారం అంతా బాగుంటే నేడు హైదరాబాద్‌కు వచ్చేవారు.. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఎడతెగని నిరీక్షణ సాక్షి, సిటీబ్యూరో: అంతా బాగుంటే ఆ విద్యార్థులంతా ఈ ఉదయమే నాంపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగేవాళ్లు. అడుగడుగునా ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవి. ఆ విద్యార్థులకు ఉత్తరాది విహారయాత్ర ఒక జీవితకాలపు మధుర జ్ఞాపకాలను కానుకగా ఇచ్చేదే. తమ సుదీర్ఘమైన ప్రయాణం గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు కథలుకథలుగా చెప్పి సంతోషించేవాళ్లే. తమ హృదయాల్లో నిక్షిప్తమైన ప్రతి జ్ఞాపకాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించేవాళ్లే. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన వారి విహారయాత్ర 14వ తేదీన ముగియవలసి ఉంది. కానీ విధి మృత్యువై వెంటాడింది. బియాస్ నది రూపంలో అమాయక విద్యార్థులను పొట్టనబెట్టుకుంది. ఎదురైన ప్రతి అనుభవాన్ని, రమణీయమైన ప్రకృతిని, ప్రతి సంద ర్భాన్ని ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ ఎంతో హాయిగా, ఆహ్లాదంగా, ఆనందభరితంగా సాగిపోతున్న విహార యాత్రను ఒక మహా విషాదంగా మార్చింది. నలబై ఎనిమిది మంది విద్యార్థులు స్నేహానికే నిర్వచనంగా సంతోషంగా సాగి స్తోన్న విహారయాత్రను చూసి కాలానికి కన్నుకుట్టింది. ఎంతోమంది తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చిన ఆ దారుణం జరిగి వారం కావస్తోంది. ఈ నెల 3వ తేదీన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లిన విద్యార్థులు 8వ తేదీ (ఆదివారం) వరకు ఆనందంగానే గడిపారు. కానీ ఆ సాయంత్రం బియాస్ నదీ తీరంలో రాళ్లల్లో, ఇసుకలో నించొని, కూర్చొని ఫోటోలు తీయించుకుంటున్న వేళ... మృత్యువు బియాస్ వరద ఉధృతై పోటెత్తింది. ఆ ప్రమాదంలో 24 మంది గల్లంతయ్యారు. మిగతా 24 మంది క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 48 మంది విద్యార్థులతో సాగిన బాచుపల్లి విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థుల విహారయాత్ర విషాదమిది. నదీ తీరంలోనే నిరీక్షణ 8వ తేదీ విద్యార్థులు గల్లంతైనట్లు తెలియగానే అప్పటికప్పుడు బయలుదేరి వె ళ్లిన తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ నది ఒడ్డునే కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. గుండెలవిసేలా ఏడుస్తున్నారు. బిడ్డలు తిరిగి వస్తారనో, జాడైనా తెలుస్తుందనో ఆశ. ఆ తల్లిదండ్రులు కంటి మీద రెప్ప వేయడం మరిచి వారం కావస్తోంది. ఆ రోజు నుంచీ నిరీక్షిస్తూనే ఉన్నారు. కొందరి మృతదేహాలు లభించాయి. ఇంకా దొరకవలసిన వారి జాడ అలాగే ఉంది. సుమారు 5000 మంది యన్డీఆర్ఐ, ఆర్మీ, ఐటీబీపీ, బీఎస్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు ఇంకా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కూడా పోలీసు శాఖకు చెందిన గజ ఈతగాళ్లు వెళ్లారు. ఇప్పటి వరకు... నగరానికి చెందిన లక్ష్మీగాయత్రి, గంపల ఐశ్వర్య, ఆకుల విజిత, నల్లగొండకు చెందిన బానోతు రాంబాబు మృతదేహాలు సోమవారమే లభ్యమయ్యాయి. మూడో రోజున అంబర్‌పేటకు చెందిన దేవశిష్ బోస్, ఆ మరుసటి రోజున శేరిలింగంపల్లికి చెందిన సాబేర్ హుస్సేన్, ఆ తరువాత వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మంకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభించాయి. వెరసి ఎనిమిది మంది ఆచూకీ లభించింది. ఇంకా మిగిలిన 16 మంది కోసం గ జ ఈతగాళ్లు నదిని గాలిస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. నీళ్లు చాలా చల్లగా ఉండటంతో పాటు పాండో డ్యామ్ సమీపంలో బురద ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మృతదేహాల గాలింపులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. -
పాపానివారిపల్లెలో విషాదఛాయలు
హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థిని తిరిగి రావాలని సొంతూరులో పూజలు వృత్తి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం బంగారుపాళెం: హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్రలో విద్యార్థులు గల్లంతు కావడం తో మండలంలోని పాపానివారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. పా పానివారిపల్లెకు చెందిన శ్రీనివాస్పాపా ని, రమ దంపతుల కుమారై పాపాని రిధియా హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. ఈనెల 3వ తేదీ కళాశాలకు చెందిన విద్యార్థులతో కలసి రిధియా విహారయాత్రకు వెళ్లింది. హిమాచల్‌ప్రదేశ్ సమీపంలో జరి గిన సంఘటనలో రిధియా గల్లంతైన విష యం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయా రు. శ్రీనివాసపాపాని కాంట్రాక్టరుగా పని చేస్తూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గత నెల 31న రిధియా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు బంధువులు తెలి పారు. గ్రామానికి వచ్చినప్పుడు బంధువులతో కలివిడిగా ఉండేదని, రిధియా క్షేమంగా తిరిగి రావాలని భగవంతున్ని వేడుకుంటూ, పూజలు చేస్తూ, పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. -
సెలవులే సెలవులు
విహార యాత్రలకు ఓటర్లు రెండు రోజులు సెలవు పెడితే తొమ్మిది రోజులు ‘ఎంజాయ్’ ఎన్నికల పట్ల నిరాసక్తి బెంగళూరులో ఈ ప్రభావం తీవ్రం సాధారణంగానే నగరంలో పోలింగ్ శాతం తక్కువ ఈ ఏడాది మండుతున్న ఎండలు ఓటింగ్‌కు దూరం కానున్న వృద్ధులు అభ్యర్థులకు ముచ్చెమటలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వరుసగా వస్తున్న సెలవులతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలోని మూడు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. సాధారణంగా బెంగళూరు నగరంలో ఓటింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటోంది. ఈ సారి మండుటెండలకు తోడు సెలవులు రావడంతో నగర వాసులు కుటుంబాలతో కలసి విహార యాత్రలకు చెక్కేస్తారేమోనని అభ్యర్థులు భీతిల్లుతున్నారు. వచ్చే గురువారం ఒకే దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 17న పోలింగ్ సందర్భంగా సెలవు, 18న గుడ్ ఫ్రైడే. మళ్లీ శనివారం, ఆదివారం వస్తాయి. అంటే...మంగళ, బుధవారాలు సెలవు పెడితే, ఎంచక్కా తొమ్మిది రోజుల పాటు కుటుంబంతో ఎక్కడైనా చుట్టి రావచ్చు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో 54.60 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఏడాది మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అంత కన్నా తక్కువగా 52.8 శాతం ఓట్లు పోలయ్యాయి. వరుసగా వచ్చి పడిన సెలవులతో తమ విజయావకాశాలు దెబ్బ తింటాయేమోనని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు, ఈ మండుటెండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి మడికేరి, ఊటీ, కొడెకైనాల్ లాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. కనుక పోలింగ్ పట్ల వారికి పెద్దగా ఆసక్తి ఉండబోదని భావిస్తున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా హైరానా పడిపోతున్నారు. యువకులు, మధ్య తరగతి కుటుంబాలను తమ ఓటు బ్యాంకుగా ఆ పార్టీ భావిస్తుంటుంది. విహార యాత్రలకు వెళ్లే వారు కూడా ఈ వర్గాల వారే అధికం. దిగువ తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలను సాధారణంగా కాంగ్రెస్ ఓటర్లుగా అంచనా వేస్తుంటారు. బీజేపీ ఓటు బ్యాంకుగా భావించే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ సంప్రదాయిక ఓటర్లే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుంటారు. ఈసారి బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని కూడా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. 37 డిగ్రీల సెల్సియస్ కారణంగా ఉక్కపోత వల్ల పగటి పూట అందరూ ఇళ్లలో ఉండడానికే ఇష్టపడుతుంటారు. 55 ఏళ్లు పైబడిన వారంతా ఈ ఎండల వల్ల ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చేమోనని అభ్యర్థుల్లో గుబులు ఏర్పడింది. నగరంలోని బెంగళూరు ఉత్తర, దక్షిణ, సెంట్రల్ నియోజక వర్గాలతో పాటు బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపురం నియోజక వర్గాల్లో పట్టణ ప్రాంత ఓటర్లే కీలకం.