
సెలవులే సెలవులు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వరుసగా వస్తున్న సెలవులతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలోని...
- విహార యాత్రలకు ఓటర్లు
- రెండు రోజులు సెలవు పెడితే తొమ్మిది రోజులు ‘ఎంజాయ్’
- ఎన్నికల పట్ల నిరాసక్తి
- బెంగళూరులో ఈ ప్రభావం తీవ్రం
- సాధారణంగానే నగరంలో పోలింగ్ శాతం తక్కువ
- ఈ ఏడాది మండుతున్న ఎండలు
- ఓటింగ్‌కు దూరం కానున్న వృద్ధులు
- అభ్యర్థులకు ముచ్చెమటలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వరుసగా వస్తున్న సెలవులతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలోని మూడు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. సాధారణంగా బెంగళూరు నగరంలో ఓటింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటోంది. ఈ సారి మండుటెండలకు తోడు సెలవులు రావడంతో నగర వాసులు కుటుంబాలతో కలసి విహార యాత్రలకు చెక్కేస్తారేమోనని అభ్యర్థులు భీతిల్లుతున్నారు. వచ్చే గురువారం ఒకే దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 17న పోలింగ్ సందర్భంగా సెలవు, 18న గుడ్ ఫ్రైడే. మళ్లీ శనివారం, ఆదివారం వస్తాయి. అంటే...మంగళ, బుధవారాలు సెలవు పెడితే, ఎంచక్కా తొమ్మిది రోజుల పాటు కుటుంబంతో ఎక్కడైనా చుట్టి రావచ్చు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో 54.60 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఏడాది మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అంత కన్నా తక్కువగా 52.8 శాతం ఓట్లు పోలయ్యాయి.
వరుసగా వచ్చి పడిన సెలవులతో తమ విజయావకాశాలు దెబ్బ తింటాయేమోనని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు, ఈ మండుటెండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి మడికేరి, ఊటీ, కొడెకైనాల్ లాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. కనుక పోలింగ్ పట్ల వారికి పెద్దగా ఆసక్తి ఉండబోదని భావిస్తున్నారు.
కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా హైరానా పడిపోతున్నారు. యువకులు, మధ్య తరగతి కుటుంబాలను తమ ఓటు బ్యాంకుగా ఆ పార్టీ భావిస్తుంటుంది. విహార యాత్రలకు వెళ్లే వారు కూడా ఈ వర్గాల వారే అధికం. దిగువ తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలను సాధారణంగా కాంగ్రెస్ ఓటర్లుగా అంచనా వేస్తుంటారు. బీజేపీ ఓటు బ్యాంకుగా భావించే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ సంప్రదాయిక ఓటర్లే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుంటారు.
ఈసారి బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని కూడా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి.
37 డిగ్రీల సెల్సియస్ కారణంగా ఉక్కపోత వల్ల పగటి పూట అందరూ ఇళ్లలో ఉండడానికే ఇష్టపడుతుంటారు. 55 ఏళ్లు పైబడిన వారంతా ఈ ఎండల వల్ల ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చేమోనని అభ్యర్థుల్లో గుబులు ఏర్పడింది. నగరంలోని బెంగళూరు ఉత్తర, దక్షిణ, సెంట్రల్ నియోజక వర్గాలతో పాటు బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపురం నియోజక వర్గాల్లో పట్టణ ప్రాంత ఓటర్లే కీలకం.