
కలలు కల్లలై..
అంతా బాగుంటే ఆ విద్యార్థులంతా ఈ ఉదయమే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్ దిగేవాళ్లు. అడుగడుగునా ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవి.
- బియాస్ దుర్ఘటనకు వారం
- అంతా బాగుంటే నేడు హైదరాబాద్‌కు వచ్చేవారు..
- బిడ్డల కోసం తల్లిదండ్రుల ఎడతెగని నిరీక్షణ
సాక్షి, సిటీబ్యూరో: అంతా బాగుంటే ఆ విద్యార్థులంతా ఈ ఉదయమే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్ దిగేవాళ్లు. అడుగడుగునా ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవి. ఆ విద్యార్థులకు ఉత్తరాది విహారయాత్ర ఒక జీవితకాలపు మధుర జ్ఞాపకాలను కానుకగా ఇచ్చేదే. తమ సుదీర్ఘమైన ప్రయాణం గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు కథలుకథలుగా చెప్పి సంతోషించేవాళ్లే. తమ హృదయాల్లో నిక్షిప్తమైన ప్రతి జ్ఞాపకాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించేవాళ్లే.
ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన వారి విహారయాత్ర 14వ తేదీన ముగియవలసి ఉంది. కానీ విధి మృత్యువై వెంటాడింది. బియాస్ నది రూపంలో అమాయక విద్యార్థులను పొట్టనబెట్టుకుంది. ఎదురైన ప్రతి అనుభవాన్ని, రమణీయమైన ప్రకృతిని, ప్రతి సంద ర్భాన్ని ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ ఎంతో హాయిగా, ఆహ్లాదంగా, ఆనందభరితంగా సాగిపోతున్న విహార యాత్రను ఒక మహా విషాదంగా మార్చింది.
నలబై ఎనిమిది మంది విద్యార్థులు స్నేహానికే నిర్వచనంగా సంతోషంగా సాగి స్తోన్న విహారయాత్రను చూసి కాలానికి కన్నుకుట్టింది. ఎంతోమంది తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చిన ఆ దారుణం జరిగి వారం కావస్తోంది. ఈ నెల 3వ తేదీన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లిన విద్యార్థులు 8వ తేదీ (ఆదివారం) వరకు ఆనందంగానే గడిపారు. కానీ ఆ సాయంత్రం బియాస్ నదీ తీరంలో రాళ్లల్లో, ఇసుకలో నించొని, కూర్చొని ఫోటోలు తీయించుకుంటున్న వేళ... మృత్యువు బియాస్ వరద ఉధృతై పోటెత్తింది. ఆ ప్రమాదంలో 24 మంది గల్లంతయ్యారు. మిగతా 24 మంది క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 48 మంది విద్యార్థులతో సాగిన బాచుపల్లి విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థుల విహారయాత్ర విషాదమిది.
నదీ తీరంలోనే నిరీక్షణ
8వ తేదీ విద్యార్థులు గల్లంతైనట్లు తెలియగానే అప్పటికప్పుడు బయలుదేరి వె ళ్లిన తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ నది ఒడ్డునే కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. గుండెలవిసేలా ఏడుస్తున్నారు. బిడ్డలు తిరిగి వస్తారనో, జాడైనా తెలుస్తుందనో ఆశ. ఆ తల్లిదండ్రులు కంటి మీద రెప్ప వేయడం మరిచి వారం కావస్తోంది. ఆ రోజు నుంచీ నిరీక్షిస్తూనే ఉన్నారు. కొందరి మృతదేహాలు లభించాయి. ఇంకా దొరకవలసిన వారి జాడ అలాగే ఉంది. సుమారు 5000 మంది యన్‌డీఆర్‌ఐ, ఆర్మీ, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌తో పాటు స్థానిక పోలీసులు ఇంకా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కూడా పోలీసు శాఖకు చెందిన గజ ఈతగాళ్లు వెళ్లారు.
ఇప్పటి వరకు...
నగరానికి చెందిన లక్ష్మీగాయత్రి, గంపల ఐశ్వర్య, ఆకుల విజిత, నల్లగొండకు చెందిన బానోతు రాంబాబు మృతదేహాలు సోమవారమే లభ్యమయ్యాయి. మూడో రోజున అంబర్‌పేటకు చెందిన దేవశిష్ బోస్, ఆ మరుసటి రోజున శేరిలింగంపల్లికి చెందిన సాబేర్ హుస్సేన్, ఆ తరువాత వనస్థలిపురానికి చెందిన అరవింద్, ఖమ్మంకు చెందిన ఉపేందర్ మృతదేహాలు లభించాయి. వెరసి ఎనిమిది మంది ఆచూకీ లభించింది. ఇంకా మిగిలిన 16 మంది కోసం గ జ ఈతగాళ్లు నదిని గాలిస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. నీళ్లు చాలా చల్లగా ఉండటంతో పాటు పాండో డ్యామ్ సమీపంలో బురద ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మృతదేహాల గాలింపులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.