విద్యార్థి వీసా.. హైదరాబాదీయే బాద్‌షా! | Hyderabad sent the most number of students in India to the US on F-1 | Sakshi
Sakshi News home page

విద్యార్థి వీసా.. హైదరాబాదీయే బాద్‌షా!

Published Sun, Dec 18 2016 5:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

విద్యార్థి వీసా.. హైదరాబాదీయే బాద్‌షా! - Sakshi

విద్యార్థి వీసా.. హైదరాబాదీయే బాద్‌షా!

- దేశంలో ఎక్కువగా ఇక్కడి యూఎస్‌ కాన్సులేట్‌ నుంచే ఎఫ్‌–1 వీసాలు
- ఈ వీసాల జారీలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఐదో స్థానం
- గతేడాదితో పోలిస్తే 40 శాతం అధికంగా వెళ్లిన విద్యార్థులు  


సాక్షి, హైదరాబాద్‌:
అమెరికాలో విద్యను అభ్యసించాలనుకునే తెలుగు విద్యార్థుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ విద్యార్థి (ఎఫ్‌–1) వీసాల జారీలో రికార్డు సృష్టిస్తోంది. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా ఏకంగా 50 వేలకుపైగా ఎఫ్‌–1 వీసాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వీసాల జారీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లలో హైదరాబాద్‌ కాన్సులేట్‌ ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.

భారీగా పెరిగిన విద్యార్థులు
మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు హైదరాబాద్‌ కాన్సులేట్‌ నుంచి వీసాలు పొందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. గత ఏడాది (2015)తో పోలిస్తే ఇది 40 శాతం అధికం కావడం గమనార్హం. దేశం మొత్తమ్మీద చూసినా అమెరికాలో చదువు కోవడానికి వీసాలు పొందిన వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగింది. మొత్తంగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వీసాలు ఇచ్చే కాన్సులేట్లలో హైదరాబాద్‌ కాన్సులేట్‌ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ఈ వీసాల సంఖ్యలో దేశాల వారీగా చూస్తే భారత్‌ రెండో స్థానంలో ఉన్నా... అమెరికా కాన్సులేట్ల వారీగా చూస్తే, హైదరాబాద్‌ దేశంలో మొదటి స్థానంలో, అంతర్జాతీయంగా ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో హైదరాబాద్‌ తర్వాత ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణే, కోల్‌కతాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ
అమెరికాలో చదువుకోవడానికి మన దేశం నుంచి ఐదేళ్ల కింద వెళ్లిన మొత్తం విద్యార్థుల కంటే... ఈసారి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన విద్యార్థులే 15 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. 2011లో భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లిన విద్యార్థులు (ఎఫ్‌–1 వీసాపై) 40 వేల మంది. అదే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 50 వేల మంది ఎఫ్‌–1 వీసాలు పొందారు. గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వీసాలు పొందినవారు సుమారు 36 వేల మంది. అమెరికాలో విద్య అభ్యసించడానికి వచ్చేవారు చదువు పూర్తి కాగానే తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలు తెలుగు విద్యార్థులపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పరాజయం పాలవుతారని దాదాపు అన్ని సర్వేలు పేర్కొనడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడేటప్పటికే రికార్డు స్థాయిలో హైదరాబాద్‌ కాన్సులేట్‌ నుంచి దాదాపు 48 వేల మంది ఎఫ్‌–1 వీసాలు పొందారు. డిసెంబర్‌ మొదటి వారం నాటికి మరో 2,500 మంది ఈ వీసాలు పొందారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement